కబడ్డీ కూత.. ఫుట్‌బాల్‌ కిక్కు

దసరా పండగను ఆస్వాదించిన ప్రజలకు క్రీడా సంబరాలను అందించేందుకు ఇటు కబడ్డీ, అటు ఫుట్‌బాల్‌ లీగ్‌లు సిద్ధమయ్యాయి. ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌), ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) తొమ్మిదో సీజన్లు శుక్రవారం ఆరంభమవుతున్నాయి.

Published : 07 Oct 2022 03:02 IST

నేటి నుంచి పీకేఎల్‌, ఐఎస్‌ఎల్‌

బెంగళూరు: దసరా పండగను ఆస్వాదించిన ప్రజలకు క్రీడా సంబరాలను అందించేందుకు ఇటు కబడ్డీ, అటు ఫుట్‌బాల్‌ లీగ్‌లు సిద్ధమయ్యాయి. ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌), ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) తొమ్మిదో సీజన్లు శుక్రవారం ఆరంభమవుతున్నాయి. మరోసారి కోర్టులో ఆటగాళ్ల కూతతో అభిమానులను కేక పెట్టించేందుకు పీకేఎల్‌ వచ్చేసింది. ఇప్పటివరకూ ఒక్క సారి కూడా టైటిల్‌ నెగ్గలేకపోయిన తెలుగు టైటాన్స్‌ బోణీ కొట్టాలనే పట్టుదలతో ఈ సారి దాదాపు కొత్త జట్టుతో బరిలో దిగుతోంది. లీగ్‌లో అత్యంత విజయవంతమైన పట్నా పైరేట్స్‌ కూడా మరోసారి కప్పుపై కన్నేసింది. మొత్తం 12 జట్లు హోరాహోరీ సమరానికి సై అంటున్నాయి. పోటీల తొలి రోజు దబంగ్‌ దిల్లీతో యు ముంబా, బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్‌, జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌తో యూపీ యోధ తలపడతాయి. ప్రస్తుతానికి ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మ్యాచ్‌లు బెంగళూరు, ముంబయిలో జరుగుతాయి. ఇప్పటివరకూ పీకేఎల్‌లో పట్నా పైరేట్స్‌ మూడు సార్లు టైటిల్‌ నెగ్గగా.. బెంగాల్‌ వారియర్స్‌, బెంగళూరు బుల్స్‌, దబంగ్‌ దిల్లీ, జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌, యు ముంబా ఒక్కోసారి విజేతగా నిలిచాయి. మరోవైపు రెండేళ్ల తర్వాత ఐఎస్‌ఎల్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ తిరిగి ఇంటా, బయట పద్ధతిలో జరుగనుంది. కరోనా కారణంగా గత రెండు సీజన్లను గోవాలో బబుల్‌లో నిర్వహించిన సంగతి తెలిసిందే. 11 జట్లు పోటీపడుతున్న ఐఎస్‌ఎల్‌లో తొలి మ్యాచ్‌ కొచ్చిలో కేరళ బ్లాస్టర్స్‌, ఈస్ట్‌ బెంగాల్‌ మధ్య జరుగుతుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హైదరాబాద్‌ ఎఫ్‌సీ తన తొలి మ్యాచ్‌లో ఆదివారం ముంబయి సిటీ ఎఫ్‌సీని ఢీ కొడుతుంది. గచ్చిబౌలి స్టేడియంలోనూ ఈ సారి మ్యాచ్‌లు జరుగుతాయి. పీకేఎల్‌, ఐఎస్‌ఎల్‌ మ్యాచ్‌లు రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌ నెట్‌వర్క్స్‌లో ప్రసారమవుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని