Ind Vs SA: సంజు పోరాడినా.. భారత్‌కు తప్పని ఓటమి

దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్‌ను చేజిక్కించుకున్న రోహిత్‌ సేన ఆస్ట్రేలియాకు పయనం కాగా..ధావన్‌ నేతృత్వంలోని మరో భారత జట్టు మాత్రం వన్డే సిరీస్‌లో శుభారంభం చేయలేకపోయింది. బౌలింగ్‌లో సగం ఇన్నింగ్స్‌ వరకు పైచేయి సాధించినా.. బ్యాటింగ్‌లో ఆరంభ తడబాటును అధిగమించి మెరుగైన స్థితికి చేరుకున్నా.

Updated : 07 Oct 2022 09:48 IST

మెరిసిన మిల్లర్‌, క్లాసెన్‌.. తొలి వన్డే దక్షిణాఫ్రికాదే

దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్‌ను చేజిక్కించుకున్న రోహిత్‌ సేన ఆస్ట్రేలియాకు పయనం కాగా..ధావన్‌ నేతృత్వంలోని మరో భారత జట్టు మాత్రం వన్డే సిరీస్‌లో శుభారంభం చేయలేకపోయింది. బౌలింగ్‌లో సగం ఇన్నింగ్స్‌ వరకు పైచేయి సాధించినా.. బ్యాటింగ్‌లో ఆరంభ తడబాటును అధిగమించి మెరుగైన స్థితికి చేరుకున్నా.. ఆఖర్లో పట్టు విడవడంతో ఓటమి తప్పలేదు. టీ20 ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ సంజు శాంసన్‌ భారత్‌ను గెలిపించేందుకు గట్టి ప్రయత్నమే చేసినా ఫలితం లేకపోయింది.

దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ను టీమ్‌ఇండియా ఓటమితో ఆరంభించింది. గురువారం తొలి వన్డేలో భారత్‌ 9 పరుగుల తేడాతో ఓడింది. వర్షం వల్ల 40 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో మొదట ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ క్లాసెన్‌ (74 నాటౌట్‌; 65 బంతుల్లో 6×4, 2×6)తో పాటు డేవిడ్‌ మిల్లర్‌ (75 నాటౌట్‌; 63 బంతుల్లో 5×4, 3×6), డికాక్‌ (48; 54 బంతుల్లో 5×4) రాణించడంతో దక్షిణాఫ్రికా 4 వికెట్లకు 249 పరుగులు సాధించింది. ఆరంభంలో శార్దూల్‌ ఠాకూర్‌ (2/35) ఆ జట్టును దెబ్బ తీశాడు. అనంతరం ఛేదనను పేలవంగా ఆరంభించిన భారత్‌ 18 ఓవర్లకు 51/4తో నిలిచింది. ఈ దశలో శ్రేయస్‌ (50; 37 బంతుల్లో 8×4), శార్దూల్‌ ఠాకూర్‌ (33; 31 బంతుల్లో 5×4)లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పిన సంజు శాంసన్‌ (86 నాటౌట్‌; 63 బంతుల్లో 9×4, 3×6) జట్టును విజయానికి చేరువ చేశాడు. కానీ ఆఖర్లో వరుసగా వికెట్లు పడడం, బంతులు వృథా కావడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.

ఆశల్లేని స్థితి నుంచి..: భారత్‌ ఛేదనను ఆరంభించిన తీరు చూస్తే.. ఈ మ్యాచ్‌లో గెలవడం కాదు కదా, గౌరవప్రదంగా ఓడుతుందన్న భావన కూడా కలగలేదు. పరుగులు తీయడానికి నానా తంటాలు పడ్డ బ్యాట్స్‌మెన్‌ ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌కు చేరుతుంటే ఘోర పరాభవం తప్పదనిపించింది. ఆరు ఓవర్లలోపే ఓపెనర్లు శుభ్‌మన్‌ (3), ధావన్‌ (4) ఔటైపోయారు. అప్పటికి స్కోరు 8 పరుగులే. రుతురాజ్‌ (19), ఇషాన్‌ కిషన్‌ (20) చాలా కష్టపడి క్రీజులో నిలదొక్కుకున్నారు కానీ.. ఇక జోరు పెంచాల్సిన స్థితిలో వెనుదిరిగారు. సాధించాల్సిన రన్‌రేట్‌ ఆరంభం నుంచే 6.2 పైనే ఉండగా.. 18వ ఓవర్లో నాలుగో వికెట్‌ రూపంలో ఇషాన్‌ ఔటయ్యే సమయానికి భారత్‌ రన్‌రేట్‌ 3 కూడా లేదు. ఈ స్థితిలో శ్రేయస్‌ అయ్యర్‌, సంజు శాంసన్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. స్కోరు వేగం పెంచారు. అయినప్పటికీ లక్ష్యం చాలా దూరంగానే కనిపించింది. నిలకడగా ఆడుతున్న శ్రేయస్‌ అర్ధశతకం పూర్తి చేసుకున్నాక ఔటైపోయాడు. శార్దూల్‌ నుంచి సహకారం అందుకున్న శాంసన్‌.. మెరుపు షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. నెమ్మదిగా భారత్‌ లక్ష్యం దిశగా అడుగులేసింది. చివరి 3 ఓవర్లలో 46 పరుగులు చేయాల్సి రావడం.. సంజు, శార్దూల్‌ జోరుమీదుండడంతో ఛేదన సాధ్యమే అనిపించింది. కానీ ఎంగిడి (3/53).. 38వ ఓవర్లో 8 పరుగులే ఇచ్చి శార్దూల్‌, కుల్‌దీప్‌ (0)లను ఔట్‌ చేశాడు. అవేష్‌ ఆరు బంతులాడి 3 పరుగులే చేసి వెనుదిరగడంతో సమీకరణం మరింత కష్టంగా మారింది. చివరి ఓవర్లో 31 పరుగులు అవసరం కాగా.. తొలి మూడు బంతులకు శాంసన్‌ 6, 4, 4 బాది ఆశలు రేపాడు. కానీ నాలుగో బంతి వృథా కావడంతో భారత్‌కు దారులు మూసుకుపోయాయి.

అదరగొట్టిన ఆ ఇద్దరు: మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా.. మంచి ఆరంభం తర్వాత తడబడ్డప్పటికీ.. ఇన్నింగ్స్‌ రెండో అర్ధంలో క్లాసెన్‌, మిల్లర్‌ల మెరుపులతో పుంజుకుని పెద్ద స్కోరే చేసింది. టీ20 సిరీస్‌లో చెలరేగిన డికాక్‌.. మరో ఓపెనర్‌ జానెమన్‌ మలన్‌ (22)తో కలిసి ఆ జట్టుకు శుభారంభాన్నందించారు. వీళ్లిద్దరూ నెమ్మదిగా ఆడినప్పటికీ.. భారత బౌలర్లను సమర్థంగానే ఎదుర్కొన్నారు. తొలి వికెట్‌ కోసం భారత్‌ 13వ ఓవర్‌ వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. శార్దూల్‌.. మలన్‌ను ఔట్‌చేసి వికెట్ల ఖాతా తెరిచాడు. పేలవ ఫామ్‌లో ఉన్న బవుమా (8)ను కూడా అతనే పెవిలియన్‌ చేర్చాడు. మార్‌క్రమ్‌ (0)ను కుల్‌దీప్‌ బౌల్డ్‌ చేయడంతో 16 ఓవర్లలో 71/3తో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. ఈ దశలో క్లాసెన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసిన డికాక్‌ను రవి బిష్ణోయ్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో దక్షిణాఫ్రికా 110/4కు చేరుకుంది. డికాక్‌ ఔటయ్యేసరికి ఇంకో 17 ఓవర్లే మిగిలుండడంతో సఫారీ జట్టు 200 దాటితే గొప్ప అనిపించింది. కానీ అప్పటికే క్రీజులో కుదురుకున్న క్లాసెన్‌కు భీకర ఫామ్‌లో ఉన్న మిల్లర్‌ తోడవడంతో ఇన్నింగ్స్‌ స్వరూపమే మారిపోయింది. ఇద్దరూ పోటీ పడి షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. పేలవ బౌలింగ్‌, ఫీల్డింగ్‌ తప్పిదాలు కూడా కలిసి రావడంతో ఈ జోడీకి ఎదురే లేకపోయింది. అవేష్‌ బౌలింగ్‌లో తేలికైన క్యాచ్‌ను సిరాజ్‌ వదిలేశాడు. క్లాసెన్‌, మిల్లర్‌ అభేద్యమైన అయిదో వికెట్‌కు 106 బంతుల్లో 139 పరుగులు జోడించారు.

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: జానెమన్‌ మలన్‌ (సి) శ్రేయస్‌ (బి) శార్దూల్‌ 22; డికాక్‌ ఎల్బీ (బి) బిష్ణోయ్‌ 48; బవుమా (బి) శార్దూల్‌ 8; మార్‌క్రమ్‌ (బి) కుల్‌దీప్‌ 0; క్లాసెన్‌ నాటౌట్‌ 74; మిల్లర్‌ నాటౌట్‌ 75; ఎక్స్‌ట్రాలు 22 మొత్తం: (40 ఓవర్లలో 4 వికెట్లకు) 249; వికెట్ల పతనం: 1-49, 2-70, 3-71, 4-110; బౌలింగ్‌: సిరాజ్‌ 8-0-49-0; అవేష్‌ ఖాన్‌ 8-0-51-0; శార్దూల్‌ 8-1-35-2; రవి బిష్ణోయ్‌ 8-0-69-1; కుల్‌దీప్‌ 8-0-39-1
భారత్‌ ఇన్నింగ్స్‌: ధావన్‌ (బి) పార్నెల్‌ 4; గిల్‌ (బి) రబాడ 3; రుతురాజ్‌ (స్టంప్డ్‌) డికాక్‌ (బి) షంసి 19; ఇషాన్‌ కిషన్‌ (సి) మలన్‌ (బి) మహరాజ్‌ 20; శ్రేయస్‌ అయ్యర్‌ (సి) రబాడ (బి) ఎంగిడి 50; సంజు శాంసన్‌ నాటౌట్‌ 86; శార్దూల్‌ (సి) మహరాజ్‌ (బి) ఎంగిడి 33; కుల్‌దీప్‌ (సి) బవుమా (బి) ఎంగిడి 0; అవేష్‌ ఖాన్‌ (సి) బవుమా (బి) రబాడ 3; రవి బిష్ణోయ్‌ నాటౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 18 మొత్తం: (40 ఓవర్లలో 8 వికెట్లకు) 240; వికెట్ల పతనం: 1-8, 2-8, 3-48, 4-51, 5-118, 6-211, 7-211, 8-215; బౌలింగ్‌: రబాడ 8-2-36-2; పార్నెల్‌ 8-1-38-1; కేశవ్‌ మహరాజ్‌ 8-1-23-1; ఎంగిడి 8-0-52-3; షంసి 8-0-89-1

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని