సంక్షిప్త వార్తలు

స్వదేశంలో ఫిఫా అండర్‌-17 అమ్మాయిల ప్రపంచకప్‌కు సమయం దగ్గర పడుతోంది. మంగళవారం ఈ ఫుట్‌బాల్‌ టోర్నీకి తెరలేవనుంది. బలమైన యుఎస్‌ఏ, బ్రెజిల్‌, మొరాకోతో కలిసి ఆతిథ్య భారత్‌ గ్రూప్‌-ఎలో ఉంది.

Updated : 08 Oct 2022 04:00 IST

క్వార్టర్స్‌ చేరడమే లక్ష్యం

భువనేశ్వర్‌: స్వదేశంలో ఫిఫా అండర్‌-17 అమ్మాయిల ప్రపంచకప్‌కు సమయం దగ్గర పడుతోంది. మంగళవారం ఈ ఫుట్‌బాల్‌ టోర్నీకి తెరలేవనుంది. బలమైన యుఎస్‌ఏ, బ్రెజిల్‌, మొరాకోతో కలిసి ఆతిథ్య భారత్‌ గ్రూప్‌-ఎలో ఉంది. 16 జట్లు నాలుగు గ్రూప్‌లుగా విడిపోయి తలపడతాయి. గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తాయి. ఈ నేపథ్యంలో టోర్నీలో క్వార్టర్స్‌ చేరడం లక్ష్యంగా పెట్టుకున్నామని భారత జట్టు ప్రధాన కోచ్‌ థామస్‌ డెనెర్బీ చెప్పాడు. ‘‘అవును.. అగ్రశ్రేణి జట్లతో తలపడబోతున్నాం. కానీ ఆ రోజు కలిసొచ్చి, ప్రత్యర్థి వెనకబడితే అండర్‌డాగ్స్‌గా బరిలో దిగే మాకు గెలిచే అవకాశం ఉంటుంది. ఆరంభంలోనే గోల్‌ చేస్తే ప్రత్యర్థి జట్లు ఒత్తిడికి గురవుతాయి. ఎప్పుడూ ఓ అవకాశం ఎదురు చూస్తూనే ఉంటుంది. దీన్ని అందుకోవడానికే ప్రయత్నిస్తాం. క్వార్టర్స్‌ చేరాలని అనుకుంటున్నాం. అందులో సందేహం లేదు. పూర్తిగా మనసు పెట్టి ఆడతాం. నేనైతే ఫలితాల గురించి ఆలోచించను. ప్రణాళికలకు అనుగుణంగా ఆడాలి. ఫలితం ఏదైనా ప్రశాంతంగా ఉండాలి. ప్రతి ప్రత్యర్థి నుంచి పాయింట్లు సాధించేందుకు పోరాడతాం. సొంతగడ్డపై జట్టు ఉత్తమ ఆటతీరు కనబరిచేలా పెద్ద సంఖ్యలో అభిమానులు ప్రోత్సహిస్తారనే నమ్మకంతో ఉన్నా. యుఎస్‌ఏ లేదా బ్రెజిల్‌ను ఓడిస్తామని చెప్పడం తొందరపాటే అవుతుంది. మన జట్టు డిఫెన్స్‌ బలంగా ఉంది. ఎదురు దాడి కూడా చేస్తుంది’’ అని అతను పేర్కొన్నాడు.


కేరళ బ్లాస్టర్స్‌ శుభారంభం

కొచ్చి: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) తొమ్మిదో సీజన్‌లో కేరళ బ్లాస్టర్స్‌ ఎఫ్‌సీ శుభారంభం చేసింది. శుక్రవారం సీజన్‌ తొలి మ్యాచ్‌లో ఆ జట్టు 3-1 తేడాతో ఈస్ట్‌ బెంగాల్‌ ఎఫ్‌సీపై విజయం సాధించింది. రెండు జట్లు హోరాహోరీగా తలపడడంతో తొలి అర్ధభాగంలో గోల్స్‌ నమోదు కాలేదు. రెండో అర్ధభాగంలో కేరళ బ్లాస్టర్స్‌ ఆటగాళ్లు చెలరేగారు. బంతిని నియంత్రణలో ఉంచుకుని గోల్స్‌ వేటలో సాగారు. అడ్రియాన్‌ లూనా (72వ నిమిషంలో) గోల్‌తో ఆ జట్టు ఖాతా తెరిచింది. ఇవాన్‌ (82వ, 89వ) రెండు గోల్స్‌తో జట్టును విజయపథంలో నడిపించాడు. ఈస్ట్‌బెంగాల్‌ తరపున అలెక్స్‌ (88వ) ఓ గోల్‌ కొట్టాడు.


మెరిసిన వార్నర్‌, స్టార్క్‌
విండీస్‌తో రెండో టీ20లోనూ ఆసీస్‌ విజయం

బ్రిస్బేన్‌: ఇటీవల టీమ్‌ఇండియా చేతిలో సిరీస్‌ ఓటమి చవిచూసిన ఆస్ట్రేలియా.. వెంటనే పుంజుకుంది. సొంతగడ్డపై వెస్టిండీస్‌తో సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. రెండో టీ20లో ఆ జట్టు 31 పరుగుల తేడాతో నెగ్గింది. మొదట డేవిడ్‌ వార్నర్‌ (75; 41 బంతుల్లో 10×4, 3×6)తో పాటు టిమ్‌ డేవిడ్‌ (42; 20 బంతుల్లో 4×4, 3×6) చెలరేగడంతో ఆసీస్‌ 7 వికెట్లకు 178 పరుగులు చేసింది. విండీస్‌ బౌలర్లలో అల్జారి జోసెఫ్‌ (3/21) సత్తా చాటాడు. అనంతరం స్టార్క్‌ (4/20), కమిన్స్‌ (2/32)ల ధాటికి    కరీబియన్‌ జట్టు 8 వికెట్లకు 147 పరుగులే చేయగలిగింది. చార్లెస్‌ (29), అకీల్‌ హొసీన్‌ (25) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.


బంగ్లాపై పాక్‌ విజయం

క్రైస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్‌ ఆతిథ్యమిస్తున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో పాకిస్థాన్‌ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో పాక్‌ 21 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. మొదట పాక్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 167 పరుగులు రాబట్టింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మహ్మద్‌ రిజ్వాన్‌ (78 నాటౌట్‌; 50 బంతుల్లో 7×4, 2×6) అజేయ అర్ధ సెంచరీతో సత్తాచాటగా.. కెప్టెన్‌ బాబర్‌ అజాం (22; 25 బంతుల్లో 4×4), షాన్‌ మసూద్‌ (31; 22 బంతుల్లో 4×4, 1×6) రాణించారు.   అనంతరం బంగ్లా 20 ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులే చేయగలిగింది. లిటన్‌ దాస్‌ (35; 26 బంతుల్లో 4×4, 1×6), యాసిర్‌ అలీ (42 నాటౌట్‌; 21 బంతుల్లో 5×4, 2×6) పోరాడినా ఫలితం లేకపోయింది. పాక్‌ బౌలర్లు మహ్మద్‌ వసీం (3/24), మహ్మద్‌ నవాజ్‌ (2/25) మెరిశారు.


గ్లోబల్‌ మెంటార్‌గా గంభీర్‌

దిల్లీ: ఆర్‌పీ సంజీవ్‌ గోయెంకా గ్రూపు (ఆర్‌పీఎస్‌జీ) గౌతమ్‌ గంభీర్‌ను లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ గ్లోబల్‌ మెంటార్‌గా నియమించింది. ఐపీఎల్‌లో లఖ్‌నవూకు మార్గనిర్దేశకుడిగా ఉన్న గంభీర్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్‌ వ్యవహారాలు చూసుకునే బాధ్యతను అప్పగించింది. లఖ్‌నవూతో పాటు దక్షిణాఫ్రికా లీగ్‌ జట్టు డర్బన్స్‌ సూపర్‌ జెయింట్స్‌కూ గంభీర్‌ మార్గనిర్దేశకుడిగా వ్యవహరిస్తాడు. గంభీర్‌ ఆధ్వర్యంలో లఖ్‌నవూ తన తొలి సీజన్‌లోనే ప్లేఆఫ్స్‌కు చేరుకుంది.


ఆనంద్‌, కార్ల్‌సన్‌ గెలిచినా
జట్ల వెనుకంజ

దిల్లీ: యురోపియన్‌ క్లబ్‌ కప్‌ చెస్‌ టోర్నీలో ప్రపంచ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌, దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్‌ ఆనంద్‌ నాలుగో రౌండ్‌ గేమ్‌ల్లో గెలిచారు. కానీ వీళ్ల జట్లు పాయింట్ల వేటలో వెనకబడ్డాయి. కార్ల్‌సన్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న ఆఫర్‌స్పిల్‌ చెస్‌ క్లబ్‌ నాలుగో రౌండ్లో 2.5-3.5 తేడాతో నోవీ బార్‌ చేతిలో ఓడింది. పెంటేల హరికృష్ణపై కార్ల్‌సన్‌ నెగ్గినప్పటికీ.. విదిత్‌ గుజరాత్‌ చేతిలో ఆర్యన్‌, మార్కస్‌ చేతిలో జొహనెస్‌ హాగ్‌ ఓడడంతో ఆ జట్టుకు పరాజయం తప్పలేదు. మరోవైపు ఆనంద్‌ క్లబ్‌ సీఎస్‌యూ ఏఎస్‌ఈ సూపర్‌బెట్‌ను 3-3తో షాక్‌క్లబ్‌ వీన్‌హీమ్‌ నిలువరించింది. మమెద్యరోవ్‌పై ఆనంద్‌ విజయం సాధించాడు. కానీ మిగతా ఆటగాళ్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో ఆ జట్టు డ్రాతో సరిపెట్టుకుంది. టోర్నీలో మరో మూడు రౌండ్లు మిగిలి ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు