T20 World Cup 2022: ఇంగ్లాండ్‌కు ఇచ్చేశారు

అవును..  ఘనత వహించిన టీమ్‌ ఇండియాకు, ప్రపంచ క్రికెట్‌ పెద్దన్నకు, సూపర్‌స్టార్ల భారత్‌కు ఆఖరికి దక్కింది సున్నానే!

Updated : 11 Nov 2022 04:37 IST

సెమీస్‌లో భారత్‌ దాసోహం
బౌలర్ల ఘోర వైఫల్యం
చివరికి పేద్ద సున్నా!

అవును..  ఘనత వహించిన టీమ్‌ ఇండియాకు, ప్రపంచ క్రికెట్‌ పెద్దన్నకు, సూపర్‌స్టార్ల భారత్‌కు ఆఖరికి దక్కింది సున్నానే!
సెమీఫైనల్లో మనోళ్లు తీసిన వికెట్లు..అక్షరాలా.. సున్నా!
గెలుపు సంగతి అటుంచితే... కనీస పోటీ ఇవ్వడమే చేత కాలేదు. ప్రదర్శన దిగ్భ్రాంతికరం. కష్టపడి ఓ 168 చేస్తే ఇంగ్లాండ్‌ కనీస కనికరమైనా చూపలేదు. మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే, ఒక్క వికెట్టూ పోకుండా ఛేదంచేసి దిమ్మిదిరిగే షాకిచ్చింది. కనీస పోరాటం కొరవడిన రోహిత్‌సేన అవమానభారంతో టీ20 ప్రపంచకప్‌   నుంచి నిష్క్రమించింది.

అసలు ప్రపంచకప్‌ జట్టులో ఎంపికలోనే లోపాలున్నా, ఆటగాళ్ల అస్థిరత, ఫామ్‌లేమి వెంటాడుతున్నా.. కొన్ని వ్యక్తిగత ప్రదర్శనలతో నెగ్గుకొచ్చి, ఎలాగో సెమీస్‌ చేరిన టీమ్‌ఇండియా అసలు సమరంలో బొక్కబోర్లా పడింది. బంతితో ప్రదర్శన అత్యంత దారుణం. భారత్‌ పరిమితులను, బలహీనతలను బహిర్గతం చేస్తూ ఇంగ్లాండ్‌ చితక్కొట్టేసింది.

పరుగుల కోసం రోహిత్‌సేన తడబడ్డ అదే పిచ్‌పై.. మన బౌలర్లను ఇంగ్లాండ్‌ బంతాడుకుంది. పస లోపించిన బౌలింగ్‌తో వాళ్లకు కనీసం చీమ కుట్టినట్లయినా అనిపించలేదంటే అతిశయోక్తి కాదు. భారత బౌలర్లను క్లబ్‌ స్థాయి బౌలర్లలాగైనా పరిగణించకుండా నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడింది. అనుభవజ్ఞుడైన భువి సహా అంతా తేలిపోయారు. వికెట్లు తీయడం పక్కనపెడితే.. కనీసం ఒక్కరంటే ఒక్కరు వికెట్‌ పడగొట్టేట్లు కనిపిస్తే ఒట్టు. మొదటిసారి అంతర్జాతీయ మ్యాచ్‌లో బౌలింగ్‌ చేస్తున్నట్లు కట్టకట్టుకుని హేల్స్‌, బట్లర్‌ విధ్వంసానికి దాసోహమన్నారు.

అభిమానులను నిరాశపరచడంలో మన బ్యాటర్లేమీ తక్కువ కాదు. స్కోరుబోర్డుపై ఓ మాదిరి స్కోరు కనిపించిందంటే అది హార్దిక్‌ ఆడిన ఓ మెరుపు ఇన్నింగ్స్‌ ఫలితమే. కానీ అది బ్యాటింగ్‌ వైఫల్యాన్ని కప్పి పుచ్చలేదు. తొలి పది ఓవర్లలో చేసింది కేవలం 62 పరుగులు. ఆఖర్లో హార్దిక్‌ లాక్కొచ్చినా.. ఆ పేలవ ఆరంభం చేసిన నష్టం అంతా ఇంతా కాదు. ఇంగ్లాండ్‌ పవర్‌ హిట్టర్ల నిలయం మరి. చివరికి ఆ పవర్‌ హిట్టింగే టీమ్‌ఇండియాను టోర్నీ నుంచి బయటికి పంపింది. ఆశలన్నీ అడియాసలైన వేళ.. ఇక మిగిలింది ప్రక్షాళనే..!

టీ20 ప్రపంచకప్‌ నుంచి టీమ్‌ఇండియా ఔట్‌. గురువారం సెమీఫైనల్లో రోహిత్‌సేన 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ చేతిలో ఘోరపరాజయంపాలైంది. హార్దిక్‌ పాండ్య (63; 33 బంతుల్లో 4×4, 5×6) చెలరేగడంతో మొదట భారత్‌ 6 వికెట్లకు 168 పరుగులు సాధించింది. కోహ్లి (50; 40 బంతుల్లో 4×4, 1×6) అర్ధశతకం సాధించాడు. ఓపెనర్లు హేల్స్‌ (86 నాటౌట్‌; 47 బంతుల్లో 4×4, 7×6), బట్లర్‌ (80 నాటౌట్‌; 49 బంతుల్లో 9×4, 3×6)ల విధ్వంసంతో లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ 16 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా ఛేదించింది. భువనేశ్వర్‌, అశ్విన్‌, షమి, హార్దిక్‌.. ఇలా బౌలర్లంతా తేలిపోయారు. హేల్స్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

10 ఓవర్లలో 62: తొలి పది ఓవర్లలో జాగ్రత్తగా ఆడడం, చివరి పది ఓవర్లలో చెలరేగడం! టోర్నీ ఆరంభం నుంచి టీమ్‌ఇండియా చేస్తున్నదిదే. కీలకమైన సెమీస్‌లోనూ అదే పునరావృతం చేసింది. కానీ పవర్‌ హిట్టర్లున్న ఇంగ్లాండ్‌పై ఆ ప్రదర్శన సరిపోలేదు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభమే పేలవం. మొదట సురక్షితంగా ఉండాలన్న భావన ఆ జట్టును గట్టి దెబ్బే తీసింది. పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 38/1 మాత్రమే. బంగ్లాదేశ్‌, జింబాబ్వే లాంటి చిన్న జట్లపై అర్ధశతకాలతో కాస్త ఫామ్‌ను అందుకున్నట్లు కనిపించిన ఓపెనర్‌ రాహుల్‌ కీలక మ్యాచ్‌లో మళ్లీ మొదటికొచ్చాడు. పెద్ద జట్లపై పరుగులు సాధించడంలో అతడి వైపల్యం మరింత ప్రస్ఫుటమైంది. రెండో ఓవర్లో వోక్స్‌ ఎక్స్‌ట్రా బౌన్స్‌తో అతణ్ని బోల్తా కొట్టించాడు. కానీ భారత్‌ 20 పరుగులు తక్కువ చేసిందనుకుంటే అందుకు కారకుల్లో రోహిత్‌ ఒకడు. కొన్ని షాట్లు ఆడినప్పటికీ అతడు తడబడ్డాడు. సాధికారిత లోపించిన అతడు ధాటిగా బ్యాటింగ్‌ చేయలేకపోయాడు. టచ్‌లో కనిపించినా కోహ్లి కూడా దూకుడు ప్రదర్శించలేదు. పేసర్లే కాకుండా స్పిన్నర్‌ రషీద్‌ కూడా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. చివరికి జోర్డాన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో రోహిత్‌ ఔటయ్యాడు. పది ఓవర్లు ముగిసే సరికి స్కోరు 62 (2 వికెట్లకు) పరుగులే. అప్పటికి కోహ్లి 23 బంతుల్లో 26 పరుగులే చేశాడు.

మరి అంత స్కోరెలా..: పది ఓవర్లలో కేవలం ఏడు బౌండరీలతో 62 పరుగులే చేసినా భారత్‌ 168 స్కోరుతో ఇన్నింగ్స్‌ను ముగించిందంటే కారణం హార్దిక్‌ పాండ్య విధ్వంసమే. భారత్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్న సూర్యకుమార్‌ యాదవ్‌ (14) తనదైన శైలిలో వరుసగా సిక్స్‌, ఫోర్‌ దంచాడు. కానీ రషీద్‌ అతణ్ని త్వరగానే వెనక్కి పంపి భారత్‌కు షాకిచ్చాడు. అప్పుడొచ్చాడు హార్దిక్‌. అతడూ ఆరంభంలో నెమ్మదిగానే ఆడాడు. కోహ్లి రెండు ఫోర్లు కొట్టినా 15 ఓవర్లకు స్కోరు 100/3 మాత్రమే. కానీ మరోవైపు కోహ్లి అండగా నిలవగా.. హార్దిక్‌ గేర్‌ మార్చి రెచ్చిపోవడంతో ఆఖరి అయిదు ఓవర్లలో భారత్‌ ఏకంగా 68 పరుగులు రాబట్టింది. ముఖ్యంగా జోర్డాన్‌, కరన్‌లను హార్దిక్‌ ఓ ఆటాడుకున్నాడు. వాళ్ల బౌలింగ్‌లో సిక్స్‌ల మోత మోగించాడు. కరన్‌ వేసిన 17వ ఓవర్లో సిక్స్‌ దంచిన అతడు ఆ తర్వాత మరింత విరుచుకుపడ్డాడు. 6, 6, 0, 1, 1, 4, 6, 4, 1, 6, 4.. 18వ ఓవర్‌ నుంచి ఇన్నింగ్స్‌ ఆఖరి బంతికి ఔటయ్యే వరకు హార్దిక్‌ జోరిది. ఫలితంగా టీమ్‌ఇండియా ఊహించని స్కోరును అందుకుంది.

బౌలర్లు తేలిపోయారు..: ఇంగ్లాండ్‌ ఛేదనలో భారత బౌలర్లు తేలిపోయారు. ఓపెనర్లపై ఏమాత్రం ప్రభావం చూపలేపోయారు. భారత టాప్‌ ఆర్డర్‌కు పూర్తి విరుద్ధంగా ఇంగ్లాండ్‌ టాప్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌ సాగింది. మన వాళ్లు అవస్థపడ్డ అదే పిచ్‌పై బట్లర్‌, హేల్స్‌ చెలరేగిపోయారు. భువి (0/25), అర్ష్‌దీప్‌ (0/15) తగినంత స్వింగ్‌ రాబట్టలేకపోయారు. ప్రభావం చూపలేకపోతున్నా స్పిన్నర్లు అశ్విన్‌ (0/27), అక్షర్‌ (0/30)లపై మేనేజ్‌మెంట్‌ పెట్టుకున్న అతి విశ్వాసం జట్టును దెబ్బతీసింది. ఇంగ్లాండ్‌ స్నిన్నర్‌ రషీద్‌ విజయవంతమైన చోటే వాళ్లు విఫలమయ్యారు. షమి (0/39) కూడా చేతులెత్తేశాడు. భువి వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లోనే మూడు ఫోర్లతో బట్లర్‌ ఇంగ్లాండ్‌ జోరుకు పునాది వేశాడు. హేల్స్‌ విరుచుకుపడడంతో భువితోపాటు అక్షర్‌, షమి కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. హేల్స్‌ మూడు సిక్స్‌లు దంచడంతో ఇంగ్లాండ్‌ 6 ఓవర్లలో స్కోరు 63/0తో నిలిచింది. సరిగ్గా ఇదే సమయానికి భారత్‌ స్కోరు 38/1. బహుశా మ్యాచ్‌ ఫలితం నిర్ణయమైంది ఇక్కడేనేమో! హేల్స్‌, బట్లర్‌ జోరుతో పవర్‌ప్లే తర్వాత స్కోరు వేగం తగ్గలేదు. అశ్విన్‌నూ వదలని హేల్స్‌ 28 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా అతడు ఎడాపెడా దంచేయడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. హార్దిక్‌ (0/34) కూడా ప్రభావం చూపలేకపోయాడు. అతడి బౌలింగ్‌లోనే సిక్స్‌తో బట్లర్‌ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 13 ఓవర్లకు స్కోరు 140/0. ఆ తర్వాత లక్ష్యాన్ని అందుకోవడానికి ఇంగ్లాండ్‌కు ఎంతో సమయం పట్టలేదు. ఆ జట్టు విజయం కేవలం లాంఛనమే.  


2

ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌ ప్రపంచకప్‌ ఫైనల్లో తలపడనుండటం ఇది రెండోసారి. 1992 వన్డే ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు ఢీకొన్నాయి.


అనుకోకుండా వచ్చి..

అలెక్స్‌ హేల్స్‌.. భారత్‌పై మెరుపుదాడి చేసిన ఈ ఓపెనర్‌ ఇంగ్లాండ్‌ టీ20 ప్రపంచకప్‌ ప్రణాళికల్లోనే లేడు. 2019లో డోప్‌ పరీక్షలో విఫలమై ఆ ఏడాది వన్డే ప్రపంచకప్‌కు ఎంపిక కాలేకపోయిన అతడు మూడేళ్ల పాటు జట్టుకు దూరమయ్యాడు. గత టీ20 ప్రపంచకప్‌లోనూ ఈ ఓపెనర్‌కి చోటు దక్కలేదు. ఈసారి హేల్స్‌కు అదృష్టం కలిసొచ్చింది. కీలక ఆటగాడు బెయిర్‌స్టో టోర్నీ ముందు అనూహ్యంగా గాయపడడంతో ఫామ్‌లో ఉన్న హేల్స్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇంగ్లాండ్‌ జట్టుకు దూరమైన సమయంలో టీ20 లీగ్‌లు ఆడటమే అతడు పనిగా పెట్టుకున్నాడు. ఈ ప్రపంచకప్‌ ముంగిట పాకిస్థాన్‌తో ఏడు టీ20ల సిరీస్‌లో 6 మ్యాచ్‌ల్లో 130 పరుగులు చేసిన హేల్స్‌.. పొట్టికప్‌లో ఇప్పటిదాకా 148.59 స్ట్రైక్‌రేట్‌తో 211 పరుగులు సాధించాడు.


భారత్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) బట్లర్‌ (బి) వోక్స్‌ 5; రోహిత్‌ (సి) కరన్‌ (బి) జోర్డాన్‌ 27; కోహ్లి (సి) రషీద్‌ (బి) జోర్డాన్‌ 50; సూర్యకుమార్‌ (సి) సాల్ట్‌ (బి) రషీద్‌ 14; హార్దిక్‌ పాండ్య హిట్‌వికెట్‌ (బి) జోర్డాన్‌ 63; పంత్‌ రనౌట్‌ 6; అశ్విన్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 3 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 168; వికెట్ల పతనం: 1-9, 2-56, 3-75, 4-136, 5-158, 6-168; బౌలింగ్‌: స్టోక్స్‌ 2-0-18-0; వోక్స్‌ 3-0-24-1; సామ్‌ కరన్‌ 4-0-42-0; రషీద్‌ 4-0-20-1; లివింగ్‌స్టోన్‌ 3-0-21-0; జోర్డాన్‌ 4-0-43-3

ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌: బట్లర్‌ నాటౌట్‌ 80; హేల్స్‌ నాటౌట్‌ 86; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (16 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 170 బౌలింగ్‌: భువనేశ్వర్‌ 2-0-25-0; అర్ష్‌దీప్‌ 2-0-15-0; అక్షర్‌ 4-0-30-0; షమి 3-0-39-0; అశ్విన్‌ 2-0-27-0; హార్దిక్‌ 3-0-34-0

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని