Team India: విజయాన్ని వదిలేశారు

చేతుల్లో ఉన్న మ్యాచ్‌ను చెడగొట్టుకోవడం ఎలా? కోరి వస్తున్న విజయాన్ని కాలదన్నుకోవడం ఎలా?ఆదివారం దక్షిణాఫ్రికాతో భారత్‌ పోరు చూస్తే సమాధానాలు దొరుకుతాయి. వందైనా చేస్తుందా అనుకున్న జట్టుకు సూర్యకుమార్‌ 133 పరుగులు సాధించి పెడితేనేమి? బౌలర్లు ప్రత్యర్థికి కళ్లెం వేసి చిన్న లక్ష్యాన్ని కొండలా మారిస్తేనేమి?

Updated : 31 Oct 2022 09:55 IST

కొంపముంచిన ఫీల్డింగ్‌ తప్పిదాలు
సూర్య మినహా బ్యాటర్లు విఫలం
దక్షిణాఫ్రికా చేతిలో భారత్‌ ఓటమి

చేతుల్లో ఉన్న మ్యాచ్‌ను చెడగొట్టుకోవడం ఎలా?

కోరి వస్తున్న విజయాన్ని కాలదన్నుకోవడం ఎలా?

ఆదివారం దక్షిణాఫ్రికాతో భారత్‌ పోరు చూస్తే సమాధానాలు దొరుకుతాయి. వందైనా చేస్తుందా అనుకున్న జట్టుకు సూర్యకుమార్‌ 133 పరుగులు సాధించి పెడితేనేమి? బౌలర్లు ప్రత్యర్థికి కళ్లెం వేసి చిన్న లక్ష్యాన్ని కొండలా మారిస్తేనేమి?

పాక్‌పై వీరోచిత ఇన్నింగ్స్‌తో జట్టుకు అపూర్వ విజయాన్నందించిన కోహ్లి చేతుల్లో పడ్డ క్యాచ్‌ వదిలేశాడు.. కెప్టెన్‌ రోహిత్‌ సునాయాసమైన రనౌట్‌ అవకాశాన్ని వృథా చేశాడు. జట్టు ఎంపికలో, కూర్పులో, బౌలింగ్‌ వ్యూహాల్లో తప్పిదాలు కూడా తోడై చేజేతులా మ్యాచ్‌ను దక్షిణాఫ్రికాకు అప్పగించేసింది టీమ్‌ఇండియా. ఈ ఓటమితో సెమీస్‌ బెర్తుకు ముప్పేమీ లేకపోవచ్చు. కానీ దీన్నుంచి పాఠాలు నేర్వకుంటే మాత్రం ఈసారి కూడా టీ20 ప్రపంచకప్‌పై ఆశలు వదులుకోవాల్సిందే!

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు తొలి పరాజయం. పేస్‌, బౌన్సీ పిచ్‌పై బ్యాటింగ్‌లో తడబడ్డ ఆ జట్టు ఆదివారం 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. టాప్‌ ఆర్డర్‌ తేలిపోవడంతో మొదట టీమ్‌ఇండియా 9 వికెట్లకు 133 పరుగులే చేయగలిగింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (68; 40 బంతుల్లో 6×4, 3×6) అద్భుత పోరాటంతో జట్టు ఆ మాత్రం స్కోరైనా సాధించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఎంగిడి (4/29), పార్నెల్‌ (3/15) భారత్‌ పతనాన్ని శాసించారు. మిల్లర్‌ (59 నాటౌట్‌; 46 బంతుల్లో 4×4, 3×6), మార్‌క్రమ్‌ (52; 41 బంతుల్లో 6×4, 1×6) అర్ధశతకాలతో లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయిదు పాయింట్లతో గ్రూప్‌-2లో భారత్‌ను వెనక్కి నెట్టి దక్షిణాఫ్రికా అగ్రస్థానానికి చేరుకుంది. టీమ్‌ఇండియా ఓటమితో పాకిస్థాన్‌ సెమీఫైనల్‌ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.

10 ఓవర్లకు 40/3..: లక్ష్యం చిన్నదే అయినా కూడా బంతితో టీమ్‌ఇండియా అవకాశాలు సృష్టించుకుంది. ఇంకా కష్టపడితే గెలిచేదేమో కూడా. కానీ పేలవ ఫీల్డింగ్‌తో ఆ జట్టు దెబ్బతింది. మార్‌క్రమ్‌, మిల్లర్‌ భారత్‌ ప్రయత్నాలకు అడ్డుగా నిలిచారు. నిజానికి టీమ్‌ఇండియాకు బంతితో అద్భుత ఆరంభం లభించింది. గొప్పగా బౌలింగ్‌ చేసిన అర్ష్‌దీప్‌ రెండో ఓవర్లో ప్రమాదకర బ్యాట్స్‌మెన్‌ ఓపెనర్‌ డికాక్‌, రొసో (0)ను ఔట్‌ చేశాడు. ఆరో ఓవర్లో బవుమాను షమి ఔట్‌ చేయడంతో దక్షిణాఫ్రికా 24/3తో కష్టాల్లో చిక్కుకుంది. పది ఓవర్లు పూర్తయ్యేసరికి 40/3తో వెనుకబడింది. మ్యాచ్‌లో భారత్‌కు మంచి అవకాశమున్న దశ అది. కానీ మిల్లర్‌, మార్‌క్రమ్‌ అద్భుత బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను భారత్‌కు దూరం చేశారు. వాళ్ల ధాటికి హార్దిక్‌ ఓ ఓవర్లో 16 పరుగులు సమర్పించుకుంటే.. అశ్విన్‌ రెండు ఓవర్లలో 26 పరుగులు ఇచ్చుకున్నాడు. చూస్తుండగానే సమీకరణం మారిపోయింది. 15 ఓవర్లలో 95/3తో దక్షిణాఫ్రికా కోలుకుంది. తర్వాతి ఓవర్లో మార్‌క్రమ్‌ను హార్దిక్‌ ఔట్‌ చేసినా మిల్లర్‌ విధ్వంసక బ్యాటింగ్‌ను కొనసాగిస్తూ దక్షిణాఫ్రికాను వడివడిగా లక్ష్యం దిశగా తీసుకెళ్లాడు. చివరి మూడు ఓవర్లలో ఆ జట్టుకు 25 పరుగులు అవసరం కాగా.. 18వ ఓవర్లో అశ్విన్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాది భారత్‌లో ఉన్న కాస్త ఆశలపై నీళ్లు చల్లాడు మిల్లర్‌. 19వ ఓవర్లో షమి ఆరు పరుగులే ఇచ్చినా మ్యాచ్‌ దక్షిణాఫ్రికా నియంత్రణలోనే ఉంది. ఆఖరి ఓవర్లో ఆ జట్టుకు 6 పరుగులు అవసరం కాగా.. మిల్లర్‌ నాటకీయతకు తావులేకుండా పని పూర్తి చేశాడు.

ఇదేమి ఫీల్డింగ్‌?: భారత్‌ అవకాశాలను అందిపుచ్చుకుని ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో. బౌలర్లకు ఫీల్డర్లు సరైన మద్దతివ్వలేదు. జోరుమీదున్న మార్‌క్రమ్‌.. 12వ ఓవర్లో అశ్విన్‌ బౌలింగ్‌లో ఇచ్చిన ఓ తేలికైన క్యాచ్‌ను డీప్‌ మిడ్‌వికెట్లో కోహ్లి చేజార్చడం భారత్‌కు పెద్ద షాక్‌. బహుశా మ్యాచ్‌లో అదే పెద్ద మలుపేమో! దక్షిణాఫ్రికా స్కోరు 63 వద్ద ఔట్‌ కావాల్సిన మార్‌క్రమ్‌... జట్టు 100 పరుగులతో మెరుగైన స్థితిలో ఉన్నప్పుడు ఔటయ్యాడు. అతడికి మరో జీవనదానం లభించింది. 13వ ఓవర్లో మార్‌క్రమ్‌ను రనౌట్‌ చేసే చక్కని అవకాశాన్ని రోహిత్‌ వృథా చేశాడు. ఎదురుగా, సమీపం నుంచి కూడా అతడు స్టంప్స్‌ను కొట్టలేకపోయాడు. రోహిత్‌ అండర్‌ఆర్మ్‌ త్రో గురి తప్పింది. సూర్యకుమార్‌ సరిగ్గా త్రో చేసి ఉంటే 9వ ఓవర్లో కూడా మార్‌క్రమ్‌ ఔటయ్యేవాడు. అప్పటికి దక్షిణాఫ్రికా స్కోరు 35 పరుగులే. మార్‌క్రమ్‌-మిల్లర్‌ల 76 పరుగుల భాగస్వామ్యం మ్యాచ్‌ ఫలితంలో అత్యంత కీలకం.

సూర్య ఒక్కడే..: 49/5. 8.3 ఓవర్లలో భారత్‌ పరిస్థితిది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌.. ఎంగిడి ధాటికి బెంబేలెత్తిపోయింది. రోహిత్‌ (15), రాహుల్‌ (9), కోహ్లి (12), హుడా (0), హార్దిక్‌ (2) పెవిలియన్‌ బాట పట్టారు. సూర్యకుమార్‌ ఆదుకోకుంటే జట్టు కుప్పకూలేదే. ప్రతికూల పరిస్థితుల్లోనూ తనదైన శైలిలో ఎటాకింగ్‌ గేమ్‌ ఆడిన అతడు ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఎంగిడి విజృంభణతో అయిదో ఓవర్‌ నుంచి భారత్‌ కష్టాలు మొదలయ్యాయి. ఆ ఓవర్లో ఎంగిడి ఓపెనర్లనిద్దరినీ ఔట్‌ చేసి టీమ్‌ఇండియాకు షాకిచ్చాడు. ఓ పుల్‌ షాట్‌కు యత్నించి రోహిత్‌ రిటర్న్‌ క్యాచ్‌ ఇవ్వగా.. రాహుల్‌ ఎడ్జ్‌తో స్లిప్‌లో దొరికిపోయాడు. ఆ తర్వాత భారత్‌ చకచకా మరో మూడు వికెట్లు చేజార్చుకుంది. ఎంగిడి తన తర్వాతి ఓ బౌన్సర్‌తో కోహ్లిని బోల్తా కొట్టించగా.. అక్షర్‌ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన దీపక్‌ హుడాను నోకియా ఔట్‌ చేశాడు. ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్లో ఎంగిడి బౌలింగ్‌లో రబాడ అందుకున్న చక్కని క్యాచ్‌కు హార్దిక్‌ కూడా నిష్క్రమించాడు. ఆ దశలో సూర్య అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. మరోవైపు కార్తీక్‌ (15 బంతుల్లో 6) ఇబ్బందిపడుతున్నా.. సూర్య దూకుడు కొనసాగించాడు. మహరాజ్‌ బౌలింగ్‌లో ముందుకొచ్చి బౌలర్‌ తలమీదుగా సిక్స్‌ కొట్టాడు. ఎంగిడీని వదల్లేదు. అతడి ఓవర్లో పుల్‌ షాట్‌తో ఫైన్‌ లెగ్‌లో సిక్స్‌ కొట్టిన సూర్య.. ఫోర్‌తో అర్ధశతకం (30 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. 15 ఓవర్లలో 101/5తో భారత్‌  కోలుకుంది. కాస్త మెరుగైన స్కోరే సాధించేలా కనిపించింది. కానీ చివరి అయిదు ఓవర్లలో  నాలుగు వికెట్లు కోల్పోయి కేవలం 32 పరుగులే చేయగలిగింది. సూర్య 19వ ఓవర్లో వెనుదిరిగాడు.


భారత్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) ఎంగిడి 9; రోహిత్‌ (సి) అండ్‌ (బి) ఎంగిడి 15; కోహ్లి (సి) రబాడ (బి) ఎంగిడి 12; సూర్యకుమార్‌ (సి) మహరాజ్‌ (బి) పార్నెల్‌ 68; దీపక్‌ హుడా (సి) డికాక్‌ (బి) నోకియా 0; హార్దిక్‌ పాండ్య (సి) రబాడ (బి) ఎంగిడి 2; దినేశ్‌ కార్తీక్‌ (సి) రొసో (బి) పార్నెల్‌ 6; అశ్విన్‌ (సి) రబాడ (బి) పార్నెల్‌ 7; భువనేశ్వర్‌ నాటౌట్‌ 4; షమి రనౌట్‌ 0; అర్ష్‌దీప్‌ సింగ్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 8  మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 133; వికెట్ల పతనం: 1-23, 2-26, 3-41, 4-42, 5-49, 6-101, 7-124, 8-127, 9-130; బౌలింగ్‌: పార్నెల్‌ 4-1-15-3; రబాడ 4-0-26-0; ఎంగిడి 4-0-29-4; నోకియా 4-0-23-1; కేశవ్‌ మహరాజ్‌ 3-0-28-0; మార్‌క్రమ్‌ 1-0-5-0

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: డికాక్‌ (సి) రాహుల్‌ (బి) అర్ష్‌దీప్‌ 1; బవుమా (సి) కార్తీక్‌ (బి) షమి 10; రొసో ఎల్బీ (బి) అర్ష్‌దీప్‌ 0; మార్‌క్రమ్‌ (సి) సూర్యకుమార్‌ (బి) హార్దిక్‌ 52; మిల్లర్‌ నాటౌట్‌ 59; స్టబ్స్‌ ఎల్బీ (బి) అశ్విన్‌ 6; పార్నెల్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 7  మొత్తం: (19.4 ఓవర్లలో 5 వికెట్లకు) 137 వికెట్ల పతనం:1-3, 2-3, 3-24, 4-100, 5-122; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 3.4-0-21-0; అర్ష్‌దీప్‌ సింగ్‌ 4-0-25-2; షమి 4-0-13-1; హార్దిక్‌ పాండ్య 4-0-29-1; అశ్విన్‌ 4-0-43-1


పంత్‌ ఎక్కడ?

వరుసగా విఫలమవుతున్నప్పటికీ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌కు అవకాశాలు ఇస్తున్నారు.. అదనపు బ్యాటర్‌ కావాలని విదేశాల్లో పెద్దగా అనుభవం లేని దీపక్‌ హుడాను ఆడించారు.. ఫినిషర్‌ పాత్ర పోషించడంలో తడబడుతున్నప్పటికీ దినేశ్‌ కార్తీక్‌ను కొనసాగిస్తున్నారు.. మరి పంత్‌ ఏం పాపం చేశాడు? అతణ్ని ఎందుకు జట్టులోకి తీసుకోవడం లేదు?.. ఇవీ దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో టీమ్‌ఇండియా తుది జట్టు ఎంపిక గురించి వినిపిస్తున్న ప్రశ్నలు. అవును.. పంత్‌ను ఎందుకు ఆడించడం లేదు? టీ20 ప్రపంచకప్‌కు ముందు ప్రాక్టీస్‌, వార్మప్‌ మ్యాచ్‌లో రాణించిన రాహుల్‌ అసలైన పోరులో మాత్రం విఫలమవుతున్నాడు. వరుసగా 4, 9, 9 పరుగులు మాత్రమే చేశాడు. అతను త్వరగా పెవిలియన్‌ చేరుతుండడంతో బ్యాటింగ్‌ ఆర్డర్‌పై ఒత్తిడి పడుతోంది. ఇక సఫారీతో మ్యాచ్‌లో ఎడమ చేతి వాటం బ్యాటర్లు ఎక్కువగా ఉన్నారనే కారణంతో అక్షర్‌ను తప్పించి దీపక్‌ హుడాను ఆడించారు. అతనితో స్పిన్‌ వేయించారా? అంటే అదీ లేదు. మరి కేవలం అదనపు బ్యాటర్‌గానే ఆడించినప్పుడు.. ఆ స్థానంలో పంత్‌ను తీసుకోవచ్చు కదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు దినేశ్‌ కార్తీక్‌ కూడా అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం లేదు. అలాంటప్పుడు ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ పిచ్‌లపై సత్తాచాటిన పంత్‌ను ఆడించకపోవడం వెనక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. ఆ దేశాల్లో పరిస్థితులపై మంచి అవగాహన ఉన్న పంత్‌ అక్కడ శతకాలూ సాధించాడు. పైగా ఎడమచేతి వాటం కావడంతో కూర్పులోనూ వైవిధ్యం ఉంటుంది. ఈ మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కని పంత్‌.. దినేశ్‌ కార్తీక్‌ గాయపడడంతో ఇన్నింగ్స్‌ మధ్యలో వచ్చి కీపింగ్‌ చేశాడు. కార్తీక్‌ తర్వాతి మ్యాచ్‌లో ఆడడం సందేహమే కాబట్టి పంత్‌కు అవకాశం దక్కొచ్చు.


అతడే సూర్య

పేస్‌, బౌన్సీ పిచ్‌పై చెలరేగుతున్న ప్రత్యర్థి పేసర్లంటే అతనికి భయం లేదు.. ప్రతికూల పరిస్థితులంటే బెదురు లేదు.. నోట్లో చూయింగ్‌ గమ్‌ నములుతూ బౌండరీలు బాదడమే అతనికి తెలుసు. బౌలర్‌ ఎవరైతే ఏంటి? ఎంత వేగంతో బౌలింగ్‌ చేస్తే ఏంటి? అవన్నీ తనకేం పట్టనట్లుగా.. బంతిని బౌండరీలు దాటించడమే పనిగా అతను సాగుతున్నాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో 49/5తో చీకట్లో కూరుకుపోయిన జట్టుకు.. అద్భుత బ్యాటింగ్‌తో వెలుగులు పంచిన అతడే సూర్యకుమార్‌. సూపర్‌ఫామ్‌లో ఉన్న అతను మరోసారి 360 డిగ్రీల బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. బ్యాటింగ్‌కు పిచ్‌ కఠినంగా ఉంది.. పేసర్లు ఎంగిడి, రబాడ, నోకియా, పార్నెల్‌ చెలరేగుతున్నారు. అయినా సూర్య ఆగలేదు. బాదుడు తగ్గలేదు. మొదటి నుంచి ఎదురు దాడే తన ఆటతీరు. 143 కిలోమీటర్ల వేగంతో నోకియా వేసిన బంతిని ఫ్లిక్‌తో డీప్‌ బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌లో సిక్సర్‌గా మలిచిన తీరు అమోఘం. అదొక్కటేనా.. అప్పటికే నాలుగు వికెట్లు పడగొట్టిన ఎంగిడి బౌలింగ్‌లో ఆఫ్‌సైడ్‌ జరిగి ఫైన్‌లెగ్‌ దిశగా బంతిని స్టాండ్స్‌లో పడేసిన అతని షాట్‌ సూపర్‌ అంతే. ఫ్లాట్‌ పిచ్‌లపై ఎవరైనా పరుగులు చేస్తారు. కానీ ఇలాంటి పేస్‌ పిచ్‌పై అత్యుత్తమ ప్రదర్శన చేసినోడే అసలైన బ్యాటర్‌. ఈ పిచ్‌పై మొనగాడినని సూర్య అనిపించుకున్నాడు. 19వ ఓవర్లో సూర్య ఔట్‌ కాకుండా, చివరిదాకా ఉండి ఇంకో రెండు మూడు షాట్లు ఆడి ఉంటే ఈ మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేదేమో!


టీ20 ప్రపంచకప్‌లో ఈనాడు

ఆస్ట్రేలియా × ఐర్లాండ్‌

వేదిక: బ్రిస్బేన్‌, మ।। 1.30


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని