జర్మనీకి జపాన్‌ దెబ్బ

ఫుట్‌బాల్‌ ప్రపంచం అర్జెంటీనాకు సౌదీ అరేబియా ఇచ్చిన షాక్‌ నుంచి ఇంకా తేరుకోలేదు. ఆ సంచలనం నమోదై ఒక్క రోజైనా గడవలేదు. అందరూ ఇంకా ఆ ఓటమి గురించి చర్చించుకుంటుండగానే మరో పెను సంచలనం! అచ్చంగా ముందు రోజు అర్జెంటీనాను సౌదీ ఎలా అయితే ఓడించిందో అదే రీతిలో జర్మనీకి దిమ్మదిరిగే షాకిచ్చింది జపాన్‌.

Published : 24 Nov 2022 02:21 IST

జర్మనీ 1 జపాన్‌ 2
ప్రపంచకప్‌లో మరో సంచలనం
నాలుగుసార్లు ఛాంపియన్‌కు షాక్‌
దోహా

ఫుట్‌బాల్‌ ప్రపంచం అర్జెంటీనాకు సౌదీ అరేబియా ఇచ్చిన షాక్‌ నుంచి ఇంకా తేరుకోలేదు. ఆ సంచలనం నమోదై ఒక్క రోజైనా గడవలేదు. అందరూ ఇంకా ఆ ఓటమి గురించి చర్చించుకుంటుండగానే మరో పెను సంచలనం! అచ్చంగా ముందు రోజు అర్జెంటీనాను సౌదీ ఎలా అయితే ఓడించిందో అదే రీతిలో జర్మనీకి దిమ్మదిరిగే షాకిచ్చింది జపాన్‌. ముందు గోల్‌ సమర్పించుకుని వెనుకబడ్డ జపాన్‌.. ఆఖర్లో అద్భుతంగా పుంజుకుని రెండు మెరుపు గోల్స్‌తో జర్మనీ కొంప ముంచేసింది. 2018లోనూ ఇలాగే ఆరంభంలో షాక్‌ తిని తొలి రౌండ్లోనే ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించిన జర్మనీ.. ప్రమాదకర గ్రూప్‌-ఈ నుంచి ఈసారైనా ముందంజ వేస్తుందో లేదో చూడాలి.

కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగుసార్లు ప్రపంచకప్‌ గెలిచిన చరిత్ర జర్మనీది. ఆరుసార్లు ప్రపంచకప్‌ ఆడి ఒక్కసారి కూడా ప్రిక్వార్టర్స్‌ దాటని జట్టు జపాన్‌. ఇలాంటి ప్రత్యర్థుల మధ్య మ్యాచ్‌ అంటే ఏకపక్షమే అని, జర్మనీ ముందు జపాన్‌ అసలు నిలవలేదని అనుకుంటారంతా! అయితే బుధవారం ఆటలో ఆధిపత్యం చలాయించినా.. గోల్స్‌ కొట్టడంలో వెనుకబడ్డ జర్మనీ 1-2తో జపాన్‌ చేతిలో అనూహ్య పరాజయం చవిచూసింది. ముందు రోజు అర్జెంటీనా మాదిరే మ్యాచ్‌లో తొలి గోల్‌, అది కూడా పెనాల్టీ ద్వారానే సాధించిన జర్మనీ.. ద్వితీయార్ధంలో జపాన్‌ జోరుకు తలవంచింది. ఏడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ కొట్టిన జపాన్‌.. చివరిదాకా ఆధిక్యాన్ని నిలబెట్టుకుని మ్యాచ్‌ను ఎగరేసుకుపోయింది.

అలా మొదలై..: ఈ మ్యాచ్‌ ఆరంభమైన తీరు, ప్రథమార్ధంలో జర్మనీ దూకుడు చూశాక చివరికి ఫలితం అలా ఉంటుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. బంతిని చాలా వరకు తన అధీనంలోనే ఉంచుకున్న జర్మనీ ఆటగాళ్లు తరచుగా గోల్‌ దాడులు చేశారు. 33వ నిమిషంలో జపాన్‌ గోల్‌ కీపర్‌ షుచి గోండా తప్పిదంతో జర్మనీకి పెనాల్టీ లభించింది. ఇకాయ్‌ గుండోగన్‌ ఎలాంటి తప్పిదం చేయకుండా నెట్‌లోకి బంతిని పంపి జర్మనీని ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత కూడా జర్మనీ జోరు కొనసాగింది. అయితే జపాన్‌ గోల్‌ కీపర్‌, డిఫెండర్లు ఎంతో పట్టుదలతో ఆడి గోల్‌ ప్రయత్నాలను ఆపారు. ద్వితీయార్ధంలో జర్మనీ డిఫెండర్లు కొంత నిర్లక్ష్యంగా ఉండడంతో అదను చూసి జపాన్‌ ఆటగాళ్లు దాడి చేశారు. 76వ నిమిషంలో మినామినో చేసిన గోల్‌ ప్రయత్నాన్ని జర్మనీ గోల్‌ కీపర్‌ న్యూర్‌ సమర్థంగానే అడ్డుకోగా.. రీబౌండ్‌ అయిన బంతిని చాకచక్యంగా డొవాన్‌ గోల్‌లోకి పంపి జర్మనీని షాక్‌కు గురి చేశాడు. తర్వాత 83వ నిమిషంలో అసానో ప్రత్యర్థికి ఇంకా పెద్ద షాక్‌ ఇచ్చాడు. గోల్‌ పోస్టుకు కుడివైపు నెట్‌కు సమీపంలో బంతిని దొరకబుచ్చుకున్న అసానో.. తన ఎదురుగా ఉన్న నికోతో పాటు గోల్‌కీపర్‌ న్యూర్‌ను కూడా బోల్తా కొట్టిస్తూ కళ్లు చెదిరే గోల్‌ కొట్టాడు. దీంతో జపాన్‌ సంబరాలకు అంతే లేకపోయింది. ఇక్కడి నుంచి జపాన్‌ గోల్‌ కీపర్‌, రక్షణ శ్రేణి ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తూ జర్మనీ ప్రయత్నాలను సమర్థంగా అడ్డుకుంది. ఇంజురీ సమయంలోనూ జర్మనీ కష్టం ఫలించకపోవడంతో జపాన్‌ జట్టు ఆనందానికి అవధుల్లేకపోయాయి.


ఆ ఇద్దరూ అక్కడ ఆడేవాళ్లే..

బుధవారం సంచలన గోల్స్‌తో జర్మనీకి పరాభవాన్ని మిగిల్చిన జపాన్‌ ఆటగాళ్లు ఇద్దరూ జర్మనీతో సంబంధం ఉన్నవాళ్లే కావడం విశేషం. డొవాన్‌, అసానో క్లబ్‌ ఫుట్‌బాల్‌ ఆడేది జర్మనీలోనే. డొవాన్‌ ఫ్రీబర్గ్‌ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. అసానో బొచుమ్‌కు ఆడుతున్నాడు. అందువల్లే జర్మనీ శైలి, ఆటగాళ్లపై వారికి బాగా అవగాహన ఉందని.. గోల్స్‌ కొట్టడంలో వారికి అదే తోడ్పడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


74 శాతం నియంత్రణ.. అయినా!

1-2తో ఓడింది కదా అని ఈ మ్యాచ్‌లో జర్మనీ పేలవంగా ఆడిందనుకుంటే పొరపాటే. మ్యాచ్‌లో 74 శాతం బంతి మీద నియంత్రణ సాధించిందా జట్టు. బంతి 26 శాతం మాత్రమే జపాన్‌ నియంత్రణలో ఉంది. గోల్‌ దాడులు కూడా జర్మనీనే ఎక్కువ చేసింది. ఆ జట్టు 24 సార్లు గోల్‌ కోసం ప్రయత్నించింది. కానీ పెనాల్టీ ద్వారా వచ్చిన ఒక్క గోల్‌ మాత్రమే ఆ జట్టు ఖాతాలో చేరింది. జపాన్‌ 11 సార్లే గోల్‌ కోసం ప్రయత్నించినప్పటికీ రెండుసార్లు విజయవంతం అయింది.


అటు ఆట.. ఇటు శుభ్రత

ర్మనీపై సంచలన విజయంతో మైదానంలో జపాన్‌ ఆటగాళ్లు, స్టాండ్స్‌లో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. కానీ అది కొద్దిసేపే. స్టేడియం ఖాళీ అవగానే జపాన్‌ ప్రేక్షకులు తమ పనిలో పడిపోయారు. అటు జట్టు ఆటతీరుతో అదరగొడితే.. ఇటు ఆ దేశ అభిమానులు స్టాండ్స్‌లో చెత్తను తొలగించి మరోసారి ఆకట్టుకున్నారు. ప్రేక్షకులు వాడి పారేసిన నీళ్లు, శీతల పానీయాల సీసాలు, ఆహార పదార్ధాల కవర్లు.. ఇలా అక్కడి చెత్తను ఏరి మైదాన సిబ్బందికి సాయం చేశారు. ఇతరులు అక్కడే వదిలి వెళ్లిపోయిన జాతీయ పతాకాలనూ గౌరవంగా తీసి పక్కనపెట్టారు. ఈ ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లోనూ జపాన్‌ అభిమానులు స్టాండ్స్‌ను శుభ్రం చేసి మంచి మనసు చాటుకున్నారు. గత ప్రపంచకప్‌లోనూ వీళ్లు ఇలాగే వ్యవహరించిన సంగతి తెలిసిందే.


2018లోనూ ఇలాగే..

2014లో అద్భుత ప్రదర్శనతో ప్రపంచకప్‌ను ఖాతాలో వేసుకున్న జర్మనీకి నాలుగేళ్ల తర్వాత ఘోర పరాభవం ఎదురైంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆ జట్టు.. గ్రూప్‌ దశ రెండో మ్యాచ్‌లో దక్షిణ కొరియా చేతిలో 0-2తో కంగుతింది. ఆ ఓటమి దెబ్బకు నాకౌట్‌ చేరకుండా గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది. గత టోర్నీ కంటే ఈసారి కొంత బలహీన పడ్డ జర్మనీ ఫేవరెట్ల జాబితాలో లేదు. అయితే కనీసం క్వార్టర్స్‌ వరకు వస్తుందని, అదృష్టం కలిసొస్తే ఇంకా ముందుకు వెళ్లగలదని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ ఆ జట్టు మరోసారి గ్రూప్‌ దశలోనే నిష్క్రమించే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. గ్రూప్‌లో మరో మ్యాచ్‌లో స్పెయిన్‌ అలవోకగా కోస్టారికాను ఓడించింది. స్పెయిన్‌ జోరు చూస్తే తీవ్ర ఒత్తిడిలో ఉన్న జర్మనీ తర్వాతి మ్యాచ్‌లో ఆ జట్టును ఓడించడం అంత తేలిక కాదు. నాకౌట్‌ రేసులో ఉండాలంటే కనీసం ఆ మ్యాచ్‌ను డ్రా చేసుకోవాలి. అప్పుడు కూడా జపాన్‌ను స్పెయిన్‌, కోస్టారికా ఓడించి.. కోస్టారికాపై జర్మనీ నెగ్గితేనే ఆ జట్టుకు అవకాశముంటుంది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని