IPL: మనోళ్లు బయట లీగుల్లో ఆడరు: ఐపీఎల్ ఛైర్మన్‌ అరుణ్‌ ధూమల్‌

ప్రపంచ క్రికెట్లో ఐపీఎల్‌ అతి పెద్ద లీగ్‌గా అవతరించనుందని ఐపీఎల్‌ ఛైర్మన్‌ అరుణ్‌ ధూమల్‌ అన్నాడు. ఎప్పటిలానే భారత క్రికెటర్లకు బయట లీగ్‌లలో ఆడేందుకు అనుమతి ఇవ్వమని చెప్పాడు ‘‘ఐపీఎల్‌ను ఇప్పుడు ఉన్నదాని కంటే ఆకర్షణీయంగా మారుస్తాం.

Updated : 09 Nov 2022 07:59 IST

దిల్లీ: ప్రపంచ క్రికెట్లో ఐపీఎల్‌ అతి పెద్ద లీగ్‌గా అవతరించనుందని ఐపీఎల్‌ ఛైర్మన్‌ అరుణ్‌ ధూమల్‌ అన్నాడు. ఎప్పటిలానే భారత క్రికెటర్లకు బయట లీగ్‌లలో ఆడేందుకు అనుమతి ఇవ్వమని చెప్పాడు ‘‘ఐపీఎల్‌ను ఇప్పుడు ఉన్నదాని కంటే ఆకర్షణీయంగా మారుస్తాం. త్వరలోనే ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్‌గా అవతరిస్తుంది. అభిమానులకు మరింత చేరువ కావడానికి ఈ టోర్నీని వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. మైదానంలో నేరుగా చూసినా.. టీవీలో తిలకించినా అందరికి నాణ్యమైన అనుభవం ఇవ్వాలన్నది మా ప్రయత్నం.

ఐపీఎల్‌ షెడ్యూల్‌ను ముందుగానే ఇచ్చేస్తే అభిమానులు కూడా ఈ మ్యాచ్‌లకు తగ్గట్టుగా సిద్ధమవుతారు. ఐపీఎల్‌లో జట్ల సంఖ్యను 10కి మించి పెంచే ఉద్దేశం లేదు. పెంచితే టోర్నీ నిర్వాహణ కష్టం అవుతుంది. తొలి రెండు సీజన్లలో 74 మ్యాచ్‌లు అయ్యాయి. ఆ తర్వాత 84 మ్యాచ్‌లు.. ఇప్పుడు 94 మ్యాచ్‌లను నిర్వహిస్తున్నాం. దీని వల్ల టోర్నీ సుదీర్ఘంగా సాగుతోంది. ఫుట్‌బాల్‌ లీగ్‌లతో మేం పోల్చుకోం. ఎందుకంటే క్రికెట్‌కు ఉండే అవసరాలు చాలా భిన్నం’’ అని ధూమల్‌ చెప్పాడు.

ఎప్పటిలాగే భారత ఆటగాళ్లు బయట లీగ్‌లు ఆడరని అతడు స్పష్టం చేశాడు. ‘‘ఆటగాళ్ల ఫిట్‌నెస్‌, ఊపిరి సలపని అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకుని బయట లీగ్‌లు ఆడించకూడదని మొదటి నుంచి బీసీసీఐ భావించింది. మున్ముందు కూడా ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. మహిళల ఐపీఎల్‌ టోర్నీని పురుషుల ఐపీఎల్‌కు తీసిపోని విధంగా నిర్వహిస్తాం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎందరో మహిళా అభిమానులు ఈ లీగ్‌ను ప్రత్యేకంగా తిలకిస్తారు. దీని నుంచి స్ఫూర్తి పొంది క్రికెట్‌లోకి వస్తారు. పురుషులతో సమానంగా మహిళలకు మ్యాచ్‌లు ఫీజులు పెంచడం వెనుక ఉద్దేశం కూడా ఇదే’’ అని ధూమల్‌ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని