ప్రపంచకప్‌ నుంచి బుమ్రా ఔట్‌

భయపడిందే జరిగింది. ఏమూలో ఉన్న చిన్న ఆశ కూడా ఆవిరైంది. ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌కు సిద్ధమవుతున్న భారత జట్టుకు పెద్ద షాకిస్తూ స్టార్‌ ఫాస్ట్‌బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఈ టోర్నీకి దూరమయ్యాడు. వెన్ను గాయంతో ఇప్పటికే స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ నుంచి తప్పుకున్న ఈ పేసర్‌.. ఇప్పుడు ప్రపంచకప్‌ నుంచి కూడా వైదొలిగాడు.

Updated : 04 Oct 2022 04:04 IST

ధ్రువీకరించిన బీసీసీఐ

ముంబయి: భయపడిందే జరిగింది. ఏమూలో ఉన్న చిన్న ఆశ కూడా ఆవిరైంది. ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌కు సిద్ధమవుతున్న భారత జట్టుకు పెద్ద షాకిస్తూ స్టార్‌ ఫాస్ట్‌బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఈ టోర్నీకి దూరమయ్యాడు. వెన్ను గాయంతో ఇప్పటికే స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ నుంచి తప్పుకున్న ఈ పేసర్‌.. ఇప్పుడు ప్రపంచకప్‌ నుంచి కూడా వైదొలిగాడు. ఈ విషయాన్ని సోమవారం బీసీసీఐ అధికారికంగా ధ్రువీకరించింది. ‘‘వైద్యుల పర్యవేక్షణ తర్వాత బుమ్రా ఈనెల 16న ఆస్ట్రేలియాలో ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌లో ఆడడం సాధ్యం కాదని తేలింది’’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపాడు. సఫారీలతో సిరీస్‌ నుంచి బుమ్రా తప్పుకున్నప్పటికీ.. ప్రపంచకప్‌కూ అతడు దూరం అవుతాడన్న వార్తలను బీసీసీఐ కొట్టిపారేయలేదు. దీంతో ఈ పేసర్‌ ఈ టోర్నీలో ఏదో ఒక దశలోనైనా అందుబాటులోకి వస్తాడని అభిమానులు ఆశించారు. కానీ అందరినీ నిరాశకు గురి చేస్తూ బుమ్రా ప్రపంచకప్‌కు పూర్తిగా దూరం అయ్యాడు. త్వరలో బుమ్రా స్థానంలో వేరొక బౌలర్‌ను బీసీసీఐ జట్టులో చేర్చనుంది. ప్రపంచకప్‌ స్టాండ్‌బై బౌలర్లు దీపక్‌ చాహర్, మహ్మద్‌ షమిల్లో ఒకరు ప్రధాన జట్టులోకి రానుండగా.. జమ్ము కశ్మీర్‌ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ స్టాండ్‌ బైగా ఎంపిక కావచ్చు. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా సైతం గాయంతో ప్రపంచకప్‌ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. 2018 నుంచి గాయాల కారణంగా బుమ్రా ఏదో ఒక సిరీస్‌ లేదా టోర్నీకి దూరం కావడం ఇది నాలుగోసారి. 2018లో ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ ఆడుతుండగా బొటనవేలికి గాయంతో వైదొలిగిన ఈ పేసర్‌.. 2019లో వెస్టిండీస్‌ పర్యటనలో వెన్ను గాయంతో జట్టుకు దూరమయ్యాడు. 2020-21 ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో ఆడుతుండగా పొత్తి కడుపు గాయంతో సిరీస్‌ నుంచి తప్పుకున్న బుమ్రా.. ఈ ఏడాది ఆగస్టులో వెన్ను గాయంతో ఆసియాకప్‌ ఆడలేదు. తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో చివరి రెండు టీ20ల్లో ఆడిన అతను.. దక్షిణాఫ్రికా సిరీస్‌ నుంచి జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కు 14 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా.. భారత్‌ జట్టు తరఫున అన్ని ఫార్మాట్లలో కలిసి 15 మ్యాచ్‌లే ఆడడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు