Ben stokes: ఆ విలన్‌.. మళ్లీ హీరో

అది.. 2016 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌. 156 పరుగుల ఛేదనలో    19 ఓవర్లకు వెస్టిండీస్‌ స్కోరు 137/6. జట్టు విజయానికి చివరి ఓవర్లో    19 పరుగులు కావాలి. అంతకుముందు కీలక ఓవర్లలో మెరుగ్గా బౌలింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌కే విజయావకాశాలు! కానీ ఆఖరి ఓవర్లో వరుసగా నాలుగు బంతులకు నాలుగు సిక్సర్లు బాదిన బ్రాత్‌వైట్‌ జట్టును గెలిపించాడు.

Updated : 14 Nov 2022 09:09 IST

అది.. 2016 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌. 156 పరుగుల ఛేదనలో    19 ఓవర్లకు వెస్టిండీస్‌ స్కోరు 137/6. జట్టు విజయానికి చివరి ఓవర్లో    19 పరుగులు కావాలి. అంతకుముందు కీలక ఓవర్లలో మెరుగ్గా బౌలింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌కే విజయావకాశాలు! కానీ ఆఖరి ఓవర్లో వరుసగా నాలుగు బంతులకు నాలుగు సిక్సర్లు బాదిన బ్రాత్‌వైట్‌ జట్టును గెలిపించాడు. అప్పుడు బౌలింగ్‌ చేసిన స్టోక్స్‌ ఇంగ్లాండ్‌కు విలన్‌లా మారాడు. ప్రపంచకప్‌ చేజారడానికి కారణమైన అతని కెరీర్‌ ముందుకు సాగడం కష్టమేనన్న వ్యాఖ్యలు వినిపించాయి.

ఆ తర్వాత రెండేళ్లకు  ఓ నైట్‌క్లబ్‌ బయట గొడవ కారణంగా అతను ఆటకు దూరమయ్యేలా కనిపించాడు. మైదానంలో వైఫల్యం, బయట వివాదాలతో అప్రతిష్ఠ మూటగట్టుకున్నాడు. కానీ 2019 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో కివీస్‌పై 84 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో ఆ ఫార్మాట్లో ఇంగ్లాండ్‌ తొలిసారి విశ్వవిజేతగా నిలవడానికి కారణమవడంతో స్టోక్స్‌ హీరోగా మారాడు. ఇప్పుడు పాక్‌తో ఫైనల్లో అద్భుత పోరాటంతో జట్టును విజేతగా నిలిపాడు. కఠిన పరిస్థితుల్లో స్టోక్స్‌ పట్టుదలగా నిలబడి.. ఒక్కో పరుగు జోడిస్తూ.. కీలక సమయంలో బౌండరీలు రాబట్టి జట్టును గెలిపించిన తీరు అమోఘం. అంతకుముందు బౌలింగ్‌లోనూ అతను రాణించాడు. దేశానికి రెండు ప్రపంచకప్‌లు అందించిన హీరోగా స్టోక్స్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని