Rahul Dravid: వాళ్ల భవిష్యత్‌పై మాట్లాడేందుకు ఇది తగిన సమయం కాదు: ద్రవిడ్‌

టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌శర్మ, విరాట్‌ కోహ్లీల భవిష్యత్తు గురించి మాట్లాడేందుకు ఇది తగిన సమయం కాదని చీఫ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అభిప్రాయపడ్డాడు.

Updated : 11 Nov 2022 09:32 IST

అడిలైడ్‌: టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌శర్మ, విరాట్‌ కోహ్లీల భవిష్యత్తు గురించి మాట్లాడేందుకు ఇది తగిన సమయం కాదని చీఫ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘వాళ్ల భవిష్యత్తు గురించి మాట్లాడటం తొందరపాటే అవుతుంది. ఆ విషయం మాట్లాడేందుకు ఇది తగిన సమయం కాదు. రోహిత్‌, కోహ్లి, భువనేశ్వర్‌ బాగా ఆడారు’’ అని ద్రవిడ్‌ చెప్పాడు. బిగ్‌ బాష్‌ లీగ్‌లో ఆడటం ఇంగ్లాండ్‌ ఆటగాళ్లకు కలిసొచ్చింది. టీమ్‌ఇండియా క్రికెటర్లను ఈ లీగ్‌కు అనుమతి ఇవ్వాలా వద్దా అన్నది బీసీసీఐ ఇష్టమని అన్నాడు. ‘‘సరిగ్గా రంజీ సమయంలోనే బిగ్‌బాష్‌ లీగ్‌ జరుగుతుంది. అనుమతి లభిస్తే భారత ఆటగాళ్లంతా ఇక్కడికి వచ్చేస్తారు. దేశవాళీ క్రికెట్‌ నాశనం అవుతుంది. అప్పుడు టెస్టు క్రికెట్‌ మిగలదు. విదేశీ లీగ్‌లకు అనుమతి ఇస్తే టీమ్‌ఇండియా మరో వెస్టిండీస్‌లా మారుతుంది’’ అని ద్రవిడ్‌ చెప్పాడు.


విరాట్‌ @ 4000


కోహ్లి అంతర్జాతీయ టీ20ల్లో 4000 పరుగుల మైలురాయి చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌ అతడే. ప్రస్తుతం కోహ్లి ఖాతాలో 4008 పరుగులు ఉన్నాయి. రోహిత్‌శర్మ (3853), మార్టిన్‌ గప్తిల్‌ (3531, న్యూజిలాండ్‌), బాబర్‌ అజామ్‌ (3323, పాకిస్థాన్‌), పాల్‌ స్టిర్లింగ్‌ (3181, ఐర్లాండ్‌) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు.


ఒత్తిడిని ఎదుర్కోవడం నేర్పించలేం

‘‘మ్యాచ్‌ ఫలితం తీవ్ర నిరాశకు గురిచేసింది. సెమీఫైనల్లో కొంచెం ఒత్తిడికి గురయ్యాం. ఇంగ్లాండ్‌ ఓపెనర్లకు ఘనత ఇవ్వాల్సిందే. వాళ్లు బాగా ఆడారు. బ్యాటింగ్‌లో చివర్లో చక్కగా బ్యాటింగ్‌ చేసి ఆ స్కోరు సాధించాం. బంతితో స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాం. ఓ జట్టు 16 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించగల పిచ్‌ ఇది కచ్చితంగా కాదు. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో ప్రతి ఒక్కరికి నేర్పించలేం. టోర్నీలో మొదటి మ్యాచ్‌లో గెలిచినప్పుడు జట్టు దృక్పథం కనిపించింది. బంగ్లాదేశ్‌తో పోరు మలుపులతో ముగిసింది. ఒత్తిడిని అధిగమించి, వ్యూహాల్ని సమర్థంగా అమలు చేశామని అనుకున్నా. గురువారం ఆ పని చేయలేకపోయాం’’

- రోహిత్‌ శర్మ


ముసాయిదా రాజ్యాంగానికి ఐఓఏ ఆమోదం

దిల్లీ: సుప్రీంకోర్టు, అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) పర్యవేక్షణలో ముసాయిదా రాజ్యాంగానికి గురువారం భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) ఆమోదం తెలిపింది. డిసెంబరులోపు ఎన్నికలు జరగకపోతే ఐఓసీ నుంచి సస్పెన్షన్‌ ముప్పు పొంచి ఉండటం.. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఐఓఏకు తమ రాజ్యాంగంలో మార్పులు తీసుకురావడం మినహా మరో మార్గం లేకుండా పోయింది. డిసెంబరు 10న ఐఓఏకు ఎన్నికలకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. దీనిపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ‘‘సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం స్వల్ప మార్పులతో రాజ్యాంగాన్ని సవరించాం. శుక్రవారం విచారణ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు తీర్మానాన్ని సమర్పిస్తాం. ప్రభుత్వానికి కూడా అందజేస్తాం’’ అని ఐఓఏ సెక్రటరీ జనరల్‌ రాజీవ్‌ మెహతా తెలిపారు. అయితే సుప్రీంకోర్టు తప్పనిసరి అనడంతో తాము బలవంతంగా ఆమోదం తెలిపినట్లు కొందరు సభ్యులు ఆరోపించారు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని