ఇండియాదే టైటిల్‌

రోడ్‌ భద్రత సిరీస్‌ టీ20 టోర్నీలో ఇండియా లెజెండ్స్‌ విజేతగా నిలిచింది. శనివారం రాత్రి ఫైనల్లో ఇండియా 33 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. మొదట నమన్‌ ఓజా (108 నాటౌట్‌: 71 బంతుల్లో 15×4, 2×6) మెరుపు సెంచరీ చేయడంతో భారత్‌ 6 వికెట్లకు 195 పరుగుల భారీ స్కోరు సాధించింది.

Published : 02 Oct 2022 02:35 IST

గువాహటి: రోడ్‌ భద్రత సిరీస్‌ టీ20 టోర్నీలో ఇండియా లెజెండ్స్‌ విజేతగా నిలిచింది. శనివారం రాత్రి ఫైనల్లో ఇండియా 33 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. మొదట నమన్‌ ఓజా (108 నాటౌట్‌: 71 బంతుల్లో 15×4, 2×6) మెరుపు సెంచరీ చేయడంతో భారత్‌ 6 వికెట్లకు 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. వినయ్‌ కుమార్‌ (36) రాణించాడు. లంక బౌలర్లలో కులశేఖర (3/29), ఉదాన (2/34) సత్తా చాటారు. అనంతరం లంక 18.5 ఓవర్లల్లో 162 పరుగులకే పరిమితమైంది. ఇషాన్‌ జయరత్నె (51) టాప్‌ స్కోరర్‌. వినయ్‌ కుమార్‌ (3/38), అభిమన్యు మిథున్‌ (2/27) ఆ జట్టును కట్టడి చేశారు.


సిక్కి జోడీ పరాజయం

హోచి మిన్‌: సిక్కి రెడ్డి, రోహన్‌ కపూర్‌ జంట వియత్నాం ఓపెన్‌ సూపర్‌ 100 బ్యాడ్మింటన్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో ఈ జోడీ 16-21, 14-21తో రెహాన్‌ నౌఫల్‌ కుషర్జంటో- లిసా అయు కుసుమావతి (ఇండోనేషియా) ద్వయం చేతిలో పరాజయంపాలైంది.   సిక్కి జోడీ ఓటమితో టోర్నీలో భారత్‌ కథ ముగిసింది.


నాకౌట్‌కు పంకజ్‌

కౌలాలంపూర్‌: ప్రపంచ 6-రెడ్‌ స్నూకర్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ పంకజ్‌ అడ్వాణీ నాకౌట్‌కు అర్హత సాధించాడు. ఈ టోర్నీలో గ్రూప్‌ దశలో మొదట మహ్మద్‌ ఇమీష్‌పై 4-0తో గెలిచిన పంకజ్‌.. ఆ తర్వాత బాట్‌ ఒచిర్‌ (మంగోలియా)ను 4-1తో ఓడించాడు. ఆపై చంగ్‌ లియోంగ్‌ (మలేసియా)పై 4-2తో నెగ్గి ముందంజ వేశాడు. చంగ్‌తో పోరులో తొలి రెండు ఫ్రేమ్‌లు నెగ్గి అడ్వాణీ 2-0 ఆధిక్యంలో నిలిచినా.. మూడో ఫ్రేమ్‌ను చంగ్‌ దక్కించుకున్నాడు. కానీ పుంజుకున్న భారత స్టార్‌ వరుసగా రెండు ఫ్రేమ్‌లు గెలిచి మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగే రౌండ్‌ ఆఫ్‌ 32లో లిమ్‌ లియెంగ్‌ (మలేసియా)తో పంకజ్‌ పోటీపడనున్నాడు. అతడితో పాటు లక్ష్మణ్‌, ధ్వజ్‌ హరియా, కమల్‌ చావ్లా, శ్రీకృష్ణ కూడా నాకౌట్‌కు అర్హత సాధించారు.


ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌పైనే దృష్టి: ప్రణయ్‌

సూరత్‌: బ్యాడ్మింటన్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీపైనే దృష్టి పెట్టినట్లు భారత స్టార్‌ షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ చెప్పాడు. ‘‘ప్రస్తుతం నా దృష్టంతా బ్యాడ్మింటన్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌పైనే ఉంది. ఈ టోర్నీకి ముందు ఒకటి రెండు టోర్నీలు కూడా ఉన్నాయి. వీటిలో రాణించి ప్రపంచ టూర్‌ టోర్నీకి ఆత్మవిశ్వాసం పుంజుకోవాలని భావిస్తున్నా. గతేడాది నుంచి నా ప్రదర్శన పట్ల ఎంతో సంతోషంగా ఉన్నా. టాప్‌-10లోకి రావాలనే లక్ష్యంతో ఉన్నా. ఇందుకు స్థిరంగా రాణించాల్సి ఉంది. అప్పుడు ప్రపంచ టూర్‌ టోర్నీలో మెరుగైన డ్రా పడుతుంది. సెప్టెంబర్‌ తొలి వారంలో జపాన్‌ ఓపెన్లో ఆడిన తర్వాత మళ్లీ కోర్టులో దిగలేదు. కానీ శిక్షణ ఆపలేదు’’ అని ప్రణయ్‌ అన్నాడు. ఈ మేలో థామస్‌కప్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన ప్రణయ్‌.. స్విస్‌ ఓపెన్‌, బీడబ్ల్యూఎఫ్‌ 300 ఈవెంట్లలో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మలేసియా మాస్టర్స్‌, ఇండోనేసియా ఓపెన్లలో సెమీస్‌ చేరాడు. ప్రస్తుతం అతడు 15వ ర్యాంకులో ఉన్నాడు. డిసెంబర్‌ 14న గాంగ్జూలో ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ ఏడాది 13 టోర్నీల్లో ఆడిన ప్రణయ్‌.. 58,090 పాయింట్లతో ప్రపంచ టూర్‌ టోర్నీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు.

 


హైదరాబాద్‌ స్ట్రైకర్స్‌ జట్టులో రహీన్‌

ఈనాడు, హైదరాబాద్‌: టెన్నిస్‌ ప్రిమియర్‌ లీగ్‌ (టీపీఎల్‌) నాలుగో సీజన్‌లో పాల్గొనే హైదరాబాద్‌ స్ట్రైకర్స్‌ జట్టులో రహీన్‌ చోటు దక్కించుకుంది. శనివారం ఎల్బీ స్టేడియంలో ఆరంభమైన ప్రతిభాన్వేషణ టోర్నీ అమ్మాయిల అండర్‌-18 విభాగంలో ఆమె ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో సామ చెవికపై నెగ్గిన ఆమె రూ.30 వేల నగదు బహుమతితో పాటు టీపీఎల్‌లో హైదరాబాద్‌ స్ట్రైకర్స్‌కు ఆడే అవకాశం కొట్టేసింది. ఈ టోర్నీలో బాలుర అండర్‌-14, పురుషుల, మహిళల పోటీలూ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీలో ఉత్తమ ప్రదర్శన చేసిన ప్లేయర్లను టీపీఎల్‌లో ఆడే హైదరాబాద్‌ స్ట్రైకర్స్‌ జట్టుకు ఎంపిక చేస్తారు. ఈ టోర్నీ ఆరంభోత్సవ కార్యక్రమంలో శాట్స్‌ ఛైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, టెన్నిస్‌ ఆటగాడు విష్ణువర్ధన్‌, హైదరాబాద్‌ స్ట్రైకర్స్‌ యజమాని బ్రిజ్‌గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ టీపీఎల్‌ నాలుగో సీజన్‌ డిసెంబర్‌ 7న ఆరంభమవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని