వన్డేలకు వేళాయె

టీ20 ప్రపంచకప్‌ హడావుడి ముగిసింది. ఇక వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌పై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చేసింది. సొంతగడ్డపై జరిగే ఈ మెగా టోర్నీకి జట్టు కూర్పు, ఆటగాళ్ల ఎంపిక దిశగా టీమ్‌ఇండియా సన్నాహకాలకు తరుణం ఆసన్నమైంది.

Updated : 25 Nov 2022 06:40 IST

నేడు కివీస్‌తో భారత్‌ తొలి మ్యాచ్‌
ఉదయం 7 గంటల నుంచి

టీ20 ప్రపంచకప్‌ హడావుడి ముగిసింది. ఇక వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌పై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చేసింది. సొంతగడ్డపై జరిగే ఈ మెగా టోర్నీకి జట్టు కూర్పు, ఆటగాళ్ల ఎంపిక దిశగా టీమ్‌ఇండియా సన్నాహకాలకు తరుణం ఆసన్నమైంది. న్యూజిలాండ్‌తో సిరీస్‌తో కసరత్తులు షురూ. నేడే తొలి వన్డే. ఓ వైపు బలంగా ఉన్న ప్రత్యర్థి.. మరోవైపు ధావన్‌ సారథ్యంలోని యువ భారత్‌. రసవత్తర పోరు ఖాయం.

వర్షం ప్రభావం చూపిన టీ20 సిరీస్‌ను 1-0తో గెలుచుకున్న టీమ్‌ఇండియా.. న్యూజిలాండ్‌ గడ్డపై మరో సమరానికి సిద్ధమైంది. ఈసారి ఫార్మాట్‌ మారింది.. కెప్టెన్‌ మారాడు. ధావన్‌ సారథ్యంలోని భారత్‌ మూడు వన్డేల సిరీస్‌లో కివీస్‌ను ఢీ కొడుతోంది. శుక్రవారమే తొలి మ్యాచ్‌. రోహిత్‌ శర్మ, కోహ్లి, కేఎల్‌ రాహుల్‌, బుమ్రా, జడేజా, హార్దిక్‌, భువనేశ్వర్‌ లేకుండానే బరిలో దిగుతున్న భారత్‌.. ఎలాంటి ప్రదర్శన చేస్తుందనేది ఆసక్తికరం. మరో 11 నెలల్లో స్వదేశంలో వన్డే ప్రపంచకప్‌ నేపథ్యంలో భారత్‌తో పాటు న్యూజిలాండ్‌ కూడా ఈ సిరీస్‌తోనే సన్నాహకాలు మొదలెట్టనున్నాయి. ముఖ్యంగా మిడిలార్డర్‌ను పటిష్ఠపర్చుకోవడంతో పాటు మెరుగైన బౌలింగ్‌ ప్రత్యామ్నాయాలపై భారత్‌ దృష్టి పెట్టనుంది.

అయినా బలంగానే..: అగ్రశ్రేణి ఆటగాళ్లు లేకపోయినా టీమ్‌ఇండియా బలంగానే ఉంది. కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న ధావన్‌కు మరోసారి సత్తాచాటేందుకు ఈ సిరీస్‌ మంచి అవకాశం. అటు సారథిగా.. ఇటు బ్యాటర్‌గా నిరూపించుకోవాలనే పట్టుదలతో అతనున్నాడు. మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఈ ఏడాది వన్డేల్లో నిలకడగా రాణిస్తున్నాడు. 2022లో ఇప్పటివరకూ 9 మ్యాచ్‌ల్లో 75.71 సగటుతో 530 పరుగులు చేశాడు. ధావన్‌, గిల్‌ జోడీ ఎనిమిది వన్డేల్లో మూడు సార్లు శతక భాగస్వామ్యాలు నమోదు చేయడం విశేషం. ఆ తర్వాత శ్రేయస్‌, సూర్యకుమార్‌, పంత్‌, దీపక్‌ హుడా, వాషింగ్టన్‌ సుందర్‌తో బ్యాటింగ్‌ ఆర్డర్‌ పటిష్ఠంగా ఉంది. దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌ కూడా బ్యాటింగ్‌ చేయగల సామర్థ్యం ఉన్నవాళ్లే కావడంతో లోతు కూడా ఎక్కువగా ఉంది. టీ20ల్లో ధనాధన్‌ ఆటతీరుతో అదరగొడుతున్న సూర్యకుమార్‌ వన్డేల్లో ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి. ఆరో బౌలింగ్‌ ప్రత్యామ్నాయంగా దీపక్‌ హుడా పనికొస్తాడు కాబట్టి మరోసారి శాంసన్‌ డగౌట్‌కే పరిమితమవక తప్పదు. దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ పేస్‌ భారాన్ని మోయనున్నారు. అర్ష్‌దీప్‌ వన్డే అరంగేట్రం చేయనున్నాడు. కుల్‌దీప్‌ కంటే కూడా చాహల్‌ను ఆడించే అవకాశాలు మెండు. చిన్న స్టేడియంలో బ్యాటర్లను మన బౌలర్లు  ఏ మేరకు కట్టడి చేస్తారన్న దానిపైనే  విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

దెబ్బ కొట్టేందుకు..: టీ20 సిరీస్‌ను కోల్పోయిందని వన్డేల్లో న్యూజిలాండ్‌ను ఏ మాత్రం తక్కువ చేయలేం. ఈ ఫార్మాట్లో ప్రపంచ నంబర్‌వన్‌గా కొనసాగుతున్న ఆ జట్టు.. టీమ్‌ఇండియాను దెబ్బకు దెబ్బ తీయాలనే ధ్యేయంతో ఉంది. మ్యాచ్‌లో ఆతిథ్య జట్టే ఫేవరెట్‌. 2020లో ఇలాగే మొదట 0-5తో టీ20 సిరీస్‌ కోల్పోయిన ఆ జట్టు.. అనంతరం వన్డేల్లో 3-0తో భారత్‌ను వైట్‌వాష్‌ చేసింది. అందుకే ప్రత్యర్థితో జాగ్రత్తగా ఉండాలి. చివరి టీ20కి దూరమైన కెప్టెన్‌ విలియమ్సన్‌ తిరిగి జట్టుతో చేరాడు. తనకు సరిగ్గా నప్పే వన్డే ఫార్మాట్లో చెలరేగాలని చూస్తున్నాడు. లేథమ్‌ రాకతో బ్యాటింగ్‌ ఆర్డర్‌ మరింత బలోపేతం కానుంది. మ్యాట్‌ హెన్రీ పేస్‌ విభాగం పదును పెంచనున్నాడు. అతనికి భారత్‌పై మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకూ 6 వన్డేల్లో 17.64 సగటుతో 14 వికెట్లు తీశాడు. మరోవైపు పరుగులు ఇవ్వడంలో పసినారి శాంట్నర్‌ వన్డే ఎకానమీ కేవలం 4.81 మాత్రమే. కివీస్‌లోని చిన్న మైదానాల్లోనూ అతను బ్యాటర్లను కట్టడి చేస్తున్నాడు.

జట్లు (అంచనా)... భారత్‌: ధావన్‌, శుభ్‌మన్‌, శ్రేయస్‌, సూర్యకుమార్‌, పంత్‌, దీపక్‌ హుడా, సుందర్‌, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌,   అర్ష్‌దీప్‌, చాహల్‌/కుల్‌దీప్‌.
న్యూజిలాండ్‌: అలెన్‌, కాన్వె, విలియమ్సన్‌, లేథమ్‌, మిచెల్‌, ఫిలిప్స్‌, నీషమ్‌, శాంట్నర్‌, సౌథీ, హెన్రీ, ఫెర్గూసన్‌.

పిచ్‌ ఎలా ఉంది?

రగ్బీ వేదిక కూడా అయిన ఈడెన్‌ పార్క్‌ మైదానం చిన్నగా ఉంటుంది. పిచ్‌ బౌలర్లకు ఎక్కువగా సహకరించొచ్చు. తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 217 పరుగులుగా ఉంది. కానీ పరిస్థితులకు అలవాటు పడితే భారీస్కోర్లు సాధ్యమే. చివరగా ఇక్కడ ఆడిన వన్డేలో భారత్‌ 22 పరుగుల తేడాతో ఓడింది. ఛేదన జట్టుకే విజయావకాశాలు ఎక్కువ. వర్షం పడే సూచనలు లేవు.


55

కివీస్‌తో ఆడిన 110 వన్డేల్లో టీమ్‌ఇండియా సాధించిన విజయాలు. 49 మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి గెలిచింది. ఓ మ్యాచ్‌ టై కాగా.. అయిదింట్లో ఫలితం తేలలేదు.


 

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని