BCCI President: బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా ఆయనేనా?

బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరభ్‌ గంగూలీ ఇంకొన్ని రోజులే కొనసాగనున్నాడు! తిరిగి అతడు అధ్యక్ష రేసులో పోటీపడే అవకాశాలు లేనట్లే.

Updated : 08 Oct 2022 07:41 IST

ముంబయి: బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరభ్‌ గంగూలీ ఇంకొన్ని రోజులే కొనసాగనున్నాడు! తిరిగి అతడు అధ్యక్ష రేసులో పోటీపడే అవకాశాలు లేనట్లే. మరి అతడి స్థానం ఎవరిది అన్న దానిపై ఇప్పటికే బోర్డు సీనియర్లు ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు కనిపిస్తోంది. 1983 ప్రపంచకప్‌ హీరో రోజర్‌ బిన్నీ బీసీసీఐ అధ్యక్షుడు కావొచ్చని సమాచారం. ఈనెల 18న జరిగే ఎన్నికలు, వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొనే ఓటర్ల జాబితాలో కర్ణాటక రాష్ట్ర క్రికెట్‌ సంఘం (కేఎస్‌సీఏ) తరఫున బిన్నీ పేరు ఉండటమే ఇందుకు కారణం. గతంలో కేఎస్‌సీఏ కార్యదర్శి సంతోష్‌ మేనన్‌ బోర్డు ఏజీఏంలో పాల్గొన్నాడు. కొత్త కార్యవర్గంలో ఎవరుండాలి అన్న విషయంలో దిల్లీలో కీలక సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆఫీస్‌ బేరర్లతో పాటు గతంలో కార్యవర్గ సభ్యులుగా పనిచేసిన సీనియర్లు ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ‘‘ఇంకా స్పష్టత రాలేదు. ముఖ్య కేబినెట్‌ మంత్రి ఏం చెప్తే అదే జరుగుతుంది. ఆయన మాట అందరూ వింటారు’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ఐసీసీ ఛైర్మన్‌ పదవికి పోటీపడతాడని.. జై షా బీసీసీఐ కార్యదర్శిగానే కొనసాగుతాడని కథనాలు వినిపిస్తున్నాయి. బోర్డు ఎన్నికలకు ఈనెల 11, 12 తేదీల్లో నామినేషన్లు దాఖలు చేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని