ఓటమితో మొదలెట్టిన టైటాన్స్‌

జట్టు మారింది.. సీజన్‌ మారింది.. కానీ తెలుగు టైటాన్స్‌ రాత మాత్రం మారలేదు. ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) తొమ్మిదో సీజన్‌ను ఆ జట్టు ఓటమితో మొదలెట్టింది.

Published : 08 Oct 2022 01:46 IST

ప్రొ కబడ్డీ లీగ్‌

బెంగళూరు: జట్టు మారింది.. సీజన్‌ మారింది.. కానీ తెలుగు టైటాన్స్‌ రాత మాత్రం మారలేదు. ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) తొమ్మిదో సీజన్‌ను ఆ జట్టు ఓటమితో మొదలెట్టింది. శుక్రవారం తన తొలి మ్యాచ్‌లో టైటాన్స్‌ 29-34 తేడాతో బెంగళూరు బుల్స్‌ చేతిలో ఓడింది. రైడింగ్‌లో మెరుగ్గానే రాణించిన టైటాన్స్‌.. ట్యాక్లింగ్‌లో విఫలమై పరాజయం మూటగట్టుకుంది. హోరాహోరీగా సాగిన పోరులో చివర్లో జట్టు వెనకబడింది. తొలి అర్ధభాగంలో మొదట ఆలౌటైన ఆ జట్టు ఆ తర్వాత పుంజుకుంది. ప్రత్యర్థిని ఓ సారి ఆలౌట్‌ చేసింది. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సరికి జట్లు 17-17తో నిలిచాయి. రెండో అర్ధభాగంలోనూ రెండు జట్లు పోటాపోటీగా తలపడ్డాయి. మరో తొమ్మిది నిమిషాలు ఆట మిగిలి ఉందనగా స్కోరు 23-23తో సమమైంది. కానీ అక్కడినుంచి ట్యాక్లింగ్‌లో టైటాన్స్‌ నిరాశపర్చింది. ప్రత్యర్థి ఆటగాళ్లను పట్టలేక పరాజయం చవిచూసింది. మరోసారి ఆలౌటై 25-30తో వెనకబడింది. ఆఖర్లో ప్రత్యర్థిని అందుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.  టైటాన్స్‌ తరపున రైడింగ్‌లో వినయ్‌ (7 పాయింట్లు), రజ్నీష్‌ (7) రాణించారు. బెంగళూరు జట్టులో నీరజ్‌ (7) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్‌ మహేందర్‌ సింగ్‌ (4) ట్యాక్లింగ్‌లో సత్తాచాటాడు. అంతకుముందు సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో దబంగ్‌ దిల్లీ 41-27తో యు ముంబాను చిత్తుచేసింది. దిల్లీ కెప్టెన్‌ నవీన్‌ (13) రైడింగ్‌లో అదరగొట్టాడు. మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్‌ 34-32తో జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌పై గెలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని