సంక్షిప్త వార్తలు (2)

ప్రపంచ టీటీ టీమ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత పురుషుల జట్టు సంచలనం నమోదు చేసింది. ప్రపంచ రెండో ర్యాంకర్‌ జర్మనీకి షాకిచ్చింది. ఆదివారం గ్రూప్‌-2 మ్యాచ్‌లో భారత్‌ 3-1 తేడాతో రెండో సీడ్‌ జర్మనీపై విజయం సాధించింది. గొప్పగా పోరాడి రెండు సింగిల్స్‌ మ్యాచ్‌లు గెలిచిన భారత స్టార్‌ ఆటగాడు సత్యన్‌ ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Updated : 03 Oct 2022 04:31 IST

జర్మనీకి షాకిచ్చిన భారత్‌

ప్రపంచ టీటీ

చెంగ్డూ: ప్రపంచ టీటీ టీమ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత పురుషుల జట్టు సంచలనం నమోదు చేసింది. ప్రపంచ రెండో ర్యాంకర్‌ జర్మనీకి షాకిచ్చింది. ఆదివారం గ్రూప్‌-2 మ్యాచ్‌లో భారత్‌ 3-1 తేడాతో రెండో సీడ్‌ జర్మనీపై విజయం సాధించింది. గొప్పగా పోరాడి రెండు సింగిల్స్‌ మ్యాచ్‌లు గెలిచిన భారత స్టార్‌ ఆటగాడు సత్యన్‌ ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి సింగిల్స్‌లో సత్యన్‌ 11-13, 4-11, 11-8, 11-4, 11-9తో బెనెడిక్‌పై నెగ్గి జట్టుకు శుభారంభం అందించాడు. రెండో సింగిల్స్‌లో హర్మీత్‌ దేశాయ్‌ 7-11, 9-11, 13-11, 3-11తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ డాంగ్‌ చేతిలో ఓడాడు. ఆ దశలో మానవ్‌ 13-11, 6-11, 11-8, 12-10తో రికార్డోపై గెలిచి 2-1తో జట్టును మళ్లీ ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. తన రెండో సింగిల్స్‌ మ్యాచ్‌లో సత్యన్‌ 10-12, 7-11, 11-8, 11-8, 11-9తో డాంగ్‌ను ఓడించాడు. ఆడిన రెండు మ్యాచ్‌లూ గెలిచిన భారత్‌.. గ్రూప్‌లో ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. గ్రూప్‌ దశ ముగిసే సరికి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధిస్తాయి. మరోవైపు మహిళల జట్టు బోణీ కొట్టింది. గ్రూప్‌-5లో తమ తొలి మ్యాచ్‌లో జర్మనీ చేతిలో ఓడిన అమ్మాయిలు.. రెండో మ్యాచ్‌లో 3-0తో చెక్‌ రిపబ్లిక్‌పై గెలిచారు. మనిక 11-6, 11-6, 8-11, 12-10తో మతెలోవాపై, ఆకుల శ్రీజ 11-5, 11-3, 11-8తో మార్కెటాపై, దియా 11-13, 15-13, 12-10, 14-12తో కేథరినాపై నెగ్గారు.


సౌరభ్‌ ఆల్‌రౌండ్‌ మెరుపులు
ఇరానీ ట్రోఫీపై రెస్టాఫ్‌ ఇండియా పట్టు

రాజ్‌కోట్‌: సౌరభ్‌ కుమార్‌ (55; 2/0) ఆల్‌రౌండ్‌ మెరుపులతో ఇరానీ ట్రోఫీపై రెస్టాఫ్‌ ఇండియా మరింత పట్టు బిగించింది. సౌరాష్ట్రను తొలి ఇన్నింగ్స్‌లో 98 పరుగులకే కుప్పకూల్చిన రెస్ట్‌.. జవాబుగా 374 పరుగులు సాధించింది. 276 పరుగుల భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. ఓవర్‌నైట్‌ స్కోరు 205/3తో రెండో రోజు, ఆదివారం ఇన్నింగ్స్‌ కొనసాగించిన రెస్ట్‌ను సర్ఫ్‌రాజ్‌ ఖాన్‌ (138; 178 బంతుల్లో 20×4, 2×6), కెప్టెన్‌ హనుమ విహారి (82; 184 బంతుల్లో 11×4, 1×6) కాసేపు నడిపించారు. ఓవర్‌నైట్‌ స్కోరుకు విహారి 20, సర్ఫ్‌రాజ్‌ 13 పరుగులు జోడించి వెనుదిరగ్గా.. భరత్‌ (12) కూడా ఎంతోసేపు నిలవలేదు. దీంతో రెస్ట్‌ ఒక దశలో 264/6కు చేరుకుంది. ఈ స్థితిలో సౌరభ్‌ కుమార్‌ (55; 78 బంతుల్లో 10×4).. జయంత్‌ యాదవ్‌ (37; 96 బంతుల్లో 6×4)తో కలిసి స్కోరును 300 దాటించాడు. సౌరాష్ట్ర బౌలర్లలో చేతన్‌ సకారియా (5/93), జైదేవ్‌ ఉనద్కత్‌ (2/100), చిరాగ్‌ జానీ (2/58) రాణించారు. రెండో ఇన్నింగ్స్‌ను సౌరాష్ట్ర మెరుగ్గానే ఆరంభించినా.. సౌరభ్‌ కుమార్‌ ధాటికి స్వల్ప వ్యవధిలో హార్విక్‌ దేశాయ్‌ (20), స్నెల్‌ పటేల్‌ (16)ల వికెట్లు చేజార్చుకుంది. ఆట చివరికి చిరాగ్‌ (3), ధర్మేంద్ర సింగ్‌ (8) క్రీజులో ఉన్నారు. ఆ జట్టు ఇంకా 227 పరుగులు వెనుకబడి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని