బౌలర్లకు పరీక్ష

దక్షిణాఫ్రికాతో చివరిదైన మూడో టీ20 మంగళవారమే. మామూలుగా అయితే ఇది నామమాత్రమైన మ్యాచ్‌గా అనిపించవచ్చు. కానీ టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో తడబడుతున్న భారత బౌలర్లకు మాత్రం పరీక్షే. వాళ్లెలా పుంజుకుంటారో చూడాలి.

Updated : 04 Oct 2022 12:29 IST

దక్షిణాఫ్రికాతో భారత్‌ ఆఖరి టీ20 నేడే

రాత్రి 7 గంటల నుంచి

దక్షిణాఫ్రికాతో చివరిదైన మూడో టీ20 మంగళవారమే. మామూలుగా అయితే ఇది నామమాత్రమైన మ్యాచ్‌గా అనిపించవచ్చు. కానీ టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో తడబడుతున్న భారత బౌలర్లకు మాత్రం పరీక్షే. వాళ్లెలా పుంజుకుంటారో చూడాలి.

ఇండోర్‌ వరుస విజయాలతో జోరు మీదున్న టీమ్‌ఇండియా టీ20 ప్రపంచకప్‌కు ముందు తన ఆఖరి పొట్టి ఫార్మాట్‌ మ్యాచ్‌కు సిద్ధమైంది. మంగళవారం చివరిదైన మూడో టీ20లో దక్షిణాఫ్రికాను ఢీకొంటుంది. సొంతగడ్డపై తొలిసారి దక్షిణాఫ్రికాపై పొట్టి సిరీస్‌ గెలిచిన భారత్‌ రెట్టించిన ఉత్సాహంతో సమరానికి సై అంటోంది. మరోవైపు సఫారీ జట్టు ఈ ఒక్క మ్యాచ్‌లోనైనా నెగ్గి ఊరట పొందాలనుకుంటోంది. టీమ్‌ఇండియా ఈ మ్యాచ్‌కు విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌లకు విశ్రాంతినిచ్చింది. మూడో టీ20 ముగిశాక వాళ్లు ముంబయిలో జట్టుతో కలుస్తారు. ఈ నెల 6న అక్కడి నుంచి జట్టు టీ20 ప్రపంచకప్‌ కోసం ఆస్ట్రేలియా బయల్దేరుతుంది.

బౌలింగే సమస్య..: పేరుకు నామమాత్ర మ్యాచే అయినా.. ప్రపంచకప్‌కు ముందు టీమ్‌ఇండియాకు ఇది ఉపయోగపడే మ్యాచే. ముఖ్యంగా బౌలింగ్‌ అస్థిరత నుంచి జట్టు బయటపడాలనుకుంటోంది. గత మ్యాచ్‌లో 237 పరుగుల భారీ స్కోరును సైతం కాపాడేందుకు భారత బౌలర్లు శ్రమించిన సంగతి తెలిసిందే. కొత్త, పాత బంతులతో అర్ష్‌దీప్‌ బాగానే రాణిస్తున్నా.. ఆదివారం మ్యాచ్‌లో మాత్రం లయ తప్పి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. మూడు నోబాల్స్‌ వేశాడు. అది అతడికి మరిచిపోదగ్గ మ్యాచే. ఈ మ్యాచ్‌తో పుంజుకోవాలని అతడు చూస్తున్నాడు. ఇక గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసినప్పటి నుంచి హర్షల్‌ అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నాడు. అతడు బ్యాట్స్‌మెన్‌ జోరుకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరముంది. బుమ్రా స్థానంలో వచ్చిన సిరాజ్‌ను ఆడించే అవకాశమున్నా.. మరింత ప్రాక్టీస్‌ కోసం జట్టు మేనేజ్‌మెంట్‌ ఈ ఆఖరి మ్యాచ్‌కు హర్షల్‌ను కొనసాగించే అవకాశముంది. అశ్విన్‌ ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఒక్క వికెట్టూ పడగొట్టలేదు. మిడిల్‌ ఓవర్లలో అతడు వికెట్లు తీయాలని జట్టు ఆశిస్తోంది. దీపక్‌ చాహర్‌ మంచి ఫామ్‌లో ఉండడం భారత్‌కు సానుకూలాంశం. ఇక బ్యాటింగ్‌లో ఆ జట్టుకు ఎలాంటి ఇబ్బందులూ లేవు. ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌తో బలంగా కనిపిస్తోంది. టాప్‌-3 బ్యాట్స్‌మెన్‌ రోహిత్, రాహుల్, కోహ్లి మంచి ఫామ్‌లో ఉండడం జట్టుకు సంతోషాన్నిస్తోంది. గత మ్యాచ్‌తో రాహుల్‌ తన స్ట్రైక్‌రేట్‌పై వ్యక్తమవుతున్న ఆందోళనను కూడా పోగొట్టాడు. అయితే కోహ్లితో పాటు అతడు ఈ మ్యాచ్‌లో ఆడట్లేదు. కోహ్లి స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ జట్టులోకి వచ్చే అవకాశముంది. షాబాజ్‌ అహ్మద్‌కు కూడా అవకాశం దక్కొచ్చు. నాలుగో నంబర్‌ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ భీకర ఫామ్‌తో జట్టు ప్రపంచకప్‌ ఆశలను పెంచుతున్నాడు. పంత్‌ ఈ సిరీస్‌లో ఇంకా బ్యాటింగ్‌ చేయలేదు. దినేశ్‌ కార్తీక్‌ ఎక్కువ బంతులాడలేకపోయాడు. ఈ చివరి మ్యాచ్‌లోనైనా ఎక్కువసేపు క్రీజులో ఉండే అవకాశం లభిస్తుందని వీళ్లు భావిస్తున్నారు. కోహ్లి జట్టులో లేని నేపథ్యంలో రోహిత్‌తో కలిసి పంత్‌ లేదా సూర్య ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశముంది.

దక్షిణాఫ్రికా పుంజుకునేనా?: ఇప్పటికే సిరీస్‌ చేజారినా దక్షిణాఫ్రికాకు బ్యాటింగ్‌ విభాగంలో సానుకూలాంశాలు ఉన్నాయి. డేవిడ్‌ మిల్లర్‌ రెండో టీ20లో మెరుపు శతకం సాధించిన సంగతి తెలిసిందే. క్వింటన్‌ డికాక్‌ కూడా బ్యాట్‌తో సత్తా చాటాడు. కెప్టెన్‌ టెంబా బవుమా పేలవ ఫామే దక్షిణాఫ్రికాకు ఆందోళన కలిగించే అంశం. సిరీస్‌లో అతడు ఇంకా పరుగుల ఖాతా తెరవలేదు. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ డకౌటయ్యాడు. దక్షిణాఫ్రికా బంతితోనూ పుంజుకోవాల్సివుంది. గువాహటిలో ఆ జట్టు పేసర్లు దారాళంగా పరుగులిచ్చిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో అనేక ఫుల్‌టాస్‌లు వేసిన సఫారీ పేసర్లు తప్పులను సరిదిద్దుకోవాలనుకుంటున్నారు.


అవసరానికి తగ్గట్లే స్ట్రైక్‌ రేట్‌

గువాహటి: తన స్ట్రైక్‌ రేట్‌పై వస్తున్న విమర్శలకు టీమ్‌ఇండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ బదులిచ్చాడు. ఇన్నింగ్స్‌ అవసరానికి తగ్గట్లు తాను బ్యాటింగ్‌ చేస్తానని రాహుల్‌ తెలిపాడు. దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో రాహుల్‌ (57; 28 బంతుల్లో 5×4, 4×6) మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. ‘‘అవును.. ఇన్నింగ్స్‌ అవసరం మేరకే ఎక్కువ స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్‌ చేశా. మొదట బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు పరిస్థితుల్ని అర్థం చేసుకోడానికి కొంత సమయం ఇవ్వాలి. ఎలాంటి షాట్లు ఆడాలో భాగస్వామితో చర్చించాలి. నాకంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుకు అనుగుణంగా బ్యాటింగ్‌ చేయాలి. చాలాసార్లు మేం దూకుడుగా ఆడాం. ఎన్నో సాహసాలు చేశాం. సోమవారం నా నుంచి అలాంటి ఇన్నింగ్సే అవసరమైంది. అందులో విజయవంతం అయినందుకు ఆనందంగా ఉంది. టీ20 క్రికెట్లో సిక్సర్లు కొట్టేందుకు సిద్ధంగా ఉండాలి. 145 కిమీ వేగంతో బంతులు వస్తున్నప్పుడు స్పందించడానికి తక్కువ సమయం ఉంటుంది. ఊహాత్మకంగా బాదాలి. ఎన్నో ఏళ్ల సాధనతోనే అది సాధ్యమవుతుంది’’ అని రాహుల్‌ చెప్పాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts