Sourav Ganguly: గంగూలీ ఔట్‌

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ కథ ముగిసినట్లే! గత మూడేళ్లుగా భారత క్రికెట్లో చక్రం తిప్పిన గంగూలీకి బీసీసీఐలో స్థానం లేనట్లే! ఐసీసీ ఛైర్మన్‌ పదవీ దాదాకు దాదాపుగా దూరమైనట్లే! బీసీసీఐ నుంచి గంగూలీ నిష్క్రమణకు తేదీ ఖరారైంది. 1983 ప్రపంచకప్‌ హీరో రోజర్‌ బిన్నీ (కర్ణాటక) బోర్డు తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికవనున్నాడు.

Updated : 12 Oct 2022 07:04 IST

బీసీసీఐలో సౌరభ్‌కు స్థానం కరవు
ఐపీఎల్‌ ఛైర్మన్‌ పదవినీ వద్దన్న దాదా
కొత్త అధ్యక్షుడిగా బిన్నీ

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ కథ ముగిసినట్లే! గత మూడేళ్లుగా భారత క్రికెట్లో చక్రం తిప్పిన గంగూలీకి బీసీసీఐలో స్థానం లేనట్లే! ఐసీసీ ఛైర్మన్‌ పదవీ దాదాకు దాదాపుగా దూరమైనట్లే! బీసీసీఐ నుంచి గంగూలీ నిష్క్రమణకు తేదీ ఖరారైంది. 1983 ప్రపంచకప్‌ హీరో రోజర్‌ బిన్నీ (కర్ణాటక) బోర్డు తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికవనున్నాడు. ఈనెల 18న ముంబయిలో జరిగే వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా బిన్నీ అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నాడు. దిల్లీలో వారం రోజుల పాటు తీవ్రంగా సాగిన చర్చల అనంతరం 67 ఏళ్ల బిన్నీని బోర్డు అధ్యక్ష పీఠం వరించింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తనయుడు జై షా రెండో దఫా కార్యదర్శిగా కొనసాగనున్నాడు. ఐసీసీ బోర్డులో బీసీసీఐ ప్రతినిధిగా కూడా గంగూలీ కొనసాగే అవకాశం కనిపించడం లేదు. జై షా ఆ స్థానాన్ని భర్తీ చేయొచ్చని సమాచారం. ‘‘బీసీసీఐ తరఫున ఐసీసీ వ్యవహారాలను చక్కబెట్టడంలో జై షా ముందున్నాడు. 2023 ప్రపంచకప్‌కు మరో ఏడాదే సమయమున్న నేపథ్యంలో ఐసీసీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో భారత్‌కు బలమైన నాయకత్వం ఉండటం చాలా ముఖ్యం’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. సోమవారం ముంబయికి చేరుకున్న గంగూలీ గత వారం రోజులుగా దిల్లీలో బోర్డులోని కీలక సభ్యులతో చర్చలు సాగించాడు. బోర్డు అధ్యక్షుడిగా మరో దఫా కొనసాగేందుకు గంగూలీ ఆసక్తి కనబరిచినా అతనికి నిరాశే ఎదురైంది. అధ్యక్ష పదవి రెండో దఫా ఇచ్చే సంప్రదాయం లేదని దాదాకు స్పష్టంచేసినట్లు తెలుస్తోంది. ‘‘గంగూలీకి ఐపీఎల్‌ ఛైర్మన్‌ పదవిని ఇవ్వజూపగా అతను సున్నితంగా తిరస్కరించాడు.

బీసీసీఐ అధ్యక్షుడిగా పని చేసిన తర్వాత బోర్డులోని సబ్‌ కమిటీకి సారథ్యం వహించడం సరికాదని గంగూలీ భావించాడు. కొత్త కార్యవర్గంలో దాదాకు చోటు లభించకపోవడం ఆశ్చర్యం కలిగించలేదు. విధుల నిర్వహణలో విఫలమయ్యాడంటూ దిల్లీ సమావేశంలో విమర్శలు వచ్చినప్పుడే బోర్డు అధ్యక్షుడిగా అతడిని కొనసాగించడం కష్టమని స్పష్టమైంది. ఐసీసీ అధ్యక్ష పదవికి గంగూలీ పేరును ప్రతిపాదిస్తారో లేదో తెలియదు. ప్రస్తుత పరిస్థితుల్లో అది జరిగేలా లేదు’’ అని బోర్డు వర్గాలు వివరించాయి.
బోర్డులోని అన్ని పదవులూ ఏకగ్రీవమయ్యే అవకాశాలు ఉండటంతో ఏజీఎంలో ఎన్నికలు జరగకపోవచ్చు. బిన్నీ, జై షా, రాజీవ్‌ శుక్లా సహా వివిధ పదవులకు రేసులో ఉన్నవాళ్లంతా మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రాజీవ్‌ శుక్లా ఉపాధ్యక్షుడిగా కొనసాగనున్నాడు. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సోదరుడు, ప్రస్తుత కోశాధికారి అరుణ్‌సింగ్‌ ధుమాల్‌ ఐపీఎల్‌ పగ్గాలు చేపట్టనున్నాడు. బ్రిజేష్‌ పటేల్‌ స్థానంలో ఐపీఎల్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. మహారాష్ట్ర భాజపా నాయకుడు ఆశిష్‌ షెలార్‌ కోశాధికారి పదవి చేపట్టనున్నాడు. శరద్‌ పవార్‌ వర్గంతో కలిసి ముంబయి క్రికెట్‌ సంఘం (ఎంసీఏ) అధ్యక్షుడు కావాలనుకున్న ఆశిష్‌కు బోర్డు కోశాధికారి పదవిని కట్టబెట్టారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సన్నిహితుడు దేవజిత్‌ సైకియా సంయుక్త కార్యదర్శిగా ఎంపికవనున్నాడు. ‘‘ఐపీఎల్‌ పాలక మండలికి అరుణ్‌ ధుమాల్‌ సారథ్యం వహిస్తాడు. అభిషేక్‌ దాల్మియా, ఖైరుల్‌ జమాల్‌ మజుందార్‌ ఐపీఎల్‌ పాలక మండలిలో సభ్యులుగా కొనసాగుతారు. ప్రస్తుతానికి వీరి నామినేషన్లు మాత్రమే వచ్చాయి. బోర్డు కోశాధికారిగా షెలార్‌ బాధ్యతలు చేపట్టగానే ఎంసీఏ అధ్యక్ష పదవికి సమర్పించిన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటాడు. ఐసీసీ ఛైర్మన్‌ పదవికి బోర్డు పోటీపడుతుందా లేదా అన్నది ఇంకా నిర్ణయించలేదు. ఈ విషయాన్ని ఏజీఎంలో చర్చిస్తాం’’ అని రాజీవ్‌ శుక్లా తెలిపాడు. బుధవారం నామినేషన్ల దాఖలు గడువు పూర్తవుతుంది. ఈనెల 14లోపు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. వివిధ పదవులకు బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాల్ని 15న ప్రకటిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని