IND vs NZ: కుర్రాళ్లకు పరీక్ష!

టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో ఎదురైన పరాభవాన్ని మరిచిపోవాలనుకుంటున్న టీమ్‌ఇండియా ఓ కొత్త ఆరంభానికి సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో తొలి పోరు నేడే.

Updated : 18 Nov 2022 07:13 IST

నేడే కివీస్‌తో భారత్‌ తొలి టీ20
మధ్యాహ్నం 12 నుంచి..

టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో ఎదురైన పరాభవాన్ని మరిచిపోవాలనుకుంటున్న టీమ్‌ఇండియా ఓ కొత్త ఆరంభానికి సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో తొలి పోరు నేడే. ప్రపంచకప్‌ ఆడిన జట్టుకు ఈ భారత్‌కూ ఎంతో తేడా! కెప్టెన్‌ మారాడు.. జట్టూ చాలా వరకు మారింది. కోచ్‌ కూడా కొత్తొడే. మరి ఆట తీరులోనూ మార్పు వస్తుందా అన్నది ఆసక్తికరం. హార్దిక్‌ పాండ్య సారథ్యంలోని యువ జట్టు ఎలా ఆడుతుందో చూడాలి.

భారత యువ జట్టుకు సవాల్‌. సీనియర్లు లేకుండా దాదాపు కుర్రాళ్లతో నిండిన భారత జట్టు.. న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌కు సిద్ధమైంది. శుక్రవారమే తొలి టీ20. విదేశీ గడ్డపై కుర్ర జట్టును హార్దిక్‌ ఎలా నడిపిస్తాడో చూడాలి. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మతో పాటు సీనియర్లు విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌ లేకుండానే కివీస్‌కు వచ్చిన భారత్‌కు ప్రయోగాలు చేసేందుకు కూడా ఈ సిరీస్‌ అవకాశం ఇస్తోంది. రోహిత్‌-రాహుల్‌ గైర్హాజరు నేపథ్యంలో శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి ఇషాన్‌ కిషన్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించే అవకాశాలున్నాయి. ఇప్పటికే వన్డేల్లో సత్తా చాటిన శుభ్‌మన్‌.. టీ20ల్లో అరంగేట్రం చేయడం లాంఛనమే. ప్రపంచకప్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన కోహ్లి లేకపోవడంతో మిడిలార్డర్‌లో సూర్యకుమార్‌, శ్రేయస్‌ అయ్యర్‌, పంత్‌లపై పెద్ద భారమే పడనుంది. దినేశ్‌ కార్తీక్‌ ఉండడంతో టీ20 ప్రపంచకప్‌లో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయిన పంత్‌ ఈ సిరీస్‌లో అటు కీపర్‌గా ఇటు బ్యాటర్‌గా కీలకం కానున్నాడు. శ్రేయస్‌ లేదా సంజు ఇద్దరిలో ఒకరికే జట్టులో చోటు దక్కే అవకాశాలున్నాయి. గాయం నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌కు కూడా సత్తా చాటేందుకు ఇదో చక్కని ఛాన్స్‌.

బౌలింగ్‌లో ఏం చేస్తారో..: పొట్టి ప్రపంచకప్‌లో భారత్‌ తీవ్రంగా ఇబ్బంది పడింది బౌలింగ్‌లోనే. ఒకవైపు బుమ్రా లేని లోటు.. మరోవైపు గతి తప్పిన బౌలింగ్‌తో చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. మళ్లీ భారత బౌలర్లు కఠిన పరీక్ష ఎదుర్కోబోతున్నారు. సీనియర్‌ బుమ్రా లేకుండానే న్యూజిలాండ్‌కు వచ్చిన టీమ్‌ఇండియా బౌలర్లు ఎలా రాణిస్తారో చూడాలి. బుమ్రా లేకపోయినా జట్టులో ప్రతిభావంతులకు కొదువలేదు. భువనేశ్వర్‌ కుమార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌లకు తోడు బుల్లెట్‌ బంతులు వేసే ఉమ్రాన్‌ మాలిక్‌ ఉన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమైన హర్షల్‌ పటేల్‌తో పాటు మహ్మద్‌ సిరాజ్‌ ఈ సిరీస్‌లో అవకాశాలు దక్కించుకోనున్నారు. పొట్టి ప్రపంచకప్‌లో మిడిల్‌ ఓవర్లలో ఫింగర్‌ స్పిన్నర్లు వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో లెగ్‌ స్పిన్నర్‌ చాహల్‌, చైనామన్‌ బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ చేరిక ఆ లోపాన్ని సరిదిద్దుతుందని జట్టు ఆశిస్తోంది. రెగ్యులర్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కి విశ్రాంతి ఇవ్వడంతో వీవీఎస్‌ లక్ష్మణ్‌ భారత్‌ జట్టుకు తాత్కాలికంగా కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

కసి మీద కివీస్‌: న్యూజిలాండ్‌ది కూడా భారత్‌ లాంటి పరిస్థితే. మన లాగే ఆ జట్టూ టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో ఓడింది. మరోసారి ఐసీసీ ఈవెంట్లలో విఫలమైన కివీస్‌ ఓ విజయంతో ఆ వేదన నుంచి ఉపశమనం పొందాలనే పట్టుదలతో ఉంది. సొంతగడ్డ, తెలిసిన పరిస్థితులు, ఇష్టమైన ఫార్మాట్లో విలియమ్సన్‌ సేనను ఆపడం భారత్‌కు అంత తేలికేం కాదు. గప్తిల్‌ గాయం నుంచి కోలుకోకపోవడంతో కాన్వేతో కలిసి అలెన్‌ ఫిన్‌ ఓపెనింగ్‌ చేయబోతున్నాడు. సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి వైదొలగిన కీలక పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ అన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలున్నాయి. ప్రపంచకప్‌లో తన స్ట్రైక్‌రేట్‌పై వచ్చిన విమర్శలకు విలియమ్సన్‌ ఎలా జవాబు చెబుతాడన్నది ఆసక్తికరం.


జట్లు (అంచనా)

భారత్‌: హార్దిక్‌ పాండ్య (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌/సంజు శాంసన్‌/దీపక్‌ హుడా, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌, హర్షల్‌ పటేల్‌/ఉమ్రాన్‌ మాలిక్‌, భువనేశ్వర్‌, అర్ష్‌దీప్‌, చాహల్‌

న్యూజిలాండ్‌: విలియమ్సన్‌ (కెప్టెన్‌), ఫిన్‌ అలెన్‌, కాన్వే, ఫిలిప్స్‌, మిచెల్‌, నీషమ్‌, శాంట్నర్‌, సౌథీ, ఇష్‌ సోథీ, ఆడమ్‌ మిల్నె, ఫెర్గూసన్‌


పిచ్‌..

కివీస్‌లో టీ20 మ్యాచ్‌లు అంటే పరుగుల వర్షమే. కానీ తొలి టీ20 జరిగే వెల్లింగ్టన్‌ మాత్రం ఇందుకు భిన్నం. ఇక్కడ మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు చేసిన సగటు స్కోరు 162 పరుగులే. వెల్లింగ్టన్‌లో చలి గాలులతో కూడిన వాతావరణం ఉంది. వర్షం వల్ల ఆటకు ఎలాంటి అంతరాయం కలగకపోవచ్చు.


5-0

చివరిసారి న్యూజిలాండ్‌లో ఆడిన టీ20 సిరీస్‌ను భారత్‌ 5-0తో సొంతం చేసుకుంది.


286

ఒక ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచేందుకు సూర్యకుమార్‌ (1040)కు అవసరమైన పరుగులు. అతడికన్నా ముందు పాక్‌ ఓపెనర్‌ రిజ్వాన్‌ (1326) ఉన్నాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని