IND Vs AUS: వచ్చాడు.. గెలిపించాడు

ఆస్ట్రేలియా లక్ష్యం 187 పరుగులు. 18 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 171/4. ఆరు వికెట్లు చేతిలో ఉన్నాయి. ఫించ్‌ 76 పరుగులతో ఊపుమీదున్నాడు. మరో ఎండ్‌లో హిట్టర్‌ డేవిడ్‌ ఉన్నాడు. 2 ఓవర్లలో చేయాల్సిన పరుగులు 16 మాత్రమే. ఈ స్థితిలో భారత ఓటమికి అభిమానులు మానసికంగా సిద్ధమైపోయారు.

Updated : 18 Oct 2022 07:41 IST

షమి ఓవర్లో 4 బంతులకు 4 వికెట్లు

ఆస్ట్రేలియాతో వార్మప్‌లో భారత్‌ గెలుపు

మెరిసిన రాహుల్, సూర్య, భువి

 

ఆస్ట్రేలియా లక్ష్యం 187 పరుగులు. 18 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 171/4. ఆరు వికెట్లు చేతిలో ఉన్నాయి. ఫించ్‌ 76 పరుగులతో ఊపుమీదున్నాడు. మరో ఎండ్‌లో హిట్టర్‌ డేవిడ్‌ ఉన్నాడు. 2 ఓవర్లలో చేయాల్సిన పరుగులు 16 మాత్రమే. ఈ స్థితిలో భారత ఓటమికి అభిమానులు మానసికంగా సిద్ధమైపోయారు. 19వ ఓవర్లో హర్షల్‌ 5 పరుగులే ఇచ్చాడు. 2 వికెట్లు కూడా పడ్డాయి. అయినా ఆస్ట్రేలియాకే మెరుగైన అవకాశాలు కనిపించాయి. అయితే దాదాపు ఏడాదిగా అంతర్జాతీయ టీ20 ఆడని షమి చివరి ఓవర్‌కు బంతి అందుకుని అద్భుతం చేశాడు. కేవలం 4 పరుగులే ఇచ్చాడు. మూడు వికెట్లు తీశాడు. ఒక రనౌట్‌ కూడా కలిపి చివరి 4 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌.. 6 పరుగుల తేడాతో ఓటమి మూటగట్టుకుంది.

బ్రిస్బేన్‌: టీ20 ప్రపంచకప్‌ ముంగిట ప్రాక్టీస్, వార్మప్‌ మ్యాచ్‌లను టీమ్‌ఇండియా చక్కగా ఉపయోగించుకుంటోంది. సోమవారం ఆతిథ్య ఆస్ట్రేలియాతో ఉత్కంఠభరితంగా సాగిన వార్మప్‌ పోరులో భారత్‌ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. గెలుపును మించి భారత్‌కు ఈ మ్యాచ్‌లు సానుకూలతలు చాలానే కనిపించాయి. ముఖ్యంగా ఫిట్‌నెస్, ఫామ్‌ విషయంలో సందేహాలతోనే ప్రపంచకప్‌కు ఎంపికైన ఫాస్ట్‌బౌలర్‌ మహ్మద్‌ షమి (3/4).. వేసిన ఒక్క ఓవర్లోనే మ్యాచ్‌ను గెలిపించే ప్రదర్శన చేయడం అతి పెద్ద సానుకూలాంశం. ఇక స్ట్రైక్‌ రేట్‌ విషయంలో విమర్శలను తిప్పికొడుతూ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (57; 33 బంతుల్లో 6×4, 3×6) మరోసారి చెలరేగి ఆడాడు. సూర్యకుమార్‌ (50; 33 బంతుల్లో 6×4, 1×6) సూపర్‌ ఫామ్‌ను కొనసాగించాడు. మరోవైపు ఆసియా కప్‌లో, సొంతగడ్డపై కంగారూలతో జరిగిన సిరీస్‌లో పేలవంగా బౌలింగ్‌ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పేసర్‌ భువనేశ్వర్‌ (2/20) పేస్‌కు అనుకూలించే ఆస్ట్రేలియా పిచ్‌పై చక్కటి ప్రదర్శన చేశాడు. ఇక కోహ్లి సూపర్‌ ఫీల్డింగ్‌ మ్యాచ్‌లో మరో హైలైట్‌.

అలా మొదలై.. ఇలా ముగిసింది: మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 186 పరుగులు చేసింది. తొలి బంతి నుంచే చెలరేగి ఆడిన రాహుల్‌ జట్టుకు మెరుపు ఆరంభాన్నిచ్చాడు. ఎనిమిదో ఓవర్లో రాహుల్‌ తొలి వికెట్‌ రూపంలో వెనుదిరిగే సరికి స్కోరు 78 కాగా.. అందులో 57 అతడివే. రోహిత్‌ (15), కోహ్లి (19) మంచి ఆరంభాలను వినియోగించుకోలేక వెనుదిరిగినా.. సూర్యకుమార్‌ ధాటిగా బ్యాటింగ్‌ చేయడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అయితే మరో ఎండ్‌ నుంచి అతడికి సహకారం అంది ఉంటే స్కోరు సులువుగా 200 దాటిపోయేదే. కార్తీక్‌ (20) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. హార్దిక్‌ (2) విఫలమయ్యాడు. అనంతరం ఛేదనలో ఆసీస్‌ 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు ఫించ్‌ (76; 54 బంతుల్లో 7×4, 3×6), మిచెల్‌ మార్ష్‌ (35; 18 బంతుల్లో 4×4, 2×6) విధ్వంసక రీతిలో బ్యాటింగ్‌ చేయడంతో ఛేదనలో ఆసీస్‌ దూసుకెళ్లింది. మార్ష్, స్మిత్‌ (11)లను భారత్‌ స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌ చేర్చినా.. మ్యాక్స్‌వెల్‌ (23)తో కలిసి ఫించ్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అయితే చివరి ఓవర్లలో భారత బౌలర్లు గొప్పగా పుంజుకున్నారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ, పరుగులు కట్టడి చేస్తూ ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. చివరి రెండు ఓవర్లలో హర్షల్, షమిల అద్భుత బౌలింగ్‌కు తోడు ఫీల్డింగ్‌ కూడా గొప్పగా సాగడంతో మ్యాచ్‌ భారత్‌ సొంతమైంది. కోహ్లి.. డేవిడ్‌ను కళ్లు చెదిరే రీతిలో డైరెక్ట్‌ త్రోతో రనౌట్‌ చేయడంతో పాటు కమిన్స్‌ క్యాచ్‌ను లాంగాన్‌లో గాల్లోకి ఎగిరి అందుకున్న తీరు మ్యాచ్‌కే హైలైట్‌.

భారత్‌ 7 వికెట్లకు 186 (రాహుల్‌ 57, రోహిత్‌ 15, కోహ్లి 19, సూర్యకుమార్‌ 50, హార్దిక్‌ 2, దినేశ్‌ కార్తీక్‌ 20, కేన్‌ రిచర్డ్‌సన్‌ 4/30, స్టార్క్‌ 1/20); ఆస్ట్రేలియా 180 ఆలౌట్‌ (మిచెల్‌ మార్ష్‌ 35, ఫించ్‌ 76; భువనేశ్వర్‌ 2/20, షమి 3/4)


‘షమి సుదీర్ఘ కాలం తర్వాత ఆడుతున్నాడు. అందుకే అతడికి ఒకే ఓవర్‌ ఇవ్వాలని ముందే అనుకున్నాం. కొత్త బంతితో అతడు ఎంత ప్రమాదకరమో తెలుసు. అందుకే అతడికో సవాల్‌ ఇవ్వాలని భావించి.. ఆఖరి ఓవర్లో బంతి ఇచ్చాం. అతడు ఎలాంటి ప్రభావం చూపించాడో చూశారు కదా. అయితే జట్టు బౌలింగ్‌ ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. బౌలర్లు నిలకడగా సరైన లెంగ్త్‌లో బంతులు వేయడం చాలా అవసరం. స్వదేశీ, ఆస్ట్రేలియా పిచ్‌లకు మధ్య తేడా గమనించి.. వ్యూహాలు, లెంగ్త్‌ మార్చాలి’’

- రోహిత్‌ శర్మ


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని