పట్టేస్తారా ఇంకో సిరీస్‌?

టీ20 ప్రపంచకప్‌ ముంగిట ఒక దాని తర్వాత ఒకటి గాయాల దెబ్బలు తగులుతున్నా.. కొందరు ఆటగాళ్ల ఫామ్‌పై అనిశ్చితి కొనసాగుతున్నా.. వరుసబెట్టి ద్వైపాక్షిక సిరీస్‌లు గెలుస్తున్న టీమ్‌ఇండియాకు మరో అవకాశం వచ్చింది. దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల పోరులో ఇప్పటికే శుభారంభం చేసిన భారత్‌.. ఆదివారం రెండో టీ20లోనూ నెగ్గి సిరీస్‌ సాధించాలని పట్టుదలతో ఉంది.

Updated : 02 Oct 2022 07:26 IST

దక్షిణాఫ్రికాతో భారత్‌ రెండో టీ20 నేడే
రాత్రి 7 నుంచి

టీ20 ప్రపంచకప్‌ ముంగిట ఒక దాని తర్వాత ఒకటి గాయాల దెబ్బలు తగులుతున్నా.. కొందరు ఆటగాళ్ల ఫామ్‌పై అనిశ్చితి కొనసాగుతున్నా.. వరుసబెట్టి ద్వైపాక్షిక సిరీస్‌లు గెలుస్తున్న టీమ్‌ఇండియాకు మరో అవకాశం వచ్చింది. దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల పోరులో ఇప్పటికే శుభారంభం చేసిన భారత్‌.. ఆదివారం రెండో టీ20లోనూ నెగ్గి సిరీస్‌ సాధించాలని పట్టుదలతో ఉంది. ప్రపంచకప్‌ ముంగిట ఇదే చివరి టీ20 సిరీస్‌ కావడంతో ఆఖరి మ్యాచ్‌ వరకు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ముందే సిరీస్‌ నెగ్గాలని రోహిత్‌ సేన భావిస్తోంది.

టీ20ల్లో ప్రపంచ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాపై సిరీస్‌ నెగ్గిన ఊపులో దక్షిణాఫ్రికాతో తొలి టీ20లో బంతితో, బ్యాటుతో చెలరేగి అలవోకగా విజయం సాధించిన టీమ్‌ఇండియా.. ఇప్పుడు సిరీస్‌ విజయంపై కన్నేసింది. ఆదివారం రోహిత్‌ సేన దక్షిణాఫ్రికాను రెండో టీ20లో ఢీకొనబోతోంది. తొలి మ్యాచ్‌ జరిగిన తీరు చూస్తే.. సఫారీలను ఓడించడం భారత్‌కు కష్టమేమీ కాదనే అనిపిస్తోంది. కానీ డికాక్‌, మార్‌క్రమ్‌, రబాడ, షంసి లాంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో కూడిన దక్షిణాఫ్రికాను అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ప్రత్యర్థి ఈ మ్యాచ్‌లో బలంగా పుంజుకోవడానికి ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు.

ఆ భయాలు వెంటాడుతుండగా..
ఇప్పటికే రవీంద్ర జడేజా టీ20 ప్రపంచకప్‌కు దూరమవడంతో ఇబ్బంది పడుతున్న టీమ్‌ఇండియాకు తాజాగా మరో ఎదురు దెబ్బ తగిలింది. వెన్ను గాయంతో ఫాస్ట్‌బౌలర్‌ బుమ్రా దాదాపుగా ఈ మెగా టోర్నీకి దూరమైనట్లే కనిపిస్తున్నాడు. ఇది భారత జట్టును మానసికంగా దెబ్బ తీసేదే. అయినా సరే.. ఆ ప్రభావం కనిపించనివ్వకుండా దక్షిణాఫ్రికాపై మరోసారి చెలరేగాలని రోహిత్‌ సేన ఆశిస్తోంది. అయితే సిరీస్‌లో ఇంకెవరైనా గాయపడి ప్రపంచకప్‌కు దూరం అవుతారా అన్న భయం భారత్‌ను వెంటాడుతోంది. అలా జరగకుండా చూసుకోవడం ముఖ్యమే. సూర్యకుమార్‌ సూపర్‌ ఫామ్‌లో కొనసాగుతుండటం, కేఎల్‌ రాహుల్‌ కూడా లయ అందుకోవడం భారత్‌కు సానుకూలాంశం. కోహ్లి, రోహిత్‌ నిలకడ సాధించడం అవసరం. తొలి టీ20లో పంత్‌, కార్తీక్‌లిద్దరికీ తుది జట్టులో చోటిచ్చిన భారత్‌.. ఈ మ్యాచ్‌లోనూ అలాగే చేయొచ్చు. మరి బ్యాటింగ్‌ చేసే అవకాశం వస్తే వీళ్లిద్దరూ ఏమాత్రం ఉపయోగించుకుంటారో చూడాలి. హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌లో కొంచెం మెరుగుపడాల్సి ఉంది. సీనియర్లు నిరాశ పరుస్తున్న సమయంలో యువ పేసర్‌ అర్ష్‌దీప్‌తో పాటు దీపక్‌ చాహర్‌ తొలి టీ20లో విజృంభించడం భారత్‌కు గొప్ప ఊరటే. వారి నుంచి ఆదివారం కూడా ఇదే ప్రదర్శనను ఆశిస్తోంది భారత్‌. దీపక్‌ ఈ మ్యాచ్‌లోనూ ఆకట్టుకుంటే బుమ్రా స్థానంలో ప్రపంచకప్‌కు ఎంపికైనట్లే. మరో పేసర్‌ హర్షల్‌ పటేల్‌ కూడా లయ అందుకోవడం మంచి పరిణామం.

పుంజుకుంటారా?: తొలి టీ20లో ప్రదర్శన పట్ల దక్షిణాఫ్రికా షాకయ్యే ఉంటుంది. కేవలం 9 పరుగులకే ఆ జట్టు 5 వికెట్లు కోల్పోవడం అనూహ్యం. ఆ తర్వాత కొంచెం పుంజుకుని వందకు పైగా స్కోరు చేయగలిగింది. డికాక్‌, బవుమా, రొసో, మార్‌క్రమ్‌, మిల్లర్‌లతో బలంగానే కనిపిస్తున్న బ్యాటింగ్‌ లైనప్‌ ఆదివారం ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. వాళ్లు ఓ మోస్తరు స్కోరు చేసినా.. రబాడ, నోకియా, పార్నెల్‌, షంసిలతో కూడిన బౌలింగ్‌ విభాగం కాచుకోగలదు. ఆ జట్టు కసిగా ఆడే అవకాశం ఉంది కాబట్టి టీమ్‌ఇండియా జాగ్రత్తగా ఉండాల్సిందే.

తుది జట్లు (అంచనా)... భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), రాహుల్‌, కోహ్లి, సూర్యకుమార్‌, హార్దిక్‌, పంత్‌, దినేశ్‌ కార్తీక్‌, అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌, హర్షల్‌, దీపక్‌ చాహర్‌, అర్ష్‌దీప్‌.

దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్‌), డికాక్‌, రొసో, మార్‌క్రమ్‌, మిల్లర్‌, స్టబ్స్‌, పార్నెల్‌, కేశవ్‌ మహరాజ్‌, రబాడ, నోకియా, షంసి.

* గువాహటిలో భారత జట్టు ఒక్క టీ20నే ఆడింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్‌ 118 పరుగులకే కుప్పకూలి, 8 వికెట్ల తేడాతో ఓడింది. మరో టీ20 వర్షం వల్ల ఒక్క బంతీ పడకుండానే రద్దయింది. ఆదివారం కూడా వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించొచ్చని సమాచారం. ఇక్కడి పిచ్‌ బౌలర్లకు, ముఖ్యంగా పేసర్లకు బాగా అనుకూలిస్తుంది. బ్యాట్స్‌మెన్‌ క్రీజులో కుదురుకుంటే పరుగులు చేయొచ్చు. భారీ స్కోర్లయితే నమోదు కాకపోవచ్చు. టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్‌ ఎంచుకునే అవకాశముంది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts