T20 world cup 2022: సరైన జట్టుకే..
ఓటమి నుంచే గెలుపు ప్రయాణం మొదలవుతుందని.. పరాభవమే గొప్ప పాఠాలు నేర్పుతుందనడానికి ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు సరైన నిదర్శనం. ఒక్క ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన.. ఆ జట్టు దృక్పథాన్నే మార్చింది. ఆడే విధానంలో.. ఆలోచనలో మార్పు తెచ్చింది. దూకుడు నేర్చిన జట్టు ప్రత్యర్థులపై కసిగా విరుచుకుపడడం ఆరంభించింది.
ఈనాడు క్రీడావిభాగం
ఓటమి నుంచే గెలుపు ప్రయాణం మొదలవుతుందని.. పరాభవమే గొప్ప పాఠాలు నేర్పుతుందనడానికి ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు సరైన నిదర్శనం. ఒక్క ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన.. ఆ జట్టు దృక్పథాన్నే మార్చింది. ఆడే విధానంలో.. ఆలోచనలో మార్పు తెచ్చింది. దూకుడు నేర్చిన జట్టు ప్రత్యర్థులపై కసిగా విరుచుకుపడడం ఆరంభించింది. భయం లేని ఆటతో.. బలమైన జట్టుతో అద్భుతాలు చేస్తోంది. మూడేళ్ల వ్యవధిలో రెండు ప్రపంచకప్‌లు గెలిచింది.
రసవత్తరంగా సాగిన టీ20 ప్రపంచకప్ చివరికి సరైన జట్టునే వరించింది. అన్ని అర్హతలున్న ఇంగ్లాండ్ సగర్వంగా రెండో సారి పొట్టి కప్పును ముద్దాడింది. ఈ విజయాలను అందుకునే దిశగా జట్టు బలంగా మారడం వెనక ఓ పరాభవం ఉంది. 2015 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలే సాధించింది. చివరకు బంగ్లాదేశ్‌తోనూ ఓడింది. దీంతో ఇంటా, బయట తీవ్ర విమర్శలు వచ్చాయి. అప్పుడే జట్టులో ప్రక్షాళన మొదలైంది. రక్షణాత్మక ఆటకు స్వస్తి పలికిన ఆ జట్టు దూకుడును అలవరుచుకుంది. నైపుణ్యాలున్న ఆటగాళ్లను సానబెట్టింది. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ పరిమిత ఓవర్ల జట్టుగా అవతరించింది. 2016 టీ20 ప్రపంచకప్‌లో ఆ ఫలితం కనిపించింది. ఫైనల్లో కొద్దిలో ఓడింది. అప్పటి నుంచి జట్టులో ఆటగాళ్లు మారినా, కోచ్‌లు మారినా, కెప్టెన్‌లు మారినా.. బెదురులేని జట్టు ఆటతీరు మాత్రం కొనసాగుతోంది. 2019 వన్డే ప్రపంచకప్‌కు ముందు ఆ జట్టునే టైటిల్ ఫేవరెట్‌గా పరిగణించారు. అంచనాలను నిలబెట్టుకుంటూ కప్పు కొట్టేసింది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లోనూ ఆ జట్టే విజేతగా నిలుస్తుందనే అభిప్రాయాలు బలంగా వినిపించాయి. కానీ సెమీస్‌లో వెనుదిరిగింది. ఈ సారి కూడా అంచనాలను నిజం చేస్తూ విజేతగా నిలిచింది.
అదే ప్రత్యేకత: ఏ జట్టులోనైనా ఒకరో లేదా ఇద్దరో ఆల్‌రౌండర్లు ఉంటారు. కానీ ఇంగ్లాండ్ జట్టులోని ఆటగాళ్లలో సింహ భాగం వీళ్లదే. ఫైనల్ ఆడిన జట్టును చూసుకుంటే స్టోక్స్, మొయిన్ అలీ, లివింగ్‌స్టోన్, సామ్ కరన్, క్రిస్ వోక్స్.. ఇలా అయిదుగురు ఆల్‌రౌండర్లు ఉన్నారు. 8, 9 స్థానాల వరకూ బ్యాటింగ్ చేయగల సామర్థ్యమున్న బ్యాటర్లున్నారు. అలాగే ఏడు బౌలింగ్ ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా కొన్ని జట్లలో ఓ స్టార్ ఆటగాడు విఫలమైతే ఆ ప్రభావం జట్టు మొత్తం మీద పడుతుంది. కానీ ఇంగ్లాండ్‌కు ఆ భయమే లేదు. ఒకరు కాకపోతే మరొకరు జట్టును గెలిపిస్తారు. ఓ బౌలర్ పరుగులు సమర్పించుకుంటే ప్రత్యామ్నాయంగా మరో బౌలర్ సిద్ధంగా ఉంటాడు. ఓ బ్యాటర్ విఫలమైతే ఆ లోటు పూడ్చేందుకు మరో బ్యాటర్ బాధ్యతలు తీసుకుంటాడు. వికెట్లు పడ్డా వీళ్లు నెమ్మదించరు. సూపర్-12లో ఇంగ్లాండ్ తడబడి ఉండొచ్చు. వర్షం కారణంగా ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఓడిపోయి ఉండొచ్చు. కానీ కీలకమైన సెమీస్, ఫైనల్లో జూలు విదిల్చింది. నాణ్యమైన జట్టు ఉంటే అత్యుత్తమ ఫలితాలు వస్తాయనేందుకు ఇదే నిదర్శనం. మిగతా జట్లు దీన్ని స్ఫూర్తిగా తీసుకుని బలోపేతమయ్యే దిశగా సాగాలనడంలో అతిశయోక్తి లేదు.
1992 కథ మారింది
గతం పునరావృతం కాలేదు. ఈ సారి కథ మారింది. 1992 వన్డే ప్రపంచకప్‌లో ఇప్పట్లాగే సెమీస్‌లో న్యూజిలాండ్‌పై గెలిచిన పాక్ తుది పోరు చేరింది. ఇంగ్లాండ్‌ను ఓడించి కప్పు ఎగరేసుకుపోయింది. మళ్లీ అదే తరహాలో, అప్పటి ఫైనల్ వేదిక మెల్‌బోర్న్‌లోనే ఇరు జట్లూ తలపడడంతో చరిత్ర పునరావృతం అవుతుందని పాక్ అభిమానులు ఆశించారు. కానీ ఈసారి ఇంగ్లాండ్ వదల్లేదు. గెలుపు కోసం పాక్ గట్టిగానే పోరాడినా ఓటమి తప్పలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Apple Devices: ఐఓఎస్ యూజర్లకు కేంద్రం సూచన.. అప్డేట్ విడుదల చేసిన యాపిల్
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
FootBall in Asian Games: ఇలాగైతే మమ్మల్ని ఎక్కడికీ పంపొద్దు: భారత ఫుట్‌బాల్ కోచ్ ఆవేదన
-
KTR: వరి మాత్రమే సరిపోదు.. ఆయిల్‌పామ్ పండించాలి: కేటీఆర్
-
Amazon Festival Sale: అమెజాన్ పండగ సేల్‌లో TVలపై ఆఫర్లివే..
-
Afghan embassy in India: భారత్‌లో అఫ్గాన్ ఎంబసీని మూసేస్తున్నారా? కేంద్రానికి మెసేజ్..!