IND Vs SA: కుర్రాళ్లు కుమ్మేశారు

279.. చిన్న లక్ష్యమేమీ కాదు. ఆడుతోంది ద్వితీయ శ్రేణి జట్టు. పైగా జట్టులో అత్యంత అనుభవజ్ఞుడు, సారథి కూడా అయిన శిఖర్‌ ధావన్‌ 13 పరుగులకే వెనుదిరిగాడు. మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ కూడా తొమ్మిదో ఓవర్లోనే ఔటయ్యాడు.

Updated : 10 Oct 2022 09:22 IST

279 పరుగుల లక్ష్యం ఉఫ్‌
రెండో వన్డేలో భారత్‌ ఘనవిజయం
శ్రేయస్‌ సెంచరీ.. చెలరేగిన ఇషాన్‌
మెరిసిన సిరాజ్‌

279.. చిన్న లక్ష్యమేమీ కాదు. ఆడుతోంది ద్వితీయ శ్రేణి జట్టు. పైగా జట్టులో అత్యంత అనుభవజ్ఞుడు, సారథి కూడా అయిన శిఖర్‌ ధావన్‌ 13 పరుగులకే వెనుదిరిగాడు. మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ కూడా తొమ్మిదో ఓవర్లోనే ఔటయ్యాడు. రబాడ నేతృత్వంలోని దక్షిణాఫ్రికా బౌలింగ్‌ దాడిని ఎదుర్కోలేక తొలి వన్డేలో ఓటమి పాలైన టీమ్‌ఇండియాకు ఈసారీ కష్టమే అనిపించింది. కానీ శ్రేయస్‌ అయ్యర్‌ (113 నాటౌట్‌; 111 బంతుల్లో 15×4), ఇషాన్‌ కిషన్‌ (93; 84 బంతుల్లో 4×4, 7×6) జోడీ చెలరేగి ఆడి ఛేదనను సాఫీగా మార్చేసింది. 1-1తో సమమైన సిరీస్‌లో ఇక విజేత ఎవరో తేలేది చివరిదైన మూడో వన్డేలోనే.

క్షిణాఫ్రికాతో తొలి వన్డేలో త్రుటిలో ఓడిన భారత్‌.. వెంటనే పుంజుకుంది. రెండో వన్డేలో ఆ జట్టును 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. యువ బ్యాటర్లు శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ చెలరేగడంతో 279 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 45.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. మొదట మార్‌క్రమ్‌ (79; 89 బంతుల్లో 7×4, 1×6), రీజా హెండ్రిక్స్‌ (74; 76 బంతుల్లో 9×4, 1×6) రాణించడంతో దక్షిణాఫ్రికా 7 వికెట్లకు 278 పరుగులు చేసింది. 300 పైచిలుకు స్కోరు చేసేలా కనిపించిన ఆ జట్టుకు మహ్మద్‌ సిరాజ్‌ (3/38) కళ్లెం వేశాడు. అరంగేట్ర ఆటగాడు షాబాజ్‌ అహ్మద్‌ (1/54)తో పాటు మరో స్పిన్నర్‌ కుల్‌దీప్‌ (1/49) కూడా ఆకట్టుకున్నారు. శ్రేయస్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు. నిర్ణయాత్మక చివరి వన్డే దిల్లీలో మంగళవారం జరుగుతుంది.

అలా మొదలై..: ఛేదనలో భారత్‌కు సరైన ఆరంభం దక్కలేదు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ నిరాశ పరిచిన కెప్టెన్‌ ధావన్‌ (13) క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బంది పడి.. చివరికి పార్నెల్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. మరోవైపు నిలకడగానే ఆడుతున్న శుభ్‌మన్‌ గిల్‌ (28; 26 బంతుల్లో 5×4) రబాడ వేసిన తొమ్మిదో ఓవర్లో అతడికే క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికి స్కోరు 48. ఈ స్థితిలో పెద్దగా అంచనాల్లేకుండా క్రీజులోకి అడుగు పెట్టిన ఇషాన్‌ కిషన్‌.. కాస్త కుదురుకునే వరకు ఆచితూచి ఆడాడు. శ్రేయస్‌ కూడా నెమ్మదిగానే బ్యాటింగ్‌ చేయడంతో 18 ఓవర్లకు స్కోరు 85 పరుగులే. కానీ నిలదొక్కుకున్నాక ఇషాన్‌ సఫారీ బౌలర్ల మీద ఎదురుదాడికి దిగాడు. స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ బౌలింగ్‌లో 2 ఓవర్ల వ్యవధిలో మూడు సిక్సర్లు బాదిన అతను.. ఇక ఆగనే లేదు. మిగతా ఇద్దరు స్పిన్నర్లు ఫోర్టుయిన్‌, మార్‌క్రమ్‌లకు కూడా చుక్కలు చూపించాడు. తర్వాత పేసర్ల బంతులనూ అలవోకగా బౌండరీ దాటించాడు. మరోవైపు తొలి వన్డే జోరును కొనసాగిస్తూ శ్రేయస్‌ కూడా చక్కటి షాట్లు ఆడాడు. ఇషాన్‌, శ్రేయస్‌ ఒకే ఓవర్లో, వరుస బంతుల్లో అర్ధశతకాలు పూర్తి చేసుకోవడం విశేషం. 50 తర్వాత ఇషాన్‌ మరింత చెలరేగాడు. శరవేగంగా 90ల్లోకి వచ్చేశాడు. అతడి ఊపు చూస్తే సెంచరీ లాంఛనమే అనిపించింది. కానీ ఫోర్టుయిన్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడబోయి వెనుదిరిగాడు. దీంతో మూడో వికెట్‌ భాగస్వామ్యానికి 162 పరుగుల వద్ద బ్రేక్‌ పడింది. ఇషాన్‌ ఔటయ్యే సమయానికి 71 పరుగులపై ఉన్న శ్రేయస్‌.. అతడిలా తొందరపడలేదు. కుదురుగా ఆడుతూ సెంచరీ పూర్తి చేశాడు. శాంసన్‌  (30; 36 బంతుల్లో 1×4, 1×6) సహకరించాడు. నోకియా బంతిని బౌండరీకి తరలించిన శ్రేయస్‌.. 25 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించాడు.

అదరగొట్టిన సిరాజ్‌: దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో సిరాజ్‌ బౌలింగే హైలైట్‌.  ఆదివారం తన పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెరీర్లోనే అత్యుత్తమం అనదగ్గ ప్రదర్శన చేశాడతను. అతడితో పాటు మిగతా బౌలర్లు ఆరంభంలో, చివర్లో చక్కగా బౌలింగ్‌ చేశారు. మధ్య ఓవర్లలో మాత్రమే దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది.ఫామ్‌లో ఉన్న డికాక్‌ (5)ను ఆరంభంలోనే బౌల్డ్‌ చేసిన సిరాజ్‌ భారత్‌కు శుభారంభం అందించగా.. మరో ఓపెనర్‌ జానెమన్‌ మలన్‌ (25)ను స్పిన్నర్‌ షాబాజ్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ దశలో రీజా హెండ్రిక్స్‌, మార్‌క్రమ్‌ జోడీ కీలక భాగస్వామ్యం (129)తో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడమే కాక జట్టును పటిష్ట స్థితికి చేర్చింది. హెండ్రిక్స్‌ ఔటయ్యాక క్లాసెన్‌ (30; 26 బంతుల్లో 2×4, 2×6)తో మార్‌క్రమ్‌ మరో మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. క్లాసెన్‌ ఉన్నంతసేపు ధాటిగా ఆడాడు. 38వ ఓవర్లో అతను ఔటయ్యేసరికి స్కోరు 215. సెంచరీ దిశగా సాగుతున్న మార్‌క్రమ్‌కు తోడు మిల్లర్‌ కూడా ఉండడంతో దక్షిణాఫ్రికా సునాయాసంగా 300 దాటేలా కనిపించింది. కానీ తర్వాతి ఓవర్లోనే మార్‌క్రమ్‌ కూడా వెనుదిరగడం.. చివరి ఓవర్లలో భారత బౌలర్లు గొప్పగా బౌలింగ్‌ చేయడంతో దక్షిణాఫ్రికా 278 పరుగులకు పరిమితమైంది. మిల్లర్‌ (35 నాటౌట్‌; 34 బంతుల్లో 4×4) క్రీజులో ఉన్నా సిరాజ్‌ తన చివరి 4 ఓవర్లలో 17 పరుగులే ఇచ్చి ఒక వికెట్‌ పడగొట్టడం విశేషం.

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: డికాక్‌ (బి) సిరాజ్‌ 5; మలన్‌ ఎల్బీ (బి) షాబాజ్‌ 25; రీజా హెండ్రిక్స్‌ (సి) షాబాజ్‌ (బి) సిరాజ్‌ 74; మార్‌క్రమ్‌ (సి) ధావన్‌ (బి) సుందర్‌ 79; క్లాసెన్‌ (సి) సిరాజ్‌ (బి) కుల్‌దీప్‌ 30; మిల్లర్‌ నాటౌట్‌ 35; పార్నెల్‌ (సి) శ్రేయస్‌ (బి) శార్దూల్‌ 16; కేశవ్‌ (బి) సిరాజ్‌ 5; ఫోర్టుయిన్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (50 ఓవర్లలో 7 వికెట్లకు) 278; వికెట్ల పతనం: 1-7, 2-40, 3-169, 4-215, 5-215, 6-256, 7-277; బౌలింగ్‌: సిరాజ్‌ 10-1-38-3; సుందర్‌ 9-0-60-1; షాబాజ్‌ అహ్మద్‌ 10-0-54-1; అవేష్‌ ఖాన్‌ 7-0-35-0; కుల్‌దీప్‌ 9-0-49-1; శార్దూల్‌ 5-0-36-1

భారత్‌ ఇన్నింగ్స్‌: ధావన్‌ (బి) పార్నెల్‌ 13; శుభ్‌మన్‌ (సి) అండ్‌ (బి) రబాడ 28; ఇషాన్‌ (సి) రీజా హెండ్రిక్స్‌ (బి) ఫోర్టుయిన్‌ 93; శ్రేయస్‌ నాటౌట్‌ 113; శాంసన్‌ నాటౌట్‌ 30; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (45.5 ఓవర్లలో 3 వికెట్లకు) 282; వికెట్ల పతనం: 1-28, 2-48, 3-209; బౌలింగ్‌: ఫోర్టుయిన్‌ 9-1-52-1; పార్నెల్‌ 8-0-44-1; రబాడ 10-1-59-1; నోకియా 8.5-0-60-0; కేశవ్‌ మహరాజ్‌ 7-0-45-0; మార్‌క్రమ్‌ 3-0-22-0


శ్రేయస్‌.. కప్పు దిశగా!

టీ20 ప్రపంచకప్‌ లక్ష్యంగా గత ఏడాది కాలంలో టీమ్‌ఇండియా పరీక్షించి చూసిన యువ ఆటగాళ్లలో శ్రేయస్‌ అయ్యర్‌ ఒకడు. అయితే అతను అవకాశాలను సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. దీంతో శ్రేయస్‌తో పోలిస్తే బ్యాటింగ్‌ సామర్థ్యంలో దిగువనే ఉండే దీపక్‌ హుడాకు ప్రపంచకప్‌ ప్రధాన జట్టులో చోటు దక్కింది. శ్రేయస్‌ స్టాండ్‌బైకి పరిమితం అయ్యాడు. అయితే ప్రపంచకప్‌ ముంగిట శ్రేయస్‌ చక్కటి ప్రదర్శన చేస్తూ సెలక్టర్లు పునరాలోచించుకునేలా చేస్తున్నాడు. నాణ్యమైన బౌలింగ్‌ దళం ఉన్న దక్షిణాఫ్రికాపై అతను వన్డే సిరీస్‌లో వరుసగా 50, 113 పరుగులు చేశాడు. ముఖ్యంగా ఆదివారం నాటి అతడి సెంచరీ కెరీర్లోనే ఉత్తమ ప్రదర్శనల్లో ఒకటి. రెండు మ్యాచ్‌ల్లోనూ రబాడ సహా సఫారీ బౌలర్లందరినీ అతను సమర్థంగా ఎదుర్కొన్నాడు. అలవోకగా షాట్లు ఆడాడు. అతడి ఆట చూశాక ప్రపంచకప్‌లో కచ్చితంగా అతణ్ని ఆడించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జట్టులో మార్పులు చేర్పులకు ఇంకా అవకాశం ఉన్న నేపథ్యంలో శ్రేయస్‌ను ప్రధాన జట్టులోకి ఎంపిక చేస్తారేమో చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని