ఒక్కో స్టేడియం ఒక్కో కథ..

పచ్చికపై పరుగులు పెట్టి.. ప్రత్యర్థిని బోల్తా కొట్టించి.. గోల్స్‌ వేటలో ఆటగాళ్లు దూసుకెళ్లేందుకు సమయం ఆసన్నమవుతోంది. ఆదివారం ఆరంభమయ్యే ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌తో మైదానంలో 32 జట్ల యుద్ధానికి తెరలేస్తుంది. ఈ మెగా టోర్నీకి తొలిసారి ఆతిథ్యమిస్తున్న ఖతార్‌.. మ్యాచ్‌ల కోసం అయిదు నగరాల్లో ఎనిమిది వేదికలను సిద్ధం చేసింది.

Updated : 19 Nov 2022 08:11 IST

పచ్చికపై పరుగులు పెట్టి.. ప్రత్యర్థిని బోల్తా కొట్టించి.. గోల్స్‌ వేటలో ఆటగాళ్లు దూసుకెళ్లేందుకు సమయం ఆసన్నమవుతోంది. ఆదివారం ఆరంభమయ్యే ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌తో మైదానంలో 32 జట్ల యుద్ధానికి తెరలేస్తుంది. ఈ మెగా టోర్నీకి తొలిసారి ఆతిథ్యమిస్తున్న ఖతార్‌.. మ్యాచ్‌ల కోసం అయిదు నగరాల్లో ఎనిమిది వేదికలను సిద్ధం చేసింది. అందులో ఓ స్టేడియాన్ని పునర్నిర్మించగా.. మిగతా ఏడు స్టేడియాలు కొత్తవి. మరి.. వాటిని ఓ సారి చుట్టొద్దాం పదండి!


లూసెయిల్‌ ఐకానిక్‌ స్టేడియం

ఈ ప్రపంచకప్‌ కోసం రాజధాని దోహాతో పాటు చుట్టుపక్కల 55 కిలోమీటర్ల పరిధిలోని నగరాల్లో కలిపి ఎనిమిది స్టేడియాలను ఖతార్‌ సిద్ధం చేసింది. అధిక ఉష్ణోగ్రతల నుంచి ప్రేక్షకులకు ఉపశమనం కలిగించేందుకు అన్ని స్టేడియాల్లోనూ చల్లని గాలి (ఏసీ) వచ్చే సౌకర్యం ఏర్పాటు చేశారు. ఫైనల్‌తో పాటు గరిష్ఠంగా 10 మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్న లూసెయిల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. టోర్నీలో ఇదే అతి పెద్ద స్టేడియం. ఉక్కు ఫ్రేమ్‌లపై అమర్చిన బంగారు రంగు ప్యానెల్ల కారణంగా స్టేడియం పసిడి వర్ణంలో మెరిసిపోతోంది.

సామర్థ్యం:  80 వేలు 

నిర్మాణ ఖర్చు:  సుమారు రూ.6241 కోట్లు


అల్‌ బేట్‌ స్టేడియం

ఈ ప్రపంచకప్‌ కోసం నిర్మించిన వాటిలో ఇదే అత్యంత ఖరీదైన స్టేడియం అని చెప్పొచ్చు. ఆ దేశ ఎడారిలో ఎక్కువగా సంచార ప్రజలు ఉపయోగించే టెంటు ఆకారంలో దీన్ని రూపొందించారు. దీనికి ముడుచుకునే పైకప్పునూ ఏర్పాటు చేశారు. ప్రపంచకప్‌ ఆరంభ వేడుకలు, తొలి మ్యాచ్‌కు ఇదే వేదిక. ఇక్కడ మొత్తం 9 మ్యాచ్‌లు జరుగుతాయి.

సామర్థ్యం:   60 వేలు

నిర్మాణ ఖర్చు: రూ.6892 కోట్లు


ఖలీఫా అంతర్జాతీయ స్టేడియం

1976లో దీన్ని నిర్మించారు. ఆసియా క్రీడలు, అరేబియన్‌ గల్ఫ్‌ కప్‌ తదితర వాటికి ఆతిథ్యమిచ్చింది. ఇప్పుడు ప్రపంచకప్‌ కోసం అవసరానికి తగ్గట్లుగా మళ్లీ పునర్నిర్మించారు. 2017లో ఆరంభించారు. అప్పుడు ఖతార్‌ దేశవాళీ కప్‌ (అమిర్‌ కప్‌) ఫైనల్‌కు వేదికగా నిలిచింది. ఈ జాతీయ స్టేడియంలో ప్రపంచకప్‌ 8 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

సామర్థ్యం:  40 వేలు 

నిర్మాణ ఖర్చు:   రూ.3042 కోట్లు


ఎడ్యుకేషన్‌ సిటీ స్టేడియం  

‘ఎడారిలో వజ్రం’.. అని పిలుచుకుంటున్న ఈ స్టేడియం నిర్మాణం వజ్రాన్ని పోలి ఉంటుంది. దీని వెలుపలి భాగంపై సూర్యరశ్మి పడగానే ప్రకాశవంతంగా వెలుగులీనుతోంది. ఎడ్యుకేషన్‌ సిటీలో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. 2020లో ఆరంభమైన ఈ స్టేడియంలో 8 ప్రపంచకప్‌ 8 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.

సామర్థ్యం:  40 వేలు

నిర్మాణ ఖర్చు:  రూ.5693 కోట్లు


అహ్మద్‌ బిన్‌ అలీ స్టేడియం

డారికి దగ్గర్లో నిర్మించిన స్టేడియం ఇది. ఖతార్‌ సంప్రదాయ కట్టడాల నిర్మాణాలను సూచించే విధంగా దీన్ని నిర్మించారు. దీని కొనలు ఎడారిలోని ఇసుక దిబ్బలను సూచించేలా ఉన్నాయి. 2020లోనే ఆరంభమైన ఈ స్టేడియంలో అమిర్‌ కప్‌ మ్యాచ్‌లు నిర్వహించారు. ఇప్పుడు ప్రపంచకప్‌లో 7 మ్యాచ్‌లకు ఇది వేదిక కానుంది.

సామర్థ్యం:  40 వేలు

నిర్మాణ ఖర్చు:   రూ.2927 కోట్లు


అల్‌ జనాబ్‌ స్టేడియం

చేపలు పట్టేందుకు వాడే ఆ దేశ సంప్రదాయ పడవకు ఉండే తెరచాప ఆకారంలో ఈ స్టేడియాన్ని నిర్మించారు. ముడుచుకునే పైకప్పు దీని మరో ప్రత్యేకత. 2019లో ఈ స్టేడియంలో అమిర్‌ కప్‌ ఫైనల్‌ జరిగింది. ఈ ప్రపంచకప్‌లో 7 మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చేందుకు స్టేడియం సిద్ధమైంది.

సామర్థ్యం:  40 వేలు

నిర్మాణ ఖర్చు:   రూ.4773 కోట్లు


అల్‌ తుమామా స్టేడియం

ధ్య ప్రాచ్య దేశాల్లో ముస్లిమ్‌లు ధరించే సంప్రదాయ టోపీ (గఫియా)ని స్ఫూర్తిగా తీసుకుని ఈ స్టేడియాన్ని అదే ఆకారంలో నిర్మించారు. సాధారణంగా ఎండ నుంచి తలకు రక్షణ కల్పించే టోపీలాగే.. ఈ స్టేడియాన్ని సూర్మరశ్మి ప్రేక్షకులకు తగలకుండా రూపొందించారు. ఇక్కడ 8 మ్యాచ్‌లు జరుగుతాయి.

సామర్థ్యం:  40 వేలు 

నిర్మాణ ఖర్చు:   రూ.2786 కోట్లు


స్టేడియం 974

తార్‌ అంతర్జాతీయ డయల్‌ కోడ్‌ (+974)తో పాటు దీని నిర్మాణంలో ఉపయోగించిన భారీ కంటెయినర్ల సంఖ్యను సూచిస్తూ దీనికి స్టేడియం 974 అనే పేరు పెట్టారు. తిరిగి వినియోగించేందుకు ఆస్కారమున్న కంటెయినర్లను నిర్మాణంలో వాడడం దీని ప్రత్యేకత. దీంతో ఈ స్టేడియాన్ని ఎక్కడికైనా తరలించే అవకాశం ఏర్పడింది. ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత ఈ కంటెయినర్లను తొలగించి.. అవసరమైన చోటుకు తీసుకెళ్లి మళ్లీ స్టేడియం ఆకారంలో నిర్మించొచ్చు.  ఫిఫా ప్రపంచకప్‌ చరిత్రలోనే మొట్టమొదటి తాత్కాలిక స్టేడియం ఇదే. ఈ స్టేడియం 7 మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తుంది.


ఈ స్టేడియాల నిర్మాణం కారణంగా ఖతార్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కుంటోంది. వీటి నిర్మాణం మొదలెట్టినప్పటి నుంచి గత దశాబ్ద కాలంలో ఆ దేశంలో 6,500 కంటే ఎక్కువ మంది వలస కార్మికులు మరణించారని నివేదికలు చెబుతున్నాయి. స్టేడియాల నిర్మాణంలో పాలు పంచుకున్న కార్మికులకు అక్కడి పాలకులు కనీస రక్షణ అవసరాలు కల్పించకపోవడంతోనే ఈ మరణాలు సంభవించాయనే ఆరోపణలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని