IND Vs AUS: హైదరాబాద్‌లో ఆసీస్‌తో టెస్టు?

పొట్టి ప్రపంచకప్‌కు ముందు టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా టీ20కి ఆతిథ్యమిచ్చిన హైదరాబాద్‌.. మరోసారి ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్‌కు వేదికగా నిలిచే అవకాశముంది.

Published : 17 Nov 2022 09:27 IST

దిల్లీ: పొట్టి ప్రపంచకప్‌కు ముందు టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా టీ20కి ఆతిథ్యమిచ్చిన హైదరాబాద్‌.. మరోసారి ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్‌కు వేదికగా నిలిచే అవకాశముంది. ఈ సారి ఇక్కడ టెస్టు నిర్వహించే విషయంపై బీసీసీఐ యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి మధ్యలో బోర్డర్‌- గావస్కర్‌ సిరీస్‌ కోసం భారత్‌కు ఆసీస్‌ రానుంది. ఈ సిరీస్‌లో భాగంగా నాలుగు టెస్టులు జరుగుతాయి. అందులో ఓ మ్యాచ్‌కు దిల్లీ వేదికగా నిలవడం ఖాయమని సమాచారం. చివరగా అయిదేళ్ల క్రితం (2017 డిసెంబర్‌) ఇక్కడ శ్రీలంకతో టీమ్‌ఇండియా టెస్టు ఆడింది. రొటేషన్‌ పద్ధతి ప్రకారం దిల్లీలో ఈ సారి కచ్చితంగా ఓ మ్యాచ్‌ జరగొచ్చు. మిగిలిన మ్యాచ్‌ల నిర్వహణ కోసం అహ్మదాబాద్‌, ధర్మశాల, నాగ్‌పూర్‌, చెన్నై, హైదరాబాద్‌ రేసులో ఉన్నాయి. ధర్మశాల ఇప్పటివరకూ ఒకే ఒక్క టెస్టు (2017 మార్చిలో ఆస్ట్రేలియాతో)కే ఆతిథ్యమిచ్చింది. ‘‘నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో దిల్లీ రెండో టెస్టుకు వేదికగా నిలవొచ్చు. ధర్మశాలలో మూడో టెస్టు జరిగే అవకాశం ఉంది. త్వరలోనే తేదీలు, వేదికలపై నిర్ణయం తీసుకుంటారు’’ అని ఓ బీసీసీఐ సీనియర్‌ అధికారి తెలిపాడు. చివరి టెస్టు అహ్మదాబాద్‌లో జరిగొచ్చు. తొలి టెస్టు కోసం నాగ్‌పూర్‌, చెన్నై లేదా హైదరాబాద్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ నాలుగు టెస్టుల్లో దేన్ని డేనైట్‌ మ్యాచ్‌గా నిర్వహిస్తారన్నది కూడా తేల్చాల్సి ఉంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో చోటు దక్కించుకోవాలంటే ఈ సిరీస్‌ను భారత్‌ 4-0తో క్లీన్‌స్వీప్‌ చేయాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని