అమ్మాయిలైనా.. అందుకునేనా?

అబ్బాయిలు నిరాశపరిచారు. మరి అమ్మాయిలైనా సాధిస్తారా..? మహిళల ఆసియా కప్‌కు సమయం ఆసన్నమైంది. నాలుగేళ్ల విరామం తర్వాత ఆసియా ఖండంలోని అత్యుత్తమ జట్ల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది.

Published : 01 Oct 2022 02:53 IST

శ్రీలంకతో  టీమ్‌ఇండియా ఢీ
నేటి నుంచే మహిళల ఆసియా కప్‌

సిల్‌హట్‌ (బంగ్లాదేశ్‌)

బ్బాయిలు నిరాశపరిచారు. మరి అమ్మాయిలైనా సాధిస్తారా..? మహిళల ఆసియా కప్‌కు సమయం ఆసన్నమైంది. నాలుగేళ్ల విరామం తర్వాత ఆసియా ఖండంలోని అత్యుత్తమ జట్ల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. శనివారమే ఈ టీ20 టోర్నీకి తెరలేవనుంది. ఏడు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీ ఆతిథ్య బంగ్లాదేశ్‌, థాయ్‌లాండ్‌ పోరుతో మొదలవనుంది. 2020లో జరగాల్సిన టోర్నీ కరోనా కారణంగా మొదట 2021కి వాయిదా పడి, ఆ తర్వాత రద్దయింది. టోర్నీ తొలి రోజు రెండో మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్‌ తలపడుతుంది. పాకిస్థాన్‌, యూఏఈ, మలేసియా ఈ టోర్నీలో బరిలో ఉన్న మరో మూడు జట్లు. ఆసియా కప్‌ ఆరంభ సీజన్‌ నుంచి వరుసగా ఆరు టైటిళ్లు ఖాతాలో వేసుకున్న టీమ్‌ఇండియా.. గత టోర్నీలో మాత్రం ఫైనల్లో బంగ్లా చేతిలో ఓడింది. తాజాగా ఇంగ్లాండ్‌పై 3-0తో చారిత్రక వన్డే సిరీస్‌ దక్కించుకున్న హర్మన్‌ సేన జోరుమీదుంది. ఈ టోర్నీలో భారతే ఫేవరేట్‌. కానీ టీ20ల్లో ఇటీవల జట్టు ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. కామన్వెల్త్‌ క్రీడల టీ20 టోర్నీలో రజతం గెలిచిన జట్టు.. ఇంగ్లాండ్‌లో సిరీస్‌ ఓడింది. మరోవైపు ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ చార్లీ డీన్‌ను దీప్తి మన్కడింగ్‌ రనౌట్‌ చేయడంపై చర్చ కొనసాగుతూనే ఉంది. దీని నుంచి బయటకు వచ్చి టీ20ల్లో భారత్‌ సత్తాచాటాల్సిన అవసరం ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాలో టీ20 ప్రపంచకప్‌ ఆరంభమవుతుంది. ఆ కప్పుపై కన్నేసిన జట్టు ఆసియా కప్‌లో అత్యుత్తమ ప్రదర్శనపై దృష్టి సారించింది. ఇంగ్లాండ్‌తో వన్డేల్లో కెప్టెన్‌ హర్మన్‌ ఫామ్‌ అందుకోవడం జట్టు బలాన్ని మరింత పెంచేదే. స్మృతి మంధాన కూడా దూకుడు మీదుంది. షెఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, హేమలత జోరందుకుంటే బ్యాటింగ్‌లో తిరుగుండదు. గాయం నుంచి కోలుకున్న జెమీమా జట్టులో చేరడం లాభించే అంశం. పేసర్లు రేణుక, మేఘన, స్పిన్నర్లు రాధ, రాజేశ్వరి, దీప్తి బౌలింగ్‌లో కీలకం కానున్నారు. మరోవైపు కెప్టెన్‌ చమరి ఆటపట్టుపై శ్రీలంక అతిగా ఆధారపడుతోంది. ఆ జట్టు స్పిన్నర్లతో మన బ్యాటర్లు జాగ్రత్తగా ఉండాలి.

* ఏడు జట్లు తలపడుతున్న టోర్నీ రౌండ్‌ రాబిన్‌ ఫార్మాట్లో జరుగుతుంది. ఒక్కో జట్టు మిగతా ఆరింటితో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. లీగ్‌ దశ మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీస్‌లో తలపడతాయి.* 2004లో మహిళల ఆసియా కప్‌ మొదలైనప్పటి నుంచి భారత్‌ వరుసగా ఆరు టైటిళ్లు సొంతం చేసుకుంది. వన్డే ఫార్మాట్లో నాలుగు, టీ20ల్లో రెండు నెగ్గింది. 2012 నుంచి ఈ టోర్నీని పొట్టి ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. 2018లో మాత్రం బంగ్లాదేశ్‌ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts