IND Vs SA: యువ హవా

అసలు జట్టు టీ20 ప్రపంచకప్‌ కోసం ఆస్ట్రేలియాలో ఉంది. ఇక్కడ బలమైన దక్షిణాఫ్రికాతో ద్వితీయ శ్రేణి జట్టు తలపడింది. ప్రధాన బౌలర్లెవ్వరూ అందుబాటులో లేరు. బ్యాటింగ్‌లో అత్యంత అనుభవజ్ఞుడైన కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ మూడు మ్యాచ్‌ల్లో కలిపి చేసిన పరుగులు 25 మాత్రమే. అయితేనేం.. యువ జట్టు పట్టు వదల్లేదు.

Updated : 12 Oct 2022 07:17 IST

విజృంభించిన బౌలర్లు
దక్షిణాఫ్రికా 99కే ఆలౌట్‌
సిరీస్‌ 2-1తో భారత్‌ వశం

అసలు జట్టు టీ20 ప్రపంచకప్‌ కోసం ఆస్ట్రేలియాలో ఉంది. ఇక్కడ బలమైన దక్షిణాఫ్రికాతో ద్వితీయ శ్రేణి జట్టు తలపడింది. ప్రధాన బౌలర్లెవ్వరూ అందుబాటులో లేరు. బ్యాటింగ్‌లో అత్యంత అనుభవజ్ఞుడైన కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ మూడు మ్యాచ్‌ల్లో కలిపి చేసిన పరుగులు 25 మాత్రమే. అయితేనేం.. యువ జట్టు పట్టు వదల్లేదు. తొలి వన్డేలో స్వల్ప తేడాతో ఓడినప్పటికీ.. ఆ తర్వాత బలంగా పుంజుకుని చివరి రెండు వన్డేల్లోనూ ప్రత్యర్థిని పోటీలోనే లేకుండా చేసిన భారత్‌ సిరీస్‌ను 2-1తో చేజిక్కించుకుంది.

దిల్లీ: దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్‌ను చేజిక్కించుకున్న భారత్‌.. వన్డేల్లోనూ ఆ జట్టుకు నిరాశనే మిగిల్చింది. రోహిత్‌ శర్మ నేతృత్వంలోని ప్రధాన జట్టును మించి మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ద్వితీయ శ్రేణి జట్టు వన్డే సిరీస్‌లో ప్రత్యర్థికి పరాభవాన్ని మిగిల్చింది. మంగళవారం నిర్ణయాత్మక చివరి వన్డేలో టీమ్‌ఇండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. బౌలర్లకు పూర్తి సహకారం అందించిన దిల్లీ పిచ్‌పై మొదట దక్షిణాఫ్రికాను భారత బౌలర్లు 99 పరుగులకే కుప్పకూల్చారు. కెరీర్లోనే ఉత్తమం అనదగ్గ ప్రదర్శన చేసిన ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కుల్‌దీప్‌ యాదవ్‌ (4/18)కు తోడు వాషింగ్టన్‌ సుందర్‌ (2/15), సిరాజ్‌ (2/17), షాబాజ్‌ అహ్మద్‌ (2/32) కూడా సత్తా చాటడంతో సఫారీ జట్టు 27.1 ఓవర్లలోనే ఇన్నింగ్స్‌ను ముగించింది. అనంతరం శుభ్‌మన్‌ (49; 57 బంతుల్లో 8×4), శ్రేయస్‌ అయ్యర్‌ (28 నాటౌట్‌; 23 బంతుల్లో 3×4, 2×6) రాణించడంతో లక్ష్యాన్ని భారత్‌ 19.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ రాణించని ధావన్‌ 8 పరుగులకే రనౌటై వెనుదిరిగినా.. గత మ్యాచ్‌ హీరో ఇషాన్‌ కిషన్‌ (10) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవకున్నా.. ఆరంభం నుంచి సఫారీ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న శుభ్‌మన్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అతడికి శ్రేయస్‌ తోడయ్యాక భారత్‌ లక్ష్యం దిశగా పరుగులు పెట్టింది. జట్టు విజయానికి 3 పరుగులు, తన అర్ధశతకానికి ఒక్క పరుగు అవసరమైన స్థితిలో గిల్‌ ఔటయ్యాడు. 20వ ఓవర్లోనే భారత్‌ ఛేదనను పూర్తి చేసింది. సిరాజ్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా ఎంపికయ్యాడు.

ముప్పేట దాడి: అంతకుముందు వర్షం వల్ల ఆట ఆలస్యం కాగా.. పరిస్థితులు బౌలింగ్‌కు పూర్తి అనుకూలంగా ఉండడంతో టాస్‌ గెలిచిన భారత కెప్టెన్‌ ధావన్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఆ నిర్ణయం వంద శాతం సరైందే అని రుజువు చేస్తూ భారత బౌలర్లు విజృంభించారు. ముఖ్యంగా స్పిన్‌కు స్వర్గధామంలా మారిన పిచ్‌ను కుల్‌దీప్‌ బృందం పూర్తిగా ఉపయోగించుకుంది. నేరుగా వాషింగ్టన్‌ సుందర్‌తో ధావన్‌ బౌలింగ్‌ దాడిని ఆరంభించడం విశేషం. స్పిన్‌ ఆడడంలో తమ బలహీనతను బయటపెట్టుకుంటూ సఫారీ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టేశారు. ఫామ్‌లో ఉన్న డికాక్‌ (6)ను ఔట్‌ చేయడం ద్వారా సుందర్‌ దక్షిణాఫ్రికాను తొలి దెబ్బ తీశాడు. ఇక్కడి నుంచి ఇన్నింగ్స్‌ ఆద్యంతం దక్షిణాఫ్రికా తడబాటు కొనసాగింది. మరో ఓపెనర్‌ జానెమన్‌ మలన్‌ (15)తో పాటు గత మ్యాచ్‌లో అర్ధశతకం సాధించిన రీజా హెండ్రిక్స్‌ (3)లను సిరాజ్‌ బుట్టలో వేశాడు. చేంజ్‌ బౌలర్‌గా వచ్చిన షాబాజ్‌ అహ్మద్‌.. మార్‌క్రమ్‌ (9)ను ఔట్‌ చేసి దక్షిణాఫ్రికా కష్టాలను ఇంకా పెంచాడు. ఈ దశలో క్లాసెన్‌ (34; 42 బంతుల్లో 4×4) పోరాడాడు. కానీ అతడికి అవతలి ఎండ్‌ నుంచి పెద్దగా సహకారం అందలేదు. మిల్లర్‌ (7), ఫెలుక్వాయో (5) ఎంతోసేపు నిలవలేదు. జాన్సన్‌ (14)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాలని ప్రయత్నించిన క్లాసెన్‌ను షాబాజ్‌ ఔట్‌ చేయడంతో దక్షిణాఫ్రికా కోలుకోలేకపోయింది. కుల్‌దీప్‌ వరుసగా వికెట్లు పడగొట్టి ఆ జట్టు కథ ముగించాడు.


దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: జె.మలన్‌ (సి) అవేష్‌ (బి) సిరాజ్‌ 15; డికాక్‌ (సి) అవేష్‌ (బి) సుందర్‌ 6; రీజా హెండ్రిక్స్‌ (సి) రవి బిష్ణోయ్‌ (బి) సిరాజ్‌ 3; మార్‌క్రమ్‌ (సి) శాంసన్‌ (బి) షాబాజ్‌ 9; క్లాసెన్‌ (బి) షాబాజ్‌ 34; మిల్లర్‌ (బి) సుందర్‌ 7; ఫెలుక్వాయో (బి) కుల్‌దీప్‌ 5; జాన్సన్‌ (సి) అవేష్‌ (బి) కుల్‌దీప్‌ 14; ఫోర్టుయిన్‌ ఎల్బీ (బి) కుల్‌దీప్‌ 1; నోకియా (బి) కుల్‌దీప్‌ 0; ఎంగిడి నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (27.1 ఓవర్లలో ఆలౌట్‌) 99
వికెట్ల పతనం: 1-7, 2-25, 3-26, 4-43, 5-66, 6-71, 7-93, 8-94, 9-94
బౌలింగ్‌: సుందర్‌ 4-0-15-2; సిరాజ్‌ 5-0-17-2; అవేష్‌ ఖాన్‌ 5-1-8-0; షాబాజ్‌ అహ్మద్‌ 7-0-32-2; శార్దూల్‌ 2-0-8-0;  కుల్‌దీప్‌ 4.1-1-18-4

భారత్‌ ఇన్నింగ్స్‌: ధావన్‌ రనౌట్‌ 8; శుభ్‌మన్‌ ఎల్బీ (బి) ఎంగిడి 49; ఇషాన్‌ (సి) డికాక్‌ (బి) ఫోర్టుయిన్‌ 10; శ్రేయస్‌ నాటౌట్‌ 28; శాంసన్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (19.1 ఓవర్లలో 3 వికెట్లకు) 105; వికెట్ల పతనం: 1-42, 2-58, 3-97
బౌలింగ్‌: జాన్సన్‌ 5.1-0-43-0; ఎంగిడి 5-0-21-1; నోకియా 5-1-15-0; ఫోర్టుయిన్‌ 4-1-20-1


99. భారత్‌పై వన్డేల్లో దక్షిణాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు.
* ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లకు దక్షిణాఫ్రికా ముగ్గురు  (బవుమా, కేశవ్‌ మహరాజ్‌, మిల్లర్‌) కెప్టెన్లను బరిలో దింపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని