వ్రితికి మరో పతకం

జాతీయ క్రీడల్లో తెలంగాణ సంచలన స్విమ్మర్‌ వ్రితి అగర్వాల్‌ పతకాల పంట పండిస్తోంది. ఇప్పటికే మూడు పతకాలు సొంతం చేసుకున్న ఆమె..

Published : 08 Oct 2022 01:46 IST

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ క్రీడల్లో తెలంగాణ సంచలన స్విమ్మర్‌ వ్రితి అగర్వాల్‌ పతకాల పంట పండిస్తోంది. ఇప్పటికే మూడు పతకాలు సొంతం చేసుకున్న ఆమె.. శుక్రవారం మరో కాంస్యాన్ని ఖాతాలో వేసుకుంది. మహిళల 400మీ. ఫ్రీస్టైల్‌ విభాగంలో ఆమె మూడో స్థానంలో నిలిచింది. 4 నిమిషాల 34.98 సెకన్లలో ఆమె రేసు ముగించింది. రామచంద్రన్‌ హషిక (4:32.17సె- కర్ణాటక) స్వర్ణం, భవ్య (4:32.80సె- దిల్లీ) కాంస్యం సొంతం చేసుకున్నారు.
అథ్లెట్లకు గోపీచంద్‌ అభినందన: జాతీయ క్రీడల్లో 400మీ. పరుగులో రజతం గెలిచిన జ్యోతిక శ్రీ (ఆంధ్రప్రదేశ్‌), 100మీ. హార్డిల్స్‌లో వెండి పతకం నెగ్గిన నందిని (తెలంగాణ)ని బ్యాడ్మింటన్‌ జాతీయ ప్రధాన కోచ్‌ గోపీచంద్‌ శుక్రవారం అభినందించాడు. ఈ ఇద్దరు అథ్లెట్లు సాయ్‌ గోపీచంద్‌ మిత్రా అథ్లెటిక్స్‌ ప్రాజెక్టు కింద గచ్చిబౌలి స్టేడియంలో కోచ్‌ నాగపురి రమేశ్‌ దగ్గర శిక్షణ పొందుతున్నారు.


టాప్‌-25లో చోటు దిశగా..

సూరత్‌: కరోనా మహమ్మారి తన ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపిందని, తిరిగి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్‌-25లో స్థానం సాధించడంపై దృష్టి సారించానని హైదరాబాద్‌ షట్లర్‌ సాయిప్రణీత్‌ తెలిపాడు. తాజాగా అతను తొలిసారి జాతీయ క్రీడల బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 2017లో సింగపూర్‌ సూపర్‌ సిరీస్‌తో జోరు ప్రదర్శించిన అతను 2019లో ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌ కాంస్యం నెగ్గాడు. కానీ ఆ తర్వాత కరోనా అతని లయను దెబ్బతీసింది. దీంతో 10 నుంచి 41వ (ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి) ర్యాంకుకు పడిపోయాడు. ‘‘2017 నుంచి నా కెరీర్‌ ఉన్నత స్థాయిలో సాగింది. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడం ప్రతికూలంగా మారింది. నా సాధన ఆగిపోయింది. సాధన కొనసాగించాలా లేదా సురక్షితంగా ఉండాలా? అన్నది అర్థం కాలేదు. చివరకు ఇంట్లోనే కూర్చుండిపోయా. అందుకే ఒలింపిక్స్‌కు మెరుగ్గా సన్నద్ధమవలేదు. అనంతరం ఒక్కసారిగా శిక్షణతో అధిక భారం పడి గాయాల పాలయ్యా. కానీ ఇప్పుడు జాతీయ క్రీడల్లో ప్రణయ్‌పై గెలుపు ముందుకు సాగేందుకు బలాన్ని ఇచ్చింది. ఇది ఆత్మవిశ్వాసం, స్వీయ నమ్మకంతోనే సాధ్యమైంది. వీలైనంత త్వరగా తిరిగి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్‌-25లోపు చోటు దక్కించుకోవడంపైనే దృష్టి సారించా. నా ఫిట్‌నెస్‌పై మరింత కసరత్తు చేయాలి. తిరిగి ఆడేలా కుటుంబం నాకు స్ఫూర్తినిచ్చింది. నా తనయుడిని చూసినప్పుడు సంతోషంగా, ఉపశమనంగా అనిపిస్తోంది’’ అని 30 ఏళ్ల ప్రణీత్‌ పేర్కొన్నాడు.


మెరిసిన విద్య, వర్ష

కౌలలంపూర్‌: ప్రపంచ మహిళల 6 రెడ్‌ స్నూకర్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత అమ్మాయిల విద్య పిళ్లై, వర్ష సంజీవ్‌ పతకాలతో మెరిశారు. విద్య రజతం, వర్ష కాంస్యం గెలిచారు. ప్రపంచ టీమ్‌ స్నూకర్‌ మాజీ ఛాంపియన్‌ విద్య ఫైనల్లో 0-4 తేడాతో వరాతనన్‌ సుక్రితేన్స్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడింది. గ్రూప్‌- బిలో అగ్రస్థానంలో నిలిచి, నాకౌట్‌లోనూ సత్తాచాటి తుదిపోరు చేరిన ఆమె.. చివరకు వరాతనన్‌ చేతిలో పరాజయం పాలైంది. గ్రూప్‌-సిలో అగ్రస్థానంతో ముందంజ వేసిన వర్ష సెమీస్‌లో 0-3తో వరాతనన్‌ చేతిలోనే ఓడి కాంస్యంతో సంతృప్తి చెందింది. మరోవైపు ప్రపంచ బిలియర్డ్స్‌ (150 అప్‌) ఛాంపియన్‌షిప్‌లో పోటీపడుతున్న ఏడుగురు భారత ఆటగాళ్లూ నాకౌట్‌కు అర్హత సాధించారు. పంకజ్‌ అడ్వాణీ, శ్రీకృష్ణ, రోహన్‌, ధ్వజ్‌ హరియా, సౌరభ్‌, లౌకిక్‌, ధ్రువ్‌ ముందంజ వేశారు.


భారత్‌కు మరో పతకం

షాట్‌గన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌

ముంబయి: ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షాట్‌గన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో పతకం దక్కింది. భవ్‌తేగ్‌ గిల్‌, రితురాజ్‌ బుండేలా, అభయ్‌ సింగ్‌ సెఖాన్‌లతో కూడిన పురుషుల స్కీట్‌ జట్టు కాంస్యం సాధించింది. కాంస్యం కోసం జరిగిన పోరులో ఈ బృందం 6-2తో చెక్‌ రిపబ్లిక్‌పై విజయం సాధించింది. టోర్నీలో భారత్‌కిది నాలుగో పతకం. ఇప్పటికే పురుషుల ట్రాప్‌లో స్వర్ణం, జూనియర్‌ మహిళల స్కీట్‌లో రజతం, మిక్స్‌డ్‌ స్కీట్‌లో కాంస్యం దక్కాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని