Jos Buttler: నేనైతే బ్యాటర్‌ను వెనక్కి పిలిచేవాడిని: బట్లర్‌

ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ చార్లీ డీన్‌ను దీప్తిశర్మ రనౌట్‌ చేసిన తీరుపై చర్చ ఇంకా నడుస్తోంది. తాజాగా ఇంగ్లిష్‌ క్రికెటర్లు జోస్‌ బట్లర్‌, మొయిన్‌ అలీ.. నాన్‌స్ట్రైకర్‌ను ఇలా ఔట్‌ చేయడాన్ని తప్పుబట్టారు. తాను

Updated : 30 Sep 2022 09:42 IST

లండన్‌: ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ చార్లీ డీన్‌ను దీప్తిశర్మ రనౌట్‌ చేసిన తీరుపై చర్చ ఇంకా నడుస్తోంది. తాజాగా ఇంగ్లిష్‌ క్రికెటర్లు జోస్‌ బట్లర్‌, మొయిన్‌ అలీ.. నాన్‌స్ట్రైకర్‌ను ఇలా ఔట్‌ చేయడాన్ని తప్పుబట్టారు. తాను అయితే బ్యాటర్‌ను వెనక్కి పిలిచేవాడినని బట్లర్‌ పేర్కొన్నాడు. ‘‘ఎవరైనా ఇలా రనౌట్‌ చేయడాన్ని అంగీకరించరు. ఎందుకంటే క్రికెట్‌ అంటే బ్యాట్‌, బంతి మధ్య పోటీ జరగాలి. కానీ ఇలా వేరే విషయంపై చర్చ జరగకూడదు. నేనైతే అలా రనౌట్‌ అయిన బ్యాటర్‌ను వెనక్కి పిలిచేవాడిని’’ అని బట్లర్‌ అన్నాడు. తానెప్పుడూ ఇలా రనౌట్‌ చేయాలని కోరుకోనని మొయిన్‌ అలీ తెలిపాడు. ‘‘ఎవరి మీదైనా కోపం ఉంటే తప్ప నేను ఇలా రనౌట్‌ చేయను. ఒక బ్యాటర్‌ ఎప్పుడు క్రీజు వదులుతాడో అని ఎదురు చూసి బెయిల్స్‌ ఎగరగొట్టడం దారుణం. నేను చిన్నప్పుడు కూడా ఇలా ప్రవర్తించలేదు. నిబంధనల ప్రకారం సరైందే అయినప్పుడు చేస్తే తప్పేంటని వాదిస్తున్నారు. కానీ ఇలాంటి సంఘటనలు తరుచుగా జరగకుండా ఉండాలని కోరుకుంటున్నా’’ అని మొయిన్‌ అన్నాడు. ఇంగ్లాండ్‌ మహిళల జట్టుతో మూడో వన్డేలో చార్లీ డీన్‌ను రనౌట్‌ చేసిన దీప్తిశర్మ భారత్‌ను గెలిపించిన సంగతి తెలిసిందే. బట్లర్‌ కూడా మన్కడింగ్‌ బాధితుడే. 2019 ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌గా ఉన్న బట్లర్‌ను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌.. దీప్తి మాదిరే రనౌట్‌ చేసిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు