Sunil Gavaskar: అహో సూర్య.. క్రికెట్‌ పుస్తకంలోని అన్ని షాట్లూ అతడి వద్ద ఉన్నాయి: గావస్కర్‌

సూర్యకుమార్‌ యాదవ్‌ సరికొత్త మిస్టర్‌ 360 ఆటగాడిగా అవతరించాడని దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ కితాబిచ్చాడు. సూర్య విఫలమైతే మంచి స్కోరు రాబట్టడానికి భారత్‌ కష్టపడుతుందని తెలిపాడు.

Updated : 08 Nov 2022 08:00 IST

దిల్లీ: సూర్యకుమార్‌ యాదవ్‌ సరికొత్త మిస్టర్‌ 360 ఆటగాడిగా అవతరించాడని దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ కితాబిచ్చాడు. సూర్య విఫలమైతే మంచి స్కోరు రాబట్టడానికి భారత్‌ కష్టపడుతుందని తెలిపాడు. జింబాబ్వేపై సూర్య 25 బంతుల్లోనే 61 పరుగులతో అజేయంగా నిలిచిన సంగతి తెలిసిందే. ‘‘సూర్య ప్రతి ఇన్నింగ్సూ చూడచక్కని 360 డిగ్రీ ఇన్నింగ్సే. అతనో కొత్త మిస్టర్‌ 360. వికెట్‌ కీపర్‌ ఎడమవైపుగా సూర్య బాదిన సిక్సర్‌ అద్భుతం. చివరి ఓవర్లలో మరింత స్క్వేర్‌గా ఆడాడు. బౌలర్ల లైన్‌ను సద్వినియోగం చేసుకున్నాడు. ఎక్స్‌ట్రా కవర్‌ మీదుగా లాఫ్టెడ్‌ డ్రైవ్‌, స్ట్రెయిట్‌ డ్రైవ్‌ కూడా. క్రికెట్‌ పుస్తకంలోని అన్ని షాట్లు అతని దగ్గర ఉన్నాయి. టీమ్‌ఇండియాకు అతను కాపాడుకోదగ్గ లక్ష్యాన్ని అందించగల ఆటగాడిగా మారుతున్నాడు. ఆదివారం నాటి స్కోరు మెల్‌బోర్న్‌లో టీమ్‌ఇండియాకు టీ20ల్లో అత్యుత్తమం. సూర్య ఇన్నింగ్స్‌ (61 నాటౌట్‌) లేకపోయుంటే భారత్‌ 150 పరుగుల స్కోరుకు చేరుకునేది కాదు. ప్రస్తుతం విరాట్‌ కోహ్లి, సూర్య అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నారు. కేఎల్‌ రాహుల్‌ మరో అర్ధ సెంచరీ సాధించడం శుభపరిణామం. అయితే అతను ఇంకా మెరుగ్గా ఆడాలి. సూర్య సత్తాచాటకపోతే 140-150 స్కోరు కోసం టీమ్‌ఇండియా కష్టపడుతుంది. కాబట్టి రాహుల్‌ ఫామ్‌ కొనసాగించడం కీలకం. తర్వాతి రెండు మ్యాచ్‌ల కోసం రోహిత్‌శర్మ తన పరుగుల్ని ఆదా చేశాడని ఆశిద్దాం. ఇప్పుడున్నవి పెద్ద మ్యాచ్‌లు. నాకౌట్‌లో ఎక్కువ ప్రయోగాలు చేయలేం. ప్రతి ఒక్కరు అత్యుత్తమంగా ఆడాలి’’ అని గావస్కర్‌ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు