భారత్‌కు బుమ్రా షాక్‌

టాప్‌ఆర్డర్‌లో నిలకడలేమి.. నిఖార్సయిన స్పిన్‌ ఆల్‌రౌండర్‌ లేని వెలితి.. ఆఖరి ఓవర్లలో పేలవ బౌలింగ్‌.. భారత క్రికెట్‌ జట్టుకు ఈ సమస్యలు చాలవన్నట్లు పేస్‌ అస్త్రం జస్‌ప్రీత్‌ బుమ్రా కూడా అందుబాటులో లేకుండాపోయాడు! వెన్ను గాయం కారణంగా ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు అతడు దూరమయ్యాడు!

Updated : 30 Sep 2022 07:19 IST

గాయంతో ప్రపంచకప్‌ నుంచి పేసర్‌ ఔట్‌!
దిల్లీ

టాప్‌ఆర్డర్‌లో నిలకడలేమి.. నిఖార్సయిన స్పిన్‌ ఆల్‌రౌండర్‌ లేని వెలితి.. ఆఖరి ఓవర్లలో పేలవ బౌలింగ్‌.. భారత క్రికెట్‌ జట్టుకు ఈ సమస్యలు చాలవన్నట్లు పేస్‌ అస్త్రం జస్‌ప్రీత్‌ బుమ్రా కూడా అందుబాటులో లేకుండాపోయాడు! వెన్ను గాయం కారణంగా ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు అతడు దూరమయ్యాడు!

భారత జట్టు ప్రపంచకప్‌ ఆశలకు గట్టి ఎదురుదెబ్బ. పేస్‌ గన్‌ బుమ్రా వెన్ను గాయం కారణంగా విశ్వ సమరానికి అందుబాటులో లేకుండా పోయాడు. బుమ్రా ఆరు నెలలు ఆటకు దూరం కానున్నాడని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు. ‘‘బుమ్రా టీ20 ప్రపంచకప్‌ ఆడబోవట్లేదు. అందులో ఎలాంటి సందేహం లేదు. అతడి వెన్ను సమస్య తీవ్రమైందే. ఒత్తిడి వల్ల చిన్న చీలిక వచ్చింది. బుమ్రా కనీసం అరు నెలలు ఆటకు దూరమైనట్లే’’ అని చెప్పాడు. 28 ఏళ్ల బుమ్రాపై బీసీసీఐ వైద్య బృందం ఇంకొన్ని రోజుల్లో అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశముంది. అతడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించి, ప్రపంచకప్‌ ఆరంభం నుంచి కాకపోయినా.. కనీసం మధ్యలో నుంచైనా ఆడగలడా అన్నదాన్ని వైద్య బృందం అంచనా వేయనుంది. వెన్నుకు తాజా స్కాన్లు తీయించుకోవడం కోసం బుమ్రా బుధవారమే బెంగళూరు బయల్దేరాడు. బుమ్రా ప్రపంచకప్‌ నుంచి వైదొలగిన రెండో సీనియర్‌ స్టార్‌ ఆటగాడు అవుతాడు. మోకాలి గాయం వల్ల ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఇప్పటికే మెగా టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే. శస్త్రచికిత్స చేయించుకున్న జడేజా.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లను కోల్పోవడం టీమ్‌ఇండియా సమస్యలను పెంచేదే. ‘‘బుమ్రా, జడేజాల సేవలను కోల్పోవడం భారత్‌కు చాలా పెద్ద దెబ్బ. ఇలా జరుగుతుందని ఏమాత్రం ఊహించలేదు. బుమ్రా అసలు ఆస్ట్రేలియాతో సిరీస్‌లోనైనా ఫిట్‌గా ఉన్నాడా అన్న అనుమానం కలుగుతోంది’’ అని బీసీసీఐ అధికారి అన్నాడు. పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ సీనియర్‌ ఆటగాళ్లకు ఇటీవల కాలంలో బాగానే విశ్రాంతినిచ్చింది. బుమ్రా 2022లో ఐపీఎల్‌ కాకుండా అయిదేసి టెస్టులు, వన్డేలు, టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ‘‘బుమ్రా ఎక్కువ క్రికెట్టేమీ ఆడలేదు. అతడికి చాలా విశ్రాంతి లభించింది. ఇప్పుడు అతడు జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఉన్నాడు. బుమ్రా కోలుకునే ప్రక్రియ సుదీర్ఘమైంది. ప్రపంచకప్‌ ముఖ్యమైందే. కానీ బుమ్రా విషయంలో అనసవర సాహసాలు చేయలేం. అతడిప్పటికీ కుర్రాడే’’ అని బోర్డు అధికారి చెప్పాడు.


మళ్లీ మళ్లీ..

బుమ్రాకు వెన్ను గాయం పెద్ద సమస్యగా మారింది. అతడు ఈ గాయం వల్ల ఆగస్టు-సెప్టెంబరులో ఆసియాకప్‌కు దూరమయ్యాడు. కోలుకున్న అతడు సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌తో పునరాగమనం చేశాడు. కానీ ఆ సిరీస్‌లోనూ తొలి మ్యాచ్‌లో ఆడలేదు. సెప్టెంబరు 23, 25వ తేదీల్లో రెండు, మూడో మ్యాచ్‌ల్లో ఆడాడు. గాయం తిరగబెట్టడంతో తిరిగి బుధవారం దక్షిణాఫ్రికాతో మొదటి టీ20లో ఆడలేదు. ‘‘బుమ్రా మంగళవారం ప్రాక్టీస్‌ సెషన్‌ సందర్భంగా వెన్ను నొప్పి గురించి చెప్పాడు. బీసీసీఐ వైద్య బృందం అతణ్ని పరిశీలిస్తోంది’’ అని బీసీసీఐ ట్విటర్లో పేర్కొంది. బుమ్రాకు వెన్ను నొప్పి కొత్తేమీ కాదు. 2019 సెప్టెంబరులో ఈ గాయానికి గురయ్యాడు. ఫలితంగా దాదాపు మూడు నెలలు ఆటకు దూరమయ్యాడు. బుమ్రా గాయానికి శస్త్రచికిత్స అవసరం లేదు. కానీ కోలుకోవడానికి సమయం పడుతుంది. బుమ్రా బౌలింగ్‌ శైలి వల్ల అతడి వెన్నుపై చాలా భారంపడుతుంది. అతడికి వెన్ను గాయాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వెస్టిండీస్‌ పేస్‌ దిగ్గజం మైకెల్‌ హోల్డింగ్‌ గతంలోనే చెప్పాడు.


రేసులో షమి, చాహర్‌

ప్రపంచకప్‌ జట్టులో బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడానికి ఫాస్ట్‌బౌలర్లు మహ్మద్‌ షమి, దీపక్‌ చాహర్‌ మధ్య పోటీ ఉంది. వీళ్లిద్దరూ ఇప్పటికే స్టాండ్‌బైలు అన్న సంగతి తెలిసిందే. చాహర్‌ దక్షిణాఫ్రికాతో తొలి టీ20లో స్వింగ్‌ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్‌కు షమి జట్టుకు ఎంపికైనా.. కరోనా కారణంగా దూరమయ్యాడు. ఇద్దరిలో సెలక్టర్లు ఎవరివైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరం. సిరాజ్‌ పేరు కూడా వినిపిస్తోంది. ఐసీసీ అనుమతి లేకుండా జట్టులో మార్పులు చేసుకోవడానికి భారత్‌కు అక్టోబరు 15 వరకు అవకాశముంది. ప్రపంచకప్‌ సూపర్‌ 12 రౌండ్లో భారత్‌.. పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, రెండు క్వాలిఫయింగ్‌ జట్లతో కలిసి గ్రూప్‌-2లో ఉంది. అక్టోబరు 23న పాకిస్థాన్‌తో పోరుతో భారత్‌ కప్పు వేటను ఆరంభిస్తుంది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని