NZ vs IND 2022: ప్రచండ సూర్య

ప్రత్యర్థి వేదిక కావొచ్చు.. అక్కడి పరిస్థితులు అతనికి కొత్త కావొచ్చు.. అవతలి జట్టు బలంగా ఉండొచ్చు.. కానీ బ్యాట్‌ పట్టుకుని క్రీజులో అడుగుపెట్టాడా.. అతనిదే ఆధిపత్యం. ఫోర్లు, సిక్సర్లతో అతని బ్యాట్‌ మాట్లాడుతుంటే.. ఆ పరుగుల విందును ఆస్వాదించడమే మన పని!

Updated : 21 Nov 2022 06:56 IST

ధనాధన్‌ సెంచరీ
సమష్టిగా రాణించిన బౌలర్లు
కివీస్‌పై భారత్‌ విజయం

ప్రత్యర్థి వేదిక కావొచ్చు.. అక్కడి పరిస్థితులు అతనికి కొత్త కావొచ్చు.. అవతలి జట్టు బలంగా ఉండొచ్చు.. కానీ బ్యాట్‌ పట్టుకుని క్రీజులో అడుగుపెట్టాడా.. అతనిదే ఆధిపత్యం. ఫోర్లు, సిక్సర్లతో అతని బ్యాట్‌ మాట్లాడుతుంటే.. ఆ పరుగుల విందును ఆస్వాదించడమే మన పని!

మనం చూస్తున్నది క్రికెట్టా లేక వీడియో గేమా అని ఆశ్చర్యం కలిగేలా.. అతడికి బౌలింగ్‌ చేస్తున్నది అంతర్జాతీయ స్థాయి బౌలర్లా లేక గల్లీ కుర్రాళ్లా అని విస్మయం చెందేలా.. అతను మనిషా లేక యంత్రమా అని అబ్బురపడేలా సాగిన సూర్యకుమారుడి కళాత్మక విధ్వంసం గురించి ఎంత చెప్పినా తక్కువే.  న్యూజిలాండ్‌తో రెండో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగిన సూర్య.. ఈ ఫార్మాట్లో రెండో శతకంతో చెలరేగాడు. జట్టుకు అలవోక విజయాన్నందించాడు.

సూర్య బ్యాటింగ్‌ కోసం అభిమానులు ఎందుకు అంతలా ఎదురు చూస్తారో.. ప్రస్తుత ప్రపంచ టీ20 క్రికెట్లో అతను మేటి అంటూ విశ్లేషకులు, మాజీలు ఎందుకు పొగుడుతున్నారో.. మరోసారి అందరికీ అర్థమయ్యేలా.. అద్భుతమైన బ్యాటింగ్‌ విన్యాసాలను మళ్లీ కళ్లకు కట్టాడు. ఆదివారం కివీస్‌తో రెండో టీ20లో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ సూర్యకుమార్‌ (111 నాటౌట్‌; 51 బంతుల్లో 11×4, 7×6) అజేయ సెంచరీ సాయంతో టీమ్‌ఇండియా 65 పరుగుల తేడాతో గెలిచింది. మొదట భారత్‌  20 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసింది. టిమ్‌ సౌథీ (3/34) హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. ఛేదనలో కివీస్‌ 18.5 ఓవర్లలో 126కే కుప్పకూలింది. కెప్టెన్‌ విలియమ్సన్‌ (61; 52 బంతుల్లో 4×4, 2×6) ఆ జట్టులో టాప్‌స్కోరర్‌. దీపక్‌ హుడా (4/10), సిరాజ్‌ (2/24), చాహల్‌ (2/26) సమష్టిగా ప్రత్యర్థి పనిపట్టారు. మూడు టీ20ల   సిరీస్‌లో తొలి మ్యాచ్‌ వర్షార్పణమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో నెగ్గి భారత్‌  1-0తో ఆధిక్యం సాధించింది. చివరి టీ20 మంగళవారం జరుగుతుంది.

కలిసికట్టుగా..: ఛేదనలో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన కివీస్‌ ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. భారత బౌలర్లు కలిసికట్టుగా ప్రత్యర్థిని దెబ్బకొట్టారు. టీ20 ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాని చాహల్‌, తనలోని స్పిన్నర్‌ను బయటకు తీస్తూ దీపక్‌ హుడా న్యూజిలాండ్‌పై అదరగొట్టారు. ఇన్నింగ్స్‌ రెండో బంతికే ప్రమాదకర అలెన్‌ (0)ను ఔట్‌స్వింగర్‌తో భువీ (1/12) బోల్తా కొట్టించాడు. మరో ఓపెనర్‌ కాన్వె (25)తో కలిసి విలియమ్సన్‌ ఇన్నింగ్స్‌ నిలబట్టే ప్రయత్నం చేశాడు. పవర్‌ప్లేలో కేవలం మూడు ఫోర్లు సహా 32 పరుగులే చేసిన ఆతిథ్య జట్టు వెనకబడింది. సుందర్‌ (1/24) బౌలింగ్‌లో ఎదురు దాడి చేసినా అది కొద్దిసేపే. తన తర్వాతి ఓవర్లో కాన్వేను వెనక్కిపంపిన సుందర్‌ రెండో వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. మంచి ఫామ్‌లో ఫిలిప్స్‌ (12)ను కుదురుకోకముందే చాహల్‌ బుట్టలో వేసుకున్నాడు. అక్కడి నుంచి చాహల్‌, దీపక్‌ పరుగులు ఇవ్వడంలో పిసినారితనం ప్రదర్శించడంతో తర్వాతి 30 బంతుల్లో ఒక్క బౌండరీ కూడా రాలేదు. మధ్యలో మిచెల్‌ (10), నీషమ్‌ (0) కూడా ఔటైపోవడంతో 14 ఓవర్లకు 91/5తో జట్టు పరాజయం ఖాయమైంది. విలియమ్సన్‌ అర్ధశతకం ఓటమి అంతరాన్ని తగ్గించడానికి మాత్రమే పనికొచ్చింది. 19వ ఓవర్లో మూడు వికెట్లతో ప్రత్యర్థి ఇన్నింగ్స్‌కు హుడా ముగింపు పలికాడు.

అతనొక్కడే..: బ్యాటింగ్‌లో భారత్‌ కొట్టిన 18 ఫోర్లలో 11.. 9 సిక్సర్లలో 7 అతనివే. మిగతా జట్టు మొత్తం కలిసి చేసిన పరుగులు 69.. అతని పరుగులు 111. ఎక్స్‌ట్రాలు 11. 15 ఓవర్లకు జట్టు స్కోరు 119/3.. 20 ఓవర్లకు అది 191/6. ఈ గణాంకాలు చాలు సూర్య విధ్వంసం గురించి చెప్పడానికి. అంతా తానై.. మైదానంలో అన్ని చోట్లకు బంతిని పంపించిన అతణ్ని కివీస్‌ బౌలర్లు ఔట్‌ చేయలేకపోయారు. ప్రత్యర్థి బౌలర్లను నిస్సహాయులుగా మార్చేస్తూ.. ఫీల్డర్లను ప్రేక్షక పాత్రకే పరిమితం చేస్తూ అతను చెలరేగిన తీరు అసాధారణం. అంతకుముందు ఇషాన్‌ (36)తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన పంత్‌ (6) క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు. మరో ఓపెనర్‌ ఇషాన్‌ కూడా వేగంగా ఆడలేకపోయాడు. మూడో స్థానానికి ప్రమోషన్‌ పొందిన సూర్య మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. 360 డిగ్రీల ఆటతీరుతో అభిమానులను అలరించాడు. ఆఫ్‌సైడ్‌ జరిగి స్కూప్‌తోనే వికెట్ల మీదుగా తొలి బౌండరీ సాధించాడు. పవర్‌ప్లే చివరకు జట్టు 42/1తో నిలిచింది. మధ్యలో వరుణుడు పలకరించి వెళ్లడంతో మ్యాచ్‌కు కాస్త అంతరాయం కలిగింది. స్పిన్నర్ల బౌలింగ్‌లో తడబడ్డ ఇషాన్‌ను సోధి (1/35) ఔట్‌చేశాడు. శ్రేయస్‌ (13) హిట్‌వికెట్‌గా వెనుదిరిగాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. సూర్య ఆగలేదు. బ్యాటింగ్‌కు కష్టంగా కనిపించిన పిచ్‌పై అలవోకగా బౌండరీలు రాబట్టడం అతనికే చెల్లింది. తొలి 20 బంతుల్లో 32 పరుగులే చేసిన అతను.. ఫెర్గూసన్‌ను లక్ష్యంగా చేసుకుని టాప్‌గేర్‌లోకి వెళ్లిపోయాడు. 32 బంతుల్లో అర్ధసెంచరీ అందుకున్నాడు. 16 ఓవర్లకు జట్టు స్కోరు 129/3.

అంతకుమించి..: స్పిన్నర్లు ఆఫ్‌స్టంప్‌ మీద బంతి వేస్తే.. దాన్ని కవర్స్‌ మీదుగా, పేసర్లు స్టంప్స్‌ను లక్ష్యంగా చేసుకుని మంచి లెంగ్త్‌లో బంతులు సంధిస్తే పేస్‌ను ఉపయోగించుకుని ఫైన్‌లెగ్‌లో ఫోర్లు, సిక్సర్లు కొట్టిన సూర్య.. 17, 18, 19 ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముఖ్యంగా ఫెర్గూసన్‌ వేసిన 19వ ఓవర్లో నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో విధ్వంసాన్ని తారస్థాయికి చేర్చాడు. 49 బంతుల్లోనే శతకం చేరుకున్నాడు. ఇన్నింగ్స్‌లో అతను కొట్టిన ఒక్కో సిక్సర్‌ ఒక్కో ఆణిముత్యమే. చివరి ఓవర్లో అతనికి బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. సౌథీ వరుస బంతుల్లో హార్దిక్‌ (13), దీపక్‌ (0), సుందర్‌ (0)ను ఔట్‌ చేశాడు. దీంతో భారత్‌ 200 చేయలేకపోయింది. సూర్య తన చివరి 18 బంతుల్లో ఏకంగా 64 పరుగులు సాధించాడు.


‘‘తాను ఎందుకు ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడినయ్యానో నంబర్‌వన్‌ ఆటగాడు చూపిస్తున్నాడు. నేను ఈ రోజు మ్యాచ్‌ లైవ్‌ చూడలేదు. కానీ ఇది అతడి మరో వీడియో గేమ్‌ ఇన్నింగ్స్‌ లాగే సాగి ఉంటుంది’’

- సూర్యకుమార్‌ ఇన్నింగ్స్‌పై కోహ్లి ట్వీట్‌


భారత్‌ ఇన్నింగ్స్‌: ఇషాన్‌ (సి) సౌథీ (బి) సోధి 36; పంత్‌ (సి) సౌథీ (బి) ఫెర్గూసన్‌ 6; సూర్యకుమార్‌ నాటౌట్‌ 111; శ్రేయస్‌ హిట్‌వికెట్‌ (బి) ఫెర్గూసన్‌ 13; హార్దిక్‌ (సి) నీషమ్‌ (బి) సౌథీ 13; దీపక్‌ (సి) ఫెర్గూసన్‌ (బి) సౌథీ 0; సుందర్‌ (సి) నీషమ్‌ (బి) సౌథీ 0; భువనేశ్వర్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 191; వికెట్ల పతనం: 1-36, 2-69, 3-108, 4-190, 5-190, 6-190; బౌలింగ్‌: సౌథీ 4-0-34-3; మిల్నె 4-0-35-0; ఫెర్గూసన్‌ 4-0-49-2; నీషమ్‌ 1-0-9-0; సోధి 4-0-35-1; శాంట్నర్‌ 3-0-27-0

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: అలెన్‌ (సి) అర్ష్‌దీప్‌ (బి) భువనేశ్వర్‌ 0; కాన్వె (సి) అర్ష్‌దీప్‌ (బి) సుందర్‌ 25; విలియమ్సన్‌ (బి) సిరాజ్‌ 61; ఫిలిప్స్‌ (బి) చాహల్‌ 12; డరైల్‌ మిచెల్‌ (సి) శ్రేయస్‌ (బి) దీపక్‌ 10; నీషమ్‌ (సి) ఇషాన్‌ (బి) చాహల్‌ 0; శాంట్నర్‌ (సి) అండ్‌ (బి) సిరాజ్‌ 2; మిల్నె (సి) అర్ష్‌దీప్‌ (బి) దీపక్‌ 6; సోధి (స్టంప్డ్‌) పంత్‌ (బి) దీపక్‌ 1; సౌథీ (సి) పంత్‌ (బి) దీపక్‌ 0; ఫెర్గూసన్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం: (18.5 ఓవర్లలో ఆలౌట్‌) 126; వికెట్ల పతనం: 1-0, 2-56, 3-69, 4-88, 5-89, 6-99, 7-124, 8-125, 9-125; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 3-0-12-1; అర్ష్‌దీప్‌ 3-0-29-0; సిరాజ్‌ 4-1-24-2; వాషింగ్టన్‌ సుందర్‌ 2-0-24-1; చాహల్‌ 4-0-26-2; దీపక్‌ హుడా 2.5-0-10-4

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని