మైదానంలో మహా విషాదాలు

ఇండోనేషియాలోని ఫుట్‌బాల్‌ మైదానంలో జరిగిన దారుణ ఘటన క్రీడా ప్రపంచాన్ని కదిలించింది. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూద్దామని వచ్చిన ప్రేక్షకుల్లో 125 మంది అభిమానులు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడం పెద్ద విషాదమే. ప్రపంచవ్యాప్తంగా క్రీడా మైదానాల్లో ఆట చూసేందుకు వచ్చిన అభిమానులు ప్రాణాలు పొగొట్టుకున్న దుర్ఘటనలు చాలానే ఉన్నాయి. అందులో కొన్ని...

Updated : 03 Oct 2022 09:22 IST

ఈనాడు క్రీడావిభాగం

ఇండోనేషియాలోని ఫుట్‌బాల్‌ మైదానంలో జరిగిన దారుణ ఘటన క్రీడా ప్రపంచాన్ని కదిలించింది. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూద్దామని వచ్చిన ప్రేక్షకుల్లో 125 మంది అభిమానులు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడం పెద్ద విషాదమే. ప్రపంచవ్యాప్తంగా క్రీడా మైదానాల్లో ఆట చూసేందుకు వచ్చిన అభిమానులు ప్రాణాలు పొగొట్టుకున్న దుర్ఘటనలు చాలానే ఉన్నాయి. అందులో కొన్ని...

1964, మే 24.. పెరులోని లీమ నగరంలోని ఫుట్‌బాల్‌ మైదానంలో జరిగిన దారుణ ఘటనతో ప్రపంచం ఉలిక్కిపడిన రోజది. అర్జెంటీనా, పెరు మ్యాచ్‌ చివర్లో ఓ గోల్‌ వివాదాస్పదం కావడంతో అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చారు. వీళ్లను అదుపు చేసేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ప్రధాన మార్గాలన్నీ మూసివేయడంతో బయటకు వెళ్లే దారి లేక తొక్కిసలాటలో 328 మంది కన్నుమూశారు
.

* 1980, జవనరి 20న కొలంబియాలోని సిన్స్‌లెజోలో బుల్‌ఫైట్‌ చూద్దామని వచ్చిన ప్రేక్షకుల్లో దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. కలపతో నిర్మించిన నాలుగంతస్తుల తాత్కాలిక స్టేడియం కూలిపోవడమే అందుకు కారణం. ఆ శిథిలాల కింద పడి అభిమానులు మృత్యువాత పడ్డారు.

అది 1988, మార్చి 13.. 93 మంది అభిమానుల ప్రాణాలను వడగళ్ల వర్షం బలి తీసుకుంది. ఖాట్మాండులో నేపాల్‌, బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ మధ్యలో ఒక్కసారిగా వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా బయటకు వెళ్లేందుకు అభిమానులు ప్రయత్నించడంతో తోపులాట జరిగి ప్రాణాలు పోయాయి.

* 1989, ఏప్రిల్‌ 15న హిల్స్‌బర్గ్‌లోని ఫుట్‌బాల్‌ మైదానం 97 మంది మృతికి సాక్షిగా నిలిచింది. లివర్‌పూల్‌, నాటింగ్‌హాం మధ్య మ్యాచ్‌ కోసం స్టేడియం సామర్థ్యానికి మించి ప్రేక్షకులు వచ్చారు. మ్యాచ్‌ చూసేందుకు చోటు లేకపోవడంతో నిర్వాహకులతో గొడవకు దిగారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు.

1996, అక్టోబర్‌ 16న 84 మంది అభిమానుల మృతితో గ్వాటెమాలా సిటీ వార్తల్లోకెక్కింది. గ్వాటెమాలా, కోస్టారికా మధ్య ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌కు ముందు ఏర్పడ్డ పరిస్థితులు కారణంగా ప్రేక్షకులు భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో స్టేడియం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పుడు జరిగిన తొక్కిసలాట అభిమానుల జీవితాలను హరించింది.

2001, మే9న ఘనా రాజధాని అక్రాలోని మైదానంలో జరిగిన తొక్కిసలాటలో 120 మందికి పైగా అభిమానులు మరణించారు. అక్రా హార్ట్స్‌, అసంటే కొటోకొ మ్యాచ్‌ సందర్భంగా ప్రేక్షకులు మైదానంలోకి నీళ్ల సీసాలు విసిరారు. పోలీసులు భాష్పవాయువు ప్రయోగించడంతో జరిగిన తొక్కిసలాట అభిమానులు ప్రాణాలు తీసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని