సంక్షిప్త వార్తలు (6)

రెస్టాఫ్‌ ఇండియా జట్టు 29వ సారి ఇరానీ ట్రోఫీని గెలుచుకుంది. చివరి రోజు, మంగళవారం ముగిసిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో సౌరాష్ట్రను చిత్తు చేసింది. మూడో రోజుకే విజయాన్ని ఖాయం చేసుకున్న రెస్ట్‌..

Updated : 05 Oct 2022 04:37 IST

రెస్ట్‌దే ఇరానీ ట్రోఫీ

రాజ్‌కోట్‌: రెస్టాఫ్‌ ఇండియా జట్టు 29వ సారి ఇరానీ ట్రోఫీని గెలుచుకుంది. చివరి రోజు, మంగళవారం ముగిసిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో సౌరాష్ట్రను చిత్తు చేసింది. మూడో రోజుకే విజయాన్ని ఖాయం చేసుకున్న రెస్ట్‌.. చివరి రోజు లాంఛనాన్ని ముగించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 368/8తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన సౌరాష్ట్ర 380 పరుగులకు ఆలౌటైంది. చివరి రెండు వికెట్లను కుల్‌దీప్‌ సేన్‌ (5/94) చేజిక్కించుకున్నాడు. 105 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని రెస్ట్‌ 31.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అభిమన్యు ఈశ్వరన్‌ 63 పరుగులతో అజేయంగా నిలిచాడు. శ్రీకర్‌ భరత్‌ (27 నాటౌట్‌)తో అభేద్యమైన మూడో వికెట్‌కు అతడు 81 పరుగులు జోడించాడు. మొదట ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర 98 పరుగులకే కుప్పకూలగా.. రెస్ట్‌ 374 పరుగులు సాధించింది. రెస్ట్‌కు 276 పరుగుల ఆధిక్యం లభించింది.


శ్రీకృష్ణకు ప్రపంచ 6-రెడ్‌ స్నూకర్‌ టైటిల్‌

కౌలాలంపూర్‌: భారత క్రీడాకారుడు శ్రీకృష్ణ సూర్యనారాయణన్‌ ప్రపంచ 6-రెడ్‌ స్నూకర్‌ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. ఫైనల్లో అతను 5-1 ఫ్రేమ్‌ల తేడాతో బహ్రెయిన్‌కు చెందిన హబీబ్‌ సబాను ఓడించి టైటిల్‌ అందుకున్నాడు. గత ఏడాది ఈ టోర్నీలో భారత్‌కే చెందిన లక్ష్మణ్‌ రావత్‌ విజేతగా నిలిచాడు.


ప్రణయ్‌కు 4 పతకాలు

ఈనాడు, హైదరాబాద్‌: దక్షిణాసియా రీజినల్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ కుర్రాడు ప్రణయ్‌ శెట్టిగార్‌ మెరిశాడు. గువాహటిలో జరిగిన ఈ టోర్నీలో ప్రణయ్‌ 4 పతకాలు సాధించాడు. టీమ్‌, సింగిల్స్‌, డబుల్స్‌లో స్వర్ణాలు నెగ్గిన ప్రణయ్‌.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రజతం సాధించాడు. భాస్కర్‌ బాబు ఎంఎల్‌ఆర్‌ఐటీ బ్యాడ్మింటన్‌ అకాడమీలో ప్రణయ్‌ శిక్షణ తీసుకుంటున్నాడు. ప్రణయ్‌ను ఎంఎల్‌ఆర్‌ఐటీ ఛైర్మన్‌ మర్రి లక్ష్మణ్‌రెడ్డి అభినందించారు.


ముంతాజ్‌కు ఎఫ్‌ఐహెచ్‌ పురస్కారం

దిల్లీ: భారత హాకీ ఫార్వర్డ్‌ ముంతాజ్‌ఖాన్‌కు ఎఫ్‌ఐహెచ్‌ అవార్డు లభించింది. 2022 సంవత్సరానికి గాను ‘ఎఫ్‌ఐహెచ్‌ మహిళల రైజింగ్‌ స్టార్‌’ అవార్డు ముంతాజ్‌ను వరించింది. ఈ ఏడాది దక్షిణాఫ్రికాలో జరిగిన జూనియర్‌ ప్రపంచకప్‌లో 19 ఏళ్ల ముంతాజ్‌ ప్రదర్శనకు ఈ గుర్తింపు దక్కింది. ఈ టోర్నీలో ముంతాజ్‌ ఆరు మ్యాచ్‌ల్లో 8 గోల్స్‌ సాధించింది. అందులో ఒక హ్యాట్రిక్‌ ఉండటం విశేషం. టోర్నీలో భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది.


ప్రిక్వార్టర్స్‌లో భారత్‌

ప్రపంచ టీటీ ఛాంపియన్‌షిప్‌

చెంగ్‌డు: ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. మంగళవారం గ్రూప్‌-2 మ్యాచ్‌లో 0-3తో ఫ్రాన్స్‌ చేతిలో ఓడినా సమీకరణాలు కలిసొచ్చి భారత్‌ ముందంజ వేసింది. ఫ్రాన్స్‌తో పోరులో తొలి మ్యాచ్‌లో మానవ్‌ థక్కర్‌ 6-11, 8-11, 8-11తో అలెక్సిస్‌ లెబ్రాన్‌ చేతిలో ఓడగా... రెండో మ్యాచ్‌లో సత్యన్‌ 4-11, 2-11, 6-12తో ఫెలిక్స్‌ లెబ్రాన్‌ చేతిలో పరాజయం పాలవడంతో భారత్‌ ఓటమి ఖరారైంది. మూడో మ్యాచ్‌లో హర్మీత్‌ దేశాయ్‌ 13-11, 11-13, 11-7, 8-11, 7-11తో జులెస్‌ రొనాల్డ్‌ చేతిలో పోరాడి ఓడాడు. అయిదు జట్లు ఉన్న గ్రూప్‌-2లో 4 మ్యాచ్‌లు ఆడి మూడింట్లో గెలిచిన భారత్‌.. 7 పాయింట్లతో ఫ్రాన్స్‌, జర్మనీతో సమానంగా నిలిచింది. భారత్‌పై గెలిచిన ఫ్రాన్స్‌కు అగ్రస్థానం దక్కగా.. జర్మనీ రెండో స్థానంలో నిలిచింది. గ్రూప్‌ దశలో మూడో స్థానంలో నిలిచే మెరుగైన ర్యాంకు జట్లకు రెండు నాకౌట్‌ స్థానాలు కేటాయించారు. వీటిలో ఒక బెర్తును దక్కించుకున్న భారత్‌ ముందంజ వేసింది. ప్రిక్వార్టర్స్‌లో టాప్‌సీడ్‌ చైనాతో పురుషుల జట్టు తలపడనుంది. భారత మహిళల జట్టు ఇప్పటికే ప్రిక్వార్టర్స్‌ చేరిన సంగతి తెలిసిందే.


మాల్దీవులపై భారత్‌ ఘన విజయం

ఆల్‌ ఖోబార్‌ (సౌదీ అరేబియా): ఏఎఫ్‌సీ అండర్‌-17 ఆసియాకప్‌ 2023 ఫుట్‌బాల్‌ క్వాలిఫయర్స్‌లో భారత్‌ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో 5-0 గోల్స్‌తో మాల్దీవులను చిత్తు చేసింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన భారత్‌ వరుస దాడులతో ఫలితం సాధించింది. కెప్టెన్‌ గయిట్‌ (11వ ని) కొట్టిన గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లిన భారత్‌.. 24వ నిమిషంలో ఫనాయ్‌ బంతిని నెట్‌లోకి పంపడంతో ఆధిక్యాన్ని రెట్టింపు చేసుకుంది. ద్వితీయార్ధంలోనూ మన జట్టుదే జోరు. ప్రత్యర్థి డిఫెన్స్‌ లోపాలను సొమ్ము చేసుకుంటూ అమన్‌ (59వ ని), బాబీ (67వ ని), ఫీనిక్స్‌ (71వ ని) గోల్స్‌ చేయడంతో భారత్‌ ఘన విజయాన్ని అందుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని