FIFA World Cup 2022: డబుల్‌ ధమాకా

ఫుట్‌బాల్‌ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తూ ప్రపంచకప్‌ మొదలైంది. ఈక్వెడార్‌కు అదిరే ఆరంభం. ఖతార్‌కు భంగపాటు. చిన్న జట్టయిన ఆతిథ్య ఖతార్‌ అద్భుతాలు చేస్తుందని ఎవరూ అనుకోలేదు.

Updated : 21 Nov 2022 12:42 IST

అదరగొట్టిన వాలెన్సియా
ప్రపంచకప్‌లో ఈక్వెడార్‌ బోణీ
ఖతార్‌పై 2-0తో విజయం
అలరించిన ఆరంభ వేడుకలు

ఫుట్‌బాల్‌ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తూ ప్రపంచకప్‌ మొదలైంది. ఈక్వెడార్‌కు అదిరే ఆరంభం. ఖతార్‌కు భంగపాటు. చిన్న జట్టయిన ఆతిథ్య ఖతార్‌ అద్భుతాలు చేస్తుందని ఎవరూ అనుకోలేదు. కానీ ఆ జట్టు పెద్దగా పోటీ కూడా ఇవ్వలేకపోయింది. పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఈక్వెడార్‌ 2-0తో పైచేయి సాధించింది. వెటరన్‌ స్ట్రైకర్‌ ఎనర్‌ వాలెన్సియా రెండు గోల్స్‌తో ఈక్వెడార్‌ విజయంలో హీరోగా నిలిచాడు.

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ను ఈక్వెడార్‌ ఘనంగా మొదలెట్టింది. వాలెన్సియా డబుల్‌తో ఆదివారం జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌ (గ్రూప్‌-ఎ)లో ఆ జట్టు 2-0 గోల్స్‌తో ఆతిథ్య ఖతార్‌పై విజయం సాధించింది. తొలి నిమిషం నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన ఈక్వెడార్‌ తొలి అర్ధభాగంలోనే రెండు గోల్స్‌ కొట్టి తిరుగులేని ఆధిక్యం సంపాదించింది. 16వ నిమిషంలో పెనాల్టీని సద్వినియోగం చేసి జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లిన వాలెన్సియా.. 31వ నిమిషంలో మరో గోల్‌ సాధించాడు. ఖతార్‌ రెండో అర్ధభాగంలో పుంజుకున్నా ఫలితం లేకపోయింది. ప్రపంచకప్‌ చరిత్రలో ఆరంభ మ్యాచ్‌లో ఓడిన తొలి ఆతిథ్య జట్టు ఖతారే. ఈ మ్యాచ్‌కు ముందు ప్రపంచకప్‌ ఆరంభ వేడుకలు అంబరాన్నంటాయి.

ఈక్వెడార్‌ దూకుడు: ఆరంభం నుంచే ఎటాకింగ్‌కు దిగిన ఈక్వెడార్‌.. ఖతార్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. మూడో నిమిషంలోనే ఆ జట్టు ఆధిక్యంలోకి వెళ్లాల్సింది. ఫెలిక్స్‌ టోరెస్‌ దూరం నుంచి అద్భుతమైన బైసికిల్‌ కిక్‌తో బంతిని అందించగా.. తేలిగ్గా పంచ్‌ చేసే అవకాశం ఉన్నా ఖతార్‌ గోల్‌కీపర్‌ కొట్టలేకపోయాడు. అవకాశాన్ని ఉపయోగించుకున్న వాలెన్సియా తలతో బంతిని నెట్లోకి కొట్టడంతో ఈక్వెడార్‌ సంబరాల్లో మునిగిపోయింది. కానీ ఆఫ్‌సైడ్‌ కావడంతో రిఫరీ ఆ గోల్‌ను అనుమతించలేదు. అయితే రిఫరీ తప్పు చేశాడని, అది ఆఫ్‌సైడ్‌ కాదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈక్వెడార్‌ అప్పటికి నిరాశకు గురైనా.. ఖతార్‌ను ఒత్తిడికి గురి చేస్తూ దూకుడు మాత్రం కొనసాగించింది. ఎట్టకేలకు 16వ నిమిషంలో ఆ జట్టు ప్రయత్నాలు ఫలించాయి. ఖతార్‌ గోల్‌కీపర్‌ సాద్‌ అల్‌ షీబ్‌.. బాక్స్‌లో వాలెన్సియాను పడేయడంతో ఈక్వెడార్‌కు పెనాల్టీ లభించింది. షీబ్‌ను అలవోకగా బోల్తా కొట్టిన వాలెన్సియా ఈ ప్రపంచకప్‌లో తొలి గోల్‌ సాధించాడు. అదే జోరులో ఈక్వెడార్‌ గోల్‌ వేటను కొనసాగించింది. పాదరసంలా కదిలిన వాలెన్సియా ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. 31వ నిమిషంలో సూపర్‌ హెడర్‌తో ఈక్వెడార్‌ను 2-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ప్రెసియాడో నుంచి క్రాస్‌ను అతడు తలతో నెట్లోకి కొట్టాడు.  అయితే తొలి అర్ధభాగం ముగిసేసరికి ఖతార్‌ కూడా కాస్త పుంజుకుని పోటీ ఇవ్వడం మొదలెట్టింది. అల్మోజ్‌ అలీ గోల్‌ కొట్టే చక్కని అవకాశాన్ని వదిలేశాడు. ద్వితీయార్ధంలో బంతిపై ఖతార్‌ నియంత్రణ పెరిగినా.. ఈక్వెడార్‌ డిఫెన్స్‌ను దాటుకుంటూ గోల్‌ మాత్రం సాధించలేకపోయింది. కడవరకూ ఆధిక్యాన్ని నిలబెట్టుకున్న ఈక్వెడార్‌ అలవోకగా విజయాన్ని అందుకుంది.


ఫిఫాకు డబ్బే డబ్బు

దోహా: ప్రస్తుత ఖతార్‌ ప్రపంచకప్‌తో ముడిపడి ఉన్న నాలుగేళ్ల కాలం (2018-2022)లో ఫిఫా రికార్డు స్థాయిలో దాదాపు 61 వేల కోట్లు ఆర్జించింది. గత ప్రపంచకప్‌ (2018)తో ముడిపడి ఉన్న నాలుగేళ్ల కాలంలో వచ్చిన ఆదాయం కన్నా 8 వేల కోట్లు ఎక్కువ. తన ఆదాయ వివరాలను ఫిఫా సభ్యదేశాల ప్రతినిధులకు చెప్పింది. వచ్చే నాలుగేళ్లలో ఆదాయం 80 వేల కోట్లు దాటుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచకప్‌లో 32 జట్లు పోటీపడుతున్నాయి. 2026 ప్రపంచకప్‌ నుంచి ఈ సంఖ్య 48కి పెరగనుంది.


ఫ్రాన్స్‌ స్టార్‌ బెంజెమా ఔట్‌

దోహా: డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌ ప్రపంచకప్‌ ఆశలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఆటగాడు కరీమ్‌ బెంజెమా గాయం కారణంగా ఒక్క మ్యాచ్‌ ఆడకుండానే టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. శనివారం ప్రాక్టీస్‌ సందర్భంగా అతడి ఎడమ తొడకు గాయమైంది. అతడికి మూడు వారాల విశ్రాంతి అవసరమని ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్‌ సమాఖ్య తెలిపింది. ‘‘బెంజెమాకు ఇలా జరిగినందుకు బాధగా ఉంది. ప్రపంచకప్‌లో ఆడాలని అతడు తహతహలాడాడు’’ అని ఫ్రాన్స్‌ కోచ్‌ డెస్‌చాంప్స్‌ అన్నాడు.


తొలి మ్యాచ్‌లో ఖతార్‌పై ఈక్వెడార్‌ గెలుపు

ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా సంబరాల్లో ఒకటైన ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఖతార్‌ వేదికగా ఆదివారం ఘనంగా ఆరంభమైంది. బాణసంచా వెలుగులు, కళాకారుల విన్యాసాల మధ్య ప్రపంచకప్‌ ప్రాధాన్యాన్ని చాటేలా ఆరంభ వేడుకలు నిర్వహించిన అనంతరం.. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఖతార్‌తో ఈక్వెడార్‌ తలపడింది. అంచనాలకు తగ్గట్లే ఈ మ్యాచ్‌లో ఈక్వెడార్‌ పైచేయి సాధించింది. 2-0 గోల్స్‌ తేడాతో ఖతార్‌ను ఓడించింది. మ్యాచ్‌లో నమోదైన రెండు గోల్‌లనూ ఈక్వెడార్‌ స్టార్‌ స్ట్రైకర్‌ వాలెన్సియానే కొట్టాడు. 16వ నిమిషంలో పెనాల్టీని సద్వినియోగం చేసిన వాలెన్సియా.. 31వ నిమిషంలో ఫీల్డ్‌ గోల్‌ సాధించాడు.


ప్రపంచకప్‌లో ఈనాడు

గ్రూప్‌-బి

ఇంగ్లాండ్‌ × ఇరాన్‌

సా।। 6.30 నుంచి

గ్రూప్‌-ఎ

సెనగల్‌ × నెదర్లాండ్స్‌

రా।। 9.30 నుంచి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని