లంకను దాటి సెమీస్‌కు

ఇంగ్లాండ్‌ సెమీస్‌కు.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా ఇంటికి. ఉత్కంఠ రేపిన గ్రూప్‌-1లో రెండో స్థానంతో బట్లర్‌ సేన ముందంజ వేసింది.

Published : 06 Nov 2022 02:40 IST

ఇంగ్లాండ్‌ ముందుకు.. ఆసీస్‌ ఇంటికి

ఇంగ్లాండ్‌ సెమీస్‌కు.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా ఇంటికి. ఉత్కంఠ రేపిన గ్రూప్‌-1లో రెండో స్థానంతో బట్లర్‌ సేన ముందంజ వేసింది. శ్రీలంకపై గెలిస్తే నాకౌట్‌ చేరే స్థితిలో ఆ జట్టు.. ఎలాంటి నాటకీయతకు తావులేకుండా పని పూర్తి చేసింది. కానీ ఆ విజయం అంత సులభంగా రాలేదు. చివర్లో ఉత్కంఠ తప్పలేదు. ఒత్తిడిలో స్టోక్స్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. పోరాడామన్న సంతృప్తితో లంక టోర్నీని వీడింది.

టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ సెమీస్‌లో అడుగుపెట్టింది. శనివారం కీలకమైన గ్రూప్‌-1 చివరి పోరులో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలిచింది. మొదట లంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 141 పరుగులు చేసింది. ఓపెనర్‌ నిశాంక (67; 45 బంతుల్లో 2×4, 5×6) సత్తాచాటాడు. ప్రత్యర్థి బౌలర్లలో మార్క్‌వుడ్‌ (3/26) ఆకట్టుకున్నాడు. కీలకమైన నిశాంక వికెట్‌ తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్‌ చేసిన స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ (1/16) ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. ఛేదనలో ఇంగ్లాండ్‌ 6 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. అలెక్స్‌ హేల్స్‌ (47; 30 బంతుల్లో 7×4, 1×6), బెన్‌ స్టోక్స్‌ (42 నాటౌట్‌; 36 బంతుల్లో 2×4) రాణించారు. లంక బౌలర్లలో హసరంగ (2/23), ధనంజయ (2/24), లాహిరు కుమార (2/24) మెరిశారు. గ్రూప్‌-1లో న్యూజిలాండ్‌ (నెట్‌ రన్‌రేట్‌ 2.113), ఇంగ్లాండ్‌ (0.473), ఆస్ట్రేలియా (-0.173) తలో ఏడు పాయింట్లతో నిలిచాయి. కానీ మెరుగైన రన్‌రేట్‌ ఆధారంగా కివీస్‌, ఇంగ్లాండ్‌ ముందంజ వేశాయి.  

ధనాధన్‌ ఆరంభం..: ఛేదనలో ఇంగ్లాండ్‌కు లభించిన ఆరంభం చూశాక మ్యాచ్‌ చివరి ఓవర్‌ వరకూ వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ధనాధన్‌ బ్యాటింగ్‌తో బట్లర్‌ (28), హేల్స్‌ తొలి వికెట్‌కు 7.1 ఓవర్లలోనే 75 పరుగులు జోడించారు. ఆ తర్వాతి బంతి నుంచే మ్యాచ్‌లో లంక పోటీలోకి వచ్చింది. తన వరుస ఓవర్లలో ఓపెనర్లను హసరంగ ఔట్‌ చేశాడు. ధనంజయ, లాహిరు పరుగులు కట్టడి చేయడంతో పాటు వికెట్లూ పడగొట్టారు. ఇంగ్లాండ్‌ 65 బంతుల వ్యవధిలో 54 పరుగులే చేసి 6 వికెట్లు కోల్పోయింది. ఇంటికి వెళ్లేముందు లంక.. ఇంగ్లాండ్‌కు షాకిచ్చి ఆసీస్‌కు సాయం చేస్తుందా అనిపించింది. కానీ స్టోక్స్‌ జట్టును గట్టెక్కించాడు. తీవ్ర ఒత్తిడిలోనూ గొప్పగా బ్యాటింగ్‌ చేసి లక్ష్యాన్ని కరిగిస్తూ వచ్చాడు. కానీ చివరి వరకూ పోరాడిన లంక 17, 18 ఓవర్లు కలిపి 8 పరుగులే ఇవ్వడంతో సమీకరణం 12 బంతుల్లో 13గా మారింది. రజిత వేసిన 19వ ఓవర్లో ప్రశాంతంగా బ్యాటింగ్‌ చేసిన స్టోక్స్‌.. ఖాళీల్లోకి బంతిని పంపించి వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తడంతో మొత్తం 8 పరుగులు వచ్చాయి. చివరి 3 బంతుల్లో రెండు పరుగులు అవసరమైన దశలో నాలుగో బంతికి ఫోర్‌ కొట్టిన వోక్స్‌ (5 నాటౌట్‌) మ్యాచ్‌ ముగించాడు.

నిశాంక ఒక్కడే..: అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక కూడా మంచి ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. నిశాంక ధాటికి ఏడు ఓవర్లకు లంక 65/1తో పటిష్ట స్థితిలో నిలిచింది. కానీ తర్వాత ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. స్కోరు వేగం కూడా పడిపోయింది. రషీద్‌ పరుగులు కట్టడి చేయడమే కాక.. తన చివరి ఓవర్లో నిశాంకను ఔట్‌ చేసి ప్రత్యర్థిని గట్టి దెబ్బతీశాడు. లంక.. అనుకున్న దానికంటే ఓ 30 పరుగులు తక్కువే చేసింది. చివరి 5 ఓవర్లలో ఆ జట్టు 25 పరుగులే సాధించింది.



శ్రీలంక ఇన్నింగ్స్‌: నిశాంక (సి) జోర్డాన్‌ (బి) రషీద్‌ 67; కుశాల్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) వోక్స్‌ 18; ధనంజయ (సి) స్టోక్స్‌ (బి) కరన్‌ 9; అసలంక (సి) మలన్‌ (బి) స్టోక్స్‌ 8; భానుక (సి) కరన్‌ (బి) మార్క్‌వుడ్‌ 22; షనక (సి) బట్లర్‌ (బి) మార్క్‌వుడ్‌ 3; హసరంగ రనౌట్‌ 9; చామిక (సి) హేల్స్‌ (బి) మార్క్‌వుడ్‌ 0; తీక్షణ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 141; వికెట్ల పతనం: 1-39, 2-72, 3-84, 4-118, 5-127, 6-140, 7-141, 8-141; బౌలింగ్‌: స్టోక్స్‌ 3-0-24-1; వోక్స్‌ 3-0-24-1; మార్క్‌వుడ్‌ 3-0-26-3; సామ్‌ కరన్‌ 4-0-27-1; అడిల్‌ రషీద్‌ 4-0-16-1; లివింగ్‌స్టోన్‌ 2-0-16-0; మొయిన్‌ అలీ 1-0-5-0

ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌: బట్లర్‌ (సి) కరుణరత్నె (బి) హసరంగ 28; హేల్స్‌ (సి) అండ్‌ (బి) హసరంగ 47; స్టోక్స్‌ నాటౌట్‌ 42; బ్రూక్‌ (సి) అండ్‌ (బి) ధనంజయ 4; లివింగ్‌స్టోన్‌ (సి) ధనంజయ (బి) లహిరు 4; మొయిన్‌ అలీ (సి) షనక (బి) ధనంజయ 1; కరన్‌ (సి) రజిత (బి) లహిరు 6; వోక్స్‌ నాటౌట్‌ 5; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (19.4 ఓవర్లలో 6 వికెట్లకు) 144; వికెట్ల పతనం: 1-75, 2-82, 3-93, 4-106, 5-111, 6-129; బౌలింగ్‌: తీక్షణ 4-0-22-0; కాసున్‌ రజిత 3-0-40-0; లహిరు కుమార 3.4-0-24-2; హసరంగ 4-0-23-2; ధనంజయ 4-0-24-2; చరిత్‌ అసలంక 1-0-8-0


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని