FIFA World Cup 2022: అర్జెంటీనాపై సౌదీ పిడుగు

ఓవైపు చూస్తే ఒకసారి టైటిల్‌ గెలిచి, మూడుసార్లు రన్నరప్‌గా నిలిచిన అర్జెంటీనా జట్టు.. మెస్సి లాంటి సూపర్‌స్టార్‌తో పాటు డి మారియా, మార్టినెజ్‌ లాంటి స్టార్లున్నారు ఆ జట్టులో.

Updated : 23 Nov 2022 07:34 IST

2-1తో సంచలన విజయం
మెస్సిసేనకు పరాభవం

ఓవైపు చూస్తే ఒకసారి టైటిల్‌ గెలిచి, మూడుసార్లు రన్నరప్‌గా నిలిచిన అర్జెంటీనా జట్టు.. మెస్సి లాంటి సూపర్‌స్టార్‌తో పాటు డి మారియా, మార్టినెజ్‌ లాంటి స్టార్లున్నారు ఆ జట్టులో. వరుసగా 36 మ్యాచ్‌ల్లో ఓటమే లేకుండా, భీకర ఫామ్‌తో టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో అడుగు పెట్టిన జట్టది.  మరోవైపు చూస్తే సౌదీ అరేబియా ఓ పసికూన లాంటి జట్టు. దానికిది ఆరో ప్రపంచకప్‌ మాత్రమే. ఇప్పటిదాకా రెండే మ్యాచ్‌లు నెగ్గింది. అది కూడా చిన్న జట్లపై. ఆ జట్టులో స్టార్లెవ్వరూ లేరు. గ్రూప్‌లో అట్టడుగు స్థానం ఖాయం అని విశ్లేషకులు అంచనా కట్టిన జట్టది.

ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌ అంటే.. అర్జెంటీనా ఎంత తేడాతో గెలుస్తుందనే చూస్తారు. డ్రాతో సరిపెట్టుకున్నా, తక్కువ తేడాతో నెగ్గినా కూడా ఆ జట్టు ప్రతిష్ఠకు భంగమే! అలాంటిది అర్జెంటీనాకు 2-1తో దిమ్మదిరిగే షాకిచ్చింది  సౌదీ అరేబియా. ప్రపంచకప్‌ చరిత్రలోనే అతి పెద్ద సంచలనాల్లో ఇదొకటనడంలో సందేహం లేదు.

లుసాయ్‌ (ఖతార్‌) : 2022 సాకర్‌ ప్రపంచకప్‌లో పెను సంచలనం నమోదైంది. టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటైన అర్జెంటీనాను గ్రూప్‌-సిలో అత్యంత బలహీన జట్టుగా భావించిన సౌదీ అరేబియా మంగళవారం 2-1తో ఓడించి ఫుట్‌బాల్‌ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ప్రపంచకప్‌ అర్హత టోర్నీలో తిరుగులేని ఆధిపత్యం చలాయించి, భీకర ఫామ్‌తో వచ్చిన మెస్సి జట్టుకు ఇలాంటి ఓటమి ఎదురవుతుందని అభిమానులు కలలోనైనా ఊహించి ఉండరు. ఆరంభంలోనే ఆధిక్యంలో నిలిచి, ప్రథమార్ధంలో చాలా వరకు ఆధిపత్యం చలాయించిన జట్టు.. చివరికి ఓటమి వైపు నిలవడం అర్జెంటీనా అభిమానులు జీర్ణించుకోలేని విషయం. రెండో నిమిషం నుంచే గోల్‌ దాడులు మొదలుపెట్టిన అర్జెంటీనా పదో నిమిషంలో మెస్సి గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లింది. పెనాల్టీని సద్వినియోగం చేస్తూ మెస్సి అలవోకగా గోల్‌ కొట్టేశాడు. ప్రత్యర్థి గోల్‌ కీపర్‌ మహ్మద్‌ అల్‌-ఒవైస్‌ కుడివైపు గోల్‌ కొట్టమని మెస్సికి సైగ చేసి ఎడమ వైపు డైవ్‌ చేశాడు. కానీ ఒవైస్‌ కోరుకున్నట్లే మెస్సి అతడి కుడి వైపు గోల్‌ పోస్టులోకి బంతిని నెట్టి అర్జెంటీనా ఖాతా తెరిచాడు.   ఆ తర్వాత కూడా ఆ జట్టు ఆటగాళ్లు గోల్‌ దాడులు కొనసాగించారు. 22వ నిమిషంలో మెస్సి.. 27, 35 నిమిషాల్లో మార్టినెజ్‌ బంతిని గోల్‌లోకి పంపారు. కానీ ఆఫ్‌సైడ్‌ కావడంతో నిరాశ తప్పలేదు. 1-0 ఆధిక్యంతోనే ప్రథమార్ధాన్ని ముగించిన అర్జెంటీనా.. రెండో అర్ధంలో దూకుడు పెంచుతుందనుకుంటే అయిదు నిమిషాల వ్యవధిలో సౌదీ కొట్టిన రెండు గోల్స్‌తో ఆత్మరక్షణలో పడిపోయింది. ఆ తర్వాత స్కోరు సమం చేయడానికి అర్జెంటీనా తీవ్రంగానే ప్రయత్నించింది. కానీ గోల్‌ పోస్టు ముందు గోడలా నిలబడ్డ అల్‌-ఒవైస్‌ ఆ జట్టుకు ఆశలపై నీళ్లు చల్లాడు. 63వ నిమిషంలో సౌదీ బాక్స్‌లోకి చొచ్చుకెళ్లిన అర్జెంటీనా ఆటగాళ్లు దాదాపు స్కోరు సమం చేసినట్లే కనిపించారు. నికోలస్‌ టాగ్లియాఫికో కొట్టిన షాట్‌కు నెట్‌ లోపలికి వెళ్లినట్లే కనిపించిన బంతిని అల్‌-ఒవైస్‌ అద్భుత రీతిలో ఆపేశాడు. అంతకంతకూ ఒత్తిడి పెరిగిపోయినా అర్జెంటీనా ప్రయత్నాలు ఆపలేదు. కానీ ఆధిక్యాన్ని కాపాడుకోవడానికి సౌదీ ఆటగాళ్లు ప్రాణం పెట్టి ఆడారు. ఇంజురీ టైం చివరి నిమిషాల్లో అర్జెంటీనా గోల్‌ అవకాశాన్ని సృష్టించుకుంది. అల్వారెజ్‌ గోల్‌కు గురి  పెట్టి బంతిని కొట్టాడు. కానీ మరోసారి  అల్‌-ఒవైస్‌ అడ్డం పడడంతో అర్జెంటీనాకు దారులు మూసుకుపోయాయి. తుది విజిల్‌ మోగగానే అర్జెంటీనా ఆటగాళ్లు నిరాశతో కూలబడిపోగా.. సౌదీ ఆటగాళ్లు, అభిమానుల సంబరాలతో స్టేడియం హోరెత్తిపోయింది.

ఒకదాన్ని మించి ఒకటి..

అర్జెంటీనాపై సౌదీ విజయాన్ని గాలివాటంగా కొట్టిపారేయలేం. ఎటాకింగ్‌, డిఫెన్స్‌లో ఆ జట్టు ఆటగాళ్లు తమ నైపుణ్యం చూపించారు. సౌదీని తక్కువగా అంచనా వేసిన అర్జెంటీనా రక్షణ శ్రేణి భారీ మూల్యమే చెల్లించుకుంది. 48వ నిమిషంలో మైదానం మధ్య నుంచి పాస్‌ అందుకున్న సాలే అల్‌షెహ్రి తన ముందున్న డిఫెండర్‌తో పాటు అర్జెంటీనా గోల్‌ కీపర్‌ను తప్పిస్తూ నెట్‌లోకి బంతిని పంపి స్కోరు సమం చేస్తూ సౌదీని సంబరాల్లో ముంచెత్తాడు. ఈ గోల్‌ సమయంలో అర్జెంటీనా డిఫెన్స్‌ పూర్తిగా తేలిపోయింది. 53వ నిమిషంలో సలేం అల్దావ్‌సరి కొట్టిన గోల్‌ అతడి అద్భుత నైపుణ్యాన్ని చాటేదే. తన సహచరుడు చేసిన గోల్‌ ప్రయత్నం విఫలమై, బంతి రీబౌండ్‌ అయ్యాక బంతి చుట్టూ ప్రత్యర్థి ఆటగాళ్లు మూగి ఉన్నప్పటికీ వారికి చిక్కకుండా చాకచక్యంగా అందుకున్న అల్దావ్‌సరి.. నలుగురు డిఫెండర్లను తప్పించి గోల్‌ పోస్టులోకి కళ్లు చెదిరే షాట్‌ ఆడాడు. దూరం నుంచి అనూహ్యంగా దూసుకొచ్చిన బంతిని ఆపలేక అర్జెంటీనా గోల్‌ కీపర్‌ కూడా చేతులెత్తేయడంతో సౌదీ ఆధిక్యంలోకి వెళ్లింది.

1990లో ఇలాగే..

సౌదీ చేతిలో అనూహ్య పరాజయంతో షాక్‌లో ఉన్న అర్జెంటీనాకు చరిత్ర కొంచెం ఆశలు రేపేదే. 1990లో మారడోనా నేతృత్వంలోని అర్జెంటీనా.. కామెరూన్‌ చేతిలో ఇలాగే 0-1 తేడాతో షాక్‌ తింది. అయితే ఆ టోర్నీలో తర్వాత చక్కటి ప్రదర్శనతో ఫైనల్‌ చేరింది. ఇప్పుడు కూడా అలాగే తమ జట్టు పుంజుకుంటుందని అర్జెంటీనా అభిమానులు ఆశిస్తున్నారు. సౌదీ చేతిలో ఓడినా మెస్సి జట్టుకు దారులేమీ మూసుకుపోలేదు. గ్రూప్‌లో మిగతా రెండు మ్యాచ్‌ల్లో ఆ జట్టు మెక్సికో, పోలెండ్‌లను ఓడిస్తే ముందంజ వేస్తుంది. ఆ రెండు మ్యాచ్‌ల్లో ఒకటి నెగ్గి, ఇంకోటి డ్రా అయినా అర్జెంటీనా నాకౌట్‌ చేరడానికి అవకాశముంటుంది కానీ, అప్పుడు మిగతా మ్యాచ్‌ల సమీకరణాల మీద ఆధారపడాల్సి ఉంటుంది.


కప్‌లో సంచలనాలు

క్రికెట్లో కూనలు పెద్ద జట్లకు షాక్‌లు ఇవ్వడం తరుచూ చూస్తూనే ఉంటాం. కానీ ఫుట్‌బాల్‌లో అలా కాదు. సంచలనాలు అరుదే. ప్రపంచకప్‌లో ప్రకంపనలు రేపిన కొన్ని విజయాలు..

1950
అమెరికా 1 ఇంగ్లాండ్‌ 0

ఈ కప్పులో ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లాండ్‌కు పెద్దగా పేరులేని ఆటగాళ్లున్న అమెరికా గట్టి షాక్‌ ఇచ్చింది. గ్రూప్‌ పోరులో జో గెట్‌జెన్స్‌ చేసిన ఏకైక గోల్‌ ఇంగ్లిష్‌ అభిమానులను వేదనలోకి నెట్టింది. ఈ టోర్నీ తొలి దశలోనే ఇంగ్లాండ్‌ ఇంటిముఖం పట్టింది.

1966
ఉత్తర కొరియా 1 ఇటలీ 0

ఈ కప్పులో బలమైన ఇటలీని టోర్నీ నుంచి బయటకు పంపింది. లీగ్‌ మ్యాచ్‌లో ఉత్తర కొరియా. పాక్‌డూ ఇక్‌ చేసిన గోల్‌ ఇటలీ కొంపముంచింది. ఆ తర్వాత స్వదేశానికి వచ్చిన ఆ జట్టుపై అభిమానులు టమాటాలతో దాడి చేశారు.

1982
అల్జీరియా 2 జర్మనీ 1

తొలిసారి ఫిఫా ప్రపంచకప్‌ ఆడిన అల్జీరియా ఓ పెను సంచలనం సృష్టించింది. లీగ్‌ మ్యాచ్‌లో పశ్చిమ జర్మనీపై రబా, లఖ్‌దార్‌ గోల్స్‌ కొట్టడంతో అల్జీరియా 2-1తో ప్రత్యర్థికి షాకిచ్చింది. కానీ ఆ తర్వాత పుంజుకుని జర్మనీ ఎలాగోలా నాకౌట్‌ చేరింది.

2002
సెనెగల్‌ 1  ఫ్రాన్స్‌ 0

1998లో ప్రపంచకప్‌ గెలిచి.. 2000 యూరో ఛాంప్‌గా నిలిచిన ఫ్రాన్స్‌కు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది సెనెగల్‌. 2002 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లోనే సంచలనం నమోదైంది. అసాధారణంగా ఆడిన సెనెగల్‌ 1-0తో ఫ్రాన్స్‌ను ఓడించి ప్రకంపనలు రేపింది. ఈ ఓటమితో ఫ్రాన్స్‌ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది.

అర్జెంటీనా1
సౌదీ ఆరేబియా2


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని