IND vs PAK: అక్షర్‌ పటేల్‌ రనౌట్‌ వివాదం.. బంతి తాకిందా? లేదా?

ఛేదనలో అక్షర్‌ రనౌట్‌ కొత్త చర్చకు తెరతీసింది. ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌ తొలి బంతికి సింగిల్‌ కోసం తొందరపడి అతను రనౌటయ్యాడు. మిడ్‌వికెట్‌ వైపు బంతి పంపించిన అక్షర్‌ పరుగు కోసం ప్రయత్నించి క్రీజు వదిలాడు. కానీ కోహ్లి వద్దనడంతో తిరిగి వెనక్కి వెళ్లాడు.

Updated : 24 Oct 2022 10:08 IST

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌ ఛేదనలో టీమ్‌ ఇండియా ఆటగాడు అక్షర్‌ పటేల్‌ రనౌట్‌ కొత్త చర్చకు తెరతీసింది. ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌ తొలి బంతికి సింగిల్‌ కోసం తొందరపడి అతను రనౌటయ్యాడు. మిడ్‌వికెట్‌ వైపు బంతి పంపించిన అక్షర్‌ పరుగు కోసం ప్రయత్నించి క్రీజు వదిలాడు. కానీ కోహ్లి వద్దనడంతో తిరిగి వెనక్కి వెళ్లాడు. అప్పటికే బాబర్‌ నుంచి బంతి అందుకున్న వికెట్‌ కీపర్‌ రిజ్వాన్‌ బెయిల్స్‌ను ఎగరగొట్టాడు. కానీ అంతకుముందే బంతి అతని చేతుల్లోంచి జారిపోయింది. దీంతో ముందు బంతి బెయిల్స్‌ను తాకిందా? లేదా అతని గ్లవ్స్‌ తాకాయా? అనే సందేహం రేకెత్తింది. రిజ్వాన్‌ కూడా నాటౌట్‌ అనుకొని నిరాశ వ్యక్తం చేశాడు. చాలా సేపు పరీక్షించిన మూడో అంపైర్‌ బంతే ముందు బెయిల్స్‌ను తాకిందని రనౌటౌగా ప్రకటించాడు. ఈ నిర్ణయంపై సామాజిక మాధ్యమాల్లో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయారు.


స్పైడర్‌ కెమెరా పుణ్యాన..

52 పరుగులతో అజేయంగా నిలిచిన పాక్‌ బ్యాటర్‌ షాన్‌ మసూద్‌ అంతకంటే ముందే పెవిలియన్‌ చేరాల్సింది. కానీ మైదానంలో స్పైడర్‌ కెమెరా పుణ్యాన అతను బతికిపోయాడు. 14 ఓవర్లకు ఆ జట్టు 98/5తో నిలిచింది. అశ్విన్‌ వేసిన తర్వాతి ఓవర్లో ఓ బంతిని మసూద్‌ గాల్లోకి లేపాడు. దీన్ని అందుకోవడానికి డీప్‌ కవర్‌ నుంచి ఫీల్డర్‌ పరుగెత్తుకుంటూ వచ్చాడు. కానీ ఆ బంతి గాల్లోని స్పైడర్‌ కెమెరాకు తగిలి ఎవరూ లేని చోట పడింది. దీంతో కెప్టెన్‌ రోహిత్‌తో పాటు ఫీల్డర్లందరూ అసహనం వ్యక్తం చేశారు. అప్పటికీ మసూద్‌ వ్యక్తిగత స్కోరు 31 పరుగులే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు