చాహర్‌కు గాయం

టీ20 ప్రపంచకప్‌ ముంగిట టీమ్‌ఇండియాను గాయాల బెడద వీడట్లేదు. ఇప్పటికే రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్‌ బుమ్రా లాంటి కీలక ఆటగాళ్లు గాయాలతో ఈ మెగా టోర్నీకి దూరం కాగా..

Updated : 08 Oct 2022 07:40 IST

దక్షిణాఫ్రికాతో చివరి 2 వన్డేలకు దూరం

టీ20 ప్రపంచకప్‌ ముంగిట టీమ్‌ఇండియాను గాయాల బెడద వీడట్లేదు. ఇప్పటికే రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్‌ బుమ్రా లాంటి కీలక ఆటగాళ్లు గాయాలతో ఈ మెగా టోర్నీకి దూరం కాగా.. ఇప్పుడు ప్రపంచకప్‌ స్టాండ్‌ బై బౌలర్లలో ఒకడిగా ఉన్న దీపక్‌ చాహర్‌ సైతం గాయపడ్డాడు. దక్షిణాఫ్రికాతో తొలి వన్డేకు ముందు ప్రాక్టీస్‌ సందర్భంగా అతడి చీలమండకు గాయమైనట్లు వెల్లడైంది. ఈ కారణంగానే అతను తొలి వన్డేలోనే ఆడలేదు. చివరి రెండు వన్డేలకు కూడా దూరమయ్యాడు. గాయం కారణంగా చాన్నాళ్లు ఆటకు దూరంగా ఉన్న దీపక్‌.. ఇటీవలే టీమ్‌ఇండియాలోకి పునరాగమనం చేశాడు. ప్రపంచకప్‌కు స్టాండ్‌బైగా ఎంపికైనప్పటికీ అతణ్ని జట్టుతో పాటు ఆస్ట్రేలియాకు పంపలేదు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ఆడించాలనుకున్నారు. కానీ చీలమండ మెలిక పడడంతో అతను ఈ సిరీస్‌ మొత్తానికి దూరం అయ్యాడు. మరి దీపక్‌ ప్రపంచకప్‌కు అందుబాటులో ఉంటాడో లేడో తెలియడం లేదు.

ప్రపంచకప్‌ నెట్‌ బౌలర్లుగా ముకేశ్‌, సకారియా
ప్రపంచకప్‌ సందర్భంగా టీమ్‌ఇండియా ప్రాక్టీస్‌ కోసమని ఇద్దరు నెట్‌ బౌలర్లను ఎంపిక చేశారు. ఐపీఎల్‌లో చెన్నై తరఫున సత్తా చాటిన ముకేశ్‌ చౌదరి, దిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన  చేతన్‌ సకారియా నెట్‌ బౌలర్లుగా జట్టుతో పాటు ఆస్ట్రేలియాకు వెళ్లారు. పెర్త్‌లో ప్రాక్టీస్‌ సెషన్‌ సందర్భంగా వీళ్లిద్దరూ జట్టుకు సేవలందించనున్నారు. ఆ తర్వాత కూడా జట్టుతోనే కొనసాగుతారు.

పెర్త్‌లో రోహిత్‌సేన
టీ20 ప్రపంచకప్‌ కోసం రోహిత్‌ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు చేరుకుంది. ఈ నెల 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమ్‌ఇండియా తన తొలి మ్యాచ్‌ ఆడనున్న సంగతి తెలిసిందే. ఈలోపు పెర్త్‌లోనే అయిదు రోజుల పాటు బస చేయనున్న భారత ఆటగాళ్లు ఇక్కడే ప్రాక్టీస్‌ చేయనున్నారు. ఈ నెల 10, 13 తేదీల్లో వెస్టర్న్‌ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో రోహిత్‌ సేన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు కూడా ఆడుతుంది. తర్వాత జట్టు బ్రిస్బేన్‌కు వెళ్తుంది. అక్కడ సాధన కొనసాగిస్తుంది. ఈ నెల 17న ఆస్ట్రేలియాతో భారత్‌కు వార్మప్‌ మ్యాచ్‌ కూడా ఉంది. ఆ తర్వాత మెల్‌బోర్న్‌కు వెళ్తుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో జట్టు సభ్యులైన ప్రపంచకప్‌ స్టాండ్‌బై ఆటగాళ్లు శ్రేయస్‌ అయ్యర్‌, దీపక్‌ చాహర్‌, రవి బిష్ణోయ్‌ బ్రిస్బేన్‌లో జట్టును కలిసే అవకాశముంది. ప్రపంచకప్‌కు స్టాండ్‌బైగా ఎంపికై, కొవిడ్‌ బారిన పడి కోలుకుంటున్న సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమి ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ అకాడమీలో ఉన్నాడు. అతను ఫిట్‌నెస్‌ సాధిస్తే మిగతా ముగ్గురు స్టాండ్‌బై ఆటగాళ్లతో కలిసి ఆస్ట్రేలియాకు బయల్దేరతాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts