IND Vs SA: చప్పని ముగింపు..

ప్రపంచకప్‌కు ముందు వరుసగా రెండు పొట్టి సిరీస్‌లు గెలిచాం. కానీ ఓ అసంతృప్తికర ముగింపు. మెగా టోర్నీకి ముందు తన చిట్టిచివరి టీ20లో టీమ్‌ఇండియా చిత్తుగా ఓడింది. సమస్య అలాగే ఉంది. బౌలింగ్‌ కాస్తయినా మెరుగుపడలేదు.

Updated : 05 Oct 2022 09:13 IST

చివరి టీ20లో దక్షిణాఫ్రికా ఘనవిజయం
కొనసాగిన భారత్‌ బౌలింగ్‌ వైఫల్యం
బ్యాటింగ్‌లోనూ తడబాటు
రొసో మెరుపు సెంచరీ

ప్రపంచకప్‌కు ముందు వరుసగా రెండు పొట్టి సిరీస్‌లు గెలిచాం. కానీ ఓ అసంతృప్తికర ముగింపు. మెగా టోర్నీకి ముందు తన చిట్టిచివరి టీ20లో టీమ్‌ఇండియా చిత్తుగా ఓడింది. సమస్య అలాగే ఉంది. బౌలింగ్‌ కాస్తయినా మెరుగుపడలేదు. ఆందోళనను మరింత పెంచుతూ పేస్‌ బౌలర్లు మళ్లీ తేలిపోయారు. ప్రత్యర్థిని కాస్తయినా నియంత్రించలేక మళ్లీ ధారాళంగా పరుగులిచ్చేశారు. అదీ చాలదన్నట్లు బాగుందనుకున్న బ్యాటింగ్‌లోనూ ఆతిథ్య జట్టు ఘోరంగా తడబడింది. రొసో మెరుపు సెంచరీ సాధించిన వేళ మూడో టీ20లో గెలిచి దక్షిణాఫ్రికా కాస్త ఊరట పొందింది.

చివరిదైన మూడో టీ20లో టీమ్‌ఇండియా అన్ని రంగాల్లోనూ విఫలమైంది. సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన దక్షిణాఫ్రికా మంగళవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో 49 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. రొసో (100 నాటౌట్‌; 48 బంతుల్లో 7×4, 8×6) విధ్వంసక శతకానికి డికాక్‌ (68; 43 బంతుల్లో 6×4, 4×6) దూకుడు తోడవడంతో మొదట దక్షిణాఫ్రికా 3 వికెట్లకు 227 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఛేదనలో టీమ్‌ఇండియా తడబడింది. 18.3 ఓవర్లలో 178 పరుగులకే ఆలౌటైంది. దినేశ్‌ కార్తీక్‌ (46; 21 బంతుల్లో 4×4, 4×6) ఒక్కడే రాణించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ప్రిటోరియస్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. కేశవ్‌ మహరాజ్‌, ఎంగిడి, పార్నెల్‌ తలో రెండు వికెట్లు చేజిక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు కోహ్లి, రాహుల్‌లకు విశ్రాంతినిచ్చింది. అర్ష్‌దీప్‌ వెన్ను సమస్యతో దూరమయ్యాడు. అయితే అతడి ఇబ్బంది తీవ్రమైందేమీ కాదని కెప్టెన్‌ రోహిత్‌ చెప్పాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్‌ 2-1తో సిరీస్‌ను గెలుచుకుంది.

ఛేదన పేలవంగా..: భారీ లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే భారత్‌కు షాక్‌. ఘనమైన ఆరంభం అవసరం ఉండగా.. నాలుగు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. మొదటి ఓవర్లో ఆఫ్‌స్టంప్‌ ఆవల రబాడ వేసిన బంతిని ఆడబోయిన రోహిత్‌ (0) ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌తో బౌల్డయ్యాడు. తర్వాతి ఓవర్లోనే శ్రేయస్‌ అయ్యర్‌ (1)ను ఎంగిడి వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన పంత్‌ (27; 14 బంతుల్లో 3×4, 2×6) చక్కని షాట్లతో అలరించినా.. అది కాసేపే. ఎంగిడి వేసిన ఇన్నింగ్స్‌ అయిదో ఓవర్లో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లతో అభిమానులను ఉర్రూతలూగించిన అతడు.. అదే ఓవర్‌ చివరి బంతికి క్యాచ్‌ ఔటయ్యాడు. అయితే బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందొచ్చిన కార్తీక్‌ కళ్లు చెదిరే ఇన్నింగ్స్‌తో భారత్‌ ఆశలను నిలిపాడు. పార్నెల్‌ బౌలింగ్‌లో స్కూప్‌, కవర్‌డ్రైవ్‌, ఫ్లిక్‌తో వరుసగా 6, 4, 6 సాధించిన అతడు.. కేశవ్‌ మహరాజ్‌ బౌలింగ్‌లో స్లాగ్‌ స్వీప్‌, పుల్‌ షాట్తో వరుసగా రెండు సిక్స్‌లతో అలరించాడు. కానీ కేశవ్‌ ఓవర్లోనే చివరి బంతికి వెనుదిరిగాడు. లక్ష్యం కష్టంగా మారినా సూర్యకుమార్‌ (8) క్రీజులో ఉండడంతో భారత్‌ ఆశలు కోల్పోలేదు. కానీ తర్వాతి ఓవర్లోనే ప్రిటోరియస్‌ బౌలింగ్‌లో సూర్య ఔట్‌ కావడంతో ఆశలకు తెరపడ్డట్లయింది. 86/5తో టీమ్‌ఇండియా ఓటమి ఖరారైంది. ఆ తర్వాత ఆట ఓటమి అంతరాన్ని తగ్గించుకోవడానికే. దీపక్‌ చాహర్‌ (31; 17 బంతుల్లో 2×4, 3×6) కాసేపు  అలరించాడు. ఉమేశ్‌ (20 నాటౌట్‌)తో 9వ వికెట్‌కు 48 పరుగులు జోడించిన అతడు.. జట్టు మరీ ఎక్కువ తేడాతో ఓడిపోకుండా చూశాడు.

రొసో విధ్వంసం: అంతకుముందు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో రొసో ఆటే హైలైట్‌. డికాక్‌ కూడా అదరగొట్టాడు. భారత పేసర్లు మరోసారి తేలిపోయారు. బౌలింగ్‌ దాడిని ఆరంభించిన చాహర్‌ తొలి ఓవర్లో ఒక్క పరుగే ఇచ్చాడు. కానీ రెండో ఓవర్‌ నుంచి డికాక్‌ దంచుడు మొదలెట్టాడు. సిరాజ్‌ బౌలింగ్‌లో సిక్స్‌, ఫోర్‌.. ఆ తర్వాత చాహర్‌ ఓవర్లో సిక్స్‌ కొట్టాడు. అయితే పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ మరో ఓపెనర్‌ కెప్టెన్‌ బవుమా (3) మరోసారి విఫలమయ్యాడు. అయిదో ఓవర్లో అతణ్ని ఔట్‌ చేయడం ద్వారా భారత్‌కు ఉమేశ్‌ యాదవ్‌ తొలి వికెట్‌ను అందించాడు. కానీ ఆ తర్వాత స్కోరు వేగం పెరిగిందే తప్ప తగ్గలేదు. క్రీజులోకి వచ్చిన రొసో చెలరేగిపోయాడు. అతడు ఎడాపెడా ఫోర్లు, సిక్స్‌లు బాదడం.. డికాక్‌ కూడా జోరు కొనసాగించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఇన్నింగ్స్‌ పదో ఓవర్లో ఉమేశ్‌ బౌలింగ్‌లో సిక్స్‌తో డికాక్‌ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఆ ఓవర్‌ పూర్తయ్యేసరికి స్కోరు 96/1. డికాక్‌ వరుసగా రెండు ఫోర్లు, రొసో ఓ సిక్స్‌ బాదడంతో తర్వాతి ఓవర్లో హర్షల్‌ 18 పరుగులు సమర్పించుకున్నాడు. 13వ ఓవర్లో డికాక్‌ రనౌట్‌తో 90 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడ్డా రొసో విధ్వంసక బ్యాటింగ్‌ను కొనసాగించాడు. అక్షర్‌ బౌలింగ్‌లో మోకాలిని వంచుతూ డీప్‌ మిడ్‌వికెట్లోకి సిక్స్‌ కొట్టిన రొసో అర్ధశతకం (27 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత అతడు మరింత రెచ్చిపోయాడు. అలవోకగా సిక్స్‌లు బాదుతూ జట్టును భారీ స్కోరు దిశగా తీసుకెళ్లిన రొసో.. ఆఖరి ఓవర్లో సింగిల్‌తో శతకాన్ని అందుకున్నాడు. అర్ధసెంచరీ నుంచి సెంచరీకి చేరుకోవడానికి అతడు కేవలం 21 బంతులే ఆడడం విశేషం. స్టబ్స్‌ (23; 18 బంతుల్లో 2×4, 1×6)తో మూడో వికెట్‌కు అతడు 87 పరుగులు జోడించాడు. ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో చాహర్‌ స్టబ్స్‌ను ఔట్‌ చేసినప్పటికీ ఏకంగా 24 పరుగులు సమర్పించుకున్నాడు. మిల్లర్‌ (19 నాటౌట్‌) వరుసగా మూడు సిక్స్‌లు బాదాడు.

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: డికాక్‌ రనౌట్‌ 68; బవుమా (సి) రోహిత్‌ (బి) ఉమేశ్‌ 3; రొసో నాటౌట్‌ 100; స్టబ్స్‌ (సి) అశ్విన్‌ (బి) చాహర్‌ 23; మిల్లర్‌ నాటౌట్‌ 19; ఎక్స్‌ట్రాలు 14 మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 227; వికెట్ల పతనం: 1-30,  2-120, 3-207; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-0-48-1; సిరాజ్‌ 4-0-44-0; అశ్విన్‌ 4-0-35-0; ఉమేశ్‌ యాదవ్‌ 3-0-34-1; అక్షర్‌ పటేల్‌ 4-0-49-0; అక్షర్‌ పటేల్‌ 1-0-13-0

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (బి) రబాడ 0; పంత్‌ (సి) స్టబ్స్‌ (బి) ఎంగిడి 27; శ్రేయస్‌  ఎల్బీ (బి) పార్నెల్‌ 1; కార్తీక్‌ (బి) కేశవ్‌ 46; సూర్యకుమార్‌ (సి) స్టబ్స్‌ (బి) ప్రిటోరియస్‌ 8; అక్షర్‌ పటేల్‌ (సి) డికాక్‌ (బి) పార్నెల్‌ 9; హర్షల్‌ పటేల్‌ (సి) మిల్లర్‌ (బి) ఎంగిడి 17; అశ్విన్‌ (సి) రబాడ (బి) కేశవ్‌ 2; దీపక్‌ చాహర్‌ (సి) మిల్లర్‌ (బి) ప్రిటోరియస్‌ 31; ఉమేశ్‌ నాటౌట్‌ 20; సిరాజ్‌ (సి) మిల్లర్‌ (బి) ప్రిటోరియస్‌ 5; ఎక్స్‌ట్రాలు 12 మొత్తం: (18.3 ఓవర్లలో ఆలౌట్‌) 178; వికెట్ల పతనం: 1-0, 2-4, 3-45, 4-78, 5-86, 6-108, 7-114, 8-120,   9-168; బౌలింగ్‌: రబాడ 4-0-24-1; పార్నెల్‌ 4-0-41-2; ఎంగిడి 3-0-51-2; కేశవ్‌ మహరాజ్‌ 4-0-34-2; ప్రిటోరియస్‌ 3.3-0-26-3


దీపక్‌.. దీప్తిలా చేయబోయి..

భారత ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ బౌలింగ్‌ చేయబోతూ ఆగి ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ చార్లీ డీన్‌ను రనౌట్‌ (మన్కడింగ్‌) చేసిన ఉదంతం తాలూకు వేడి ఇంకా చల్లారక ముందే భారత్‌-దక్షిణాఫ్రికా మూడో టీ20లో అలాంటి ఘటన కొద్దిలో తప్పింది. సఫారీ ఇన్నింగ్స్‌లో 16వ ఓవర్‌ బౌలింగ్‌ చేయడానికి వచ్చిన పేసర్‌ దీపక్‌ చాహర్‌..   నాన్‌స్ట్రైకర్‌ స్టబ్స్‌ను రనౌట్‌ చేయబోయి ఆగిపోయాడు. ఈ ఓవర్లో తొలి బంతి వేయబోతుండగా.. స్టబ్స్‌ క్రీజు దాటేశాడు. ఇది గమనించిన దీపక్‌ బౌలింగ్‌ ఆపేసి బంతితో వికెట్లను కొట్టబోయి ఆగాడు. హెచ్చరిస్తున్నట్లుగా స్టబ్స్‌ను చూసి, ఆపై నవ్వేసి మళ్లీ బౌలింగ్‌ కొనసాగించాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతం అవుతోంది. స్టబ్స్‌ను హెచ్చరించి వదిలేసి చాహర్‌ మరోసారి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడని.. ఇటీవల జింబాబ్వేతో మ్యాచ్‌లో ఇన్నోసెంట్‌ కయాను రనౌట్‌ చేసినా అతడు అప్పీల్‌ చేయలేదని అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని