బెల్జియం కష్టంగా..

ప్రపంచ నంబర్‌-2 బెల్జియం చెమటోడ్చింది. స్టార్లకు కొదువలేని ఈ జట్టు ఆరంభ మ్యాచ్‌లో అతికష్టం మీద కెనడాపై గెలిచింది

Published : 25 Nov 2022 02:22 IST

కెనడాపై 1-0తో విజయం

ప్రపంచ నంబర్‌-2 బెల్జియం చెమటోడ్చింది. స్టార్లకు కొదువలేని ఈ జట్టు ఆరంభ మ్యాచ్‌లో అతికష్టం మీద కెనడాపై గెలిచింది. బత్సువాయి బెల్జియంకు గోల్‌ను అందించగా.. ఓ పెనాల్టీని సేవ్‌ చేసిన గోల్‌కీపర్‌ తిబౌత్‌ కోర్టియస్‌ తన అద్భుత ప్రదర్శనతో ఆ జట్టు హీరోగా నిలిచాడు.

టోర్నీ ఫేవరెట్లలో ఒకటైన బెల్జియం ప్రపంచకప్‌లో బోణీ కొట్టింది. కానీ ఆ జట్టులో అసంతృప్తే ఎక్కువ. బెల్జియం అంచనాలను అందుకోలేకపోయింది. అగ్రశ్రేణి జట్టు అయ్యుండి కూడా.. 1986 తర్వాత తొలిసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న చిన్న జట్టు కెనడాపై స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. గ్రూప్‌-ఎఫ్‌లో ఆ జట్టు 1-0 విజయంతో సరిపెట్టుకుంది. బత్సువాయి (44వ నిమిషం) గోల్‌ బెల్జియంను గెలిపించినా.. కెనడా పోరాటం ఆకట్టుకుంది. ఆ జట్టుకు విజయానికి మధ్య ప్రధాన అడ్డంకి బెల్జియం గోల్‌కీపర్‌ కోర్టియసే. ఓ పెనాల్టీ సహా మూడు పెద్ద సేవ్‌లు చేసిన అతడు రెడ్‌ డెవిల్స్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెనడా ఎటాక్‌ అతడికి చాలా పని కల్పించింది. గోల్‌పై కెనడా 21 ప్రయత్నాలు చేయగా.. బెల్జియం కేవలం 9 ప్రయత్నాలే చేయగలిగింది.

సూపర్‌ కోర్టియస్‌: అత్యుత్తమ ఆటగాళ్లు జట్టులో ఉన్న  బెల్జియం.. గెలిచినా సంబరాలు చేసుకోవడానికి ఏమీ లేకపోయింది. ‘‘నేను బాగా ఆడానని అనుకోవట్లేదు. నాకెందుకు ‘ప్లేయర్‌ ద మ్యాచ్‌’ అవార్డు ఇచ్చారో అర్థం కావట్లేదు. బహుశా నా పేరు చూసి ఇచ్చారేమో’’ అని ఆ జట్టు స్టార్‌ ఆటగాడు డిబ్రుయిన్‌ వ్యాఖ్యానించాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అనూహ్యంగా గట్టి పోటీ ఇచ్చిన కెనడా.. కొన్నిసార్లు బెల్జియంపై పైచేయి సాధించింది కూడా. ఆ జట్టుకు ఆధిక్యంలోకి వెళ్లేందుకు పదో నిమిషంలోనే అద్భుతమైన అవకాశం దక్కింది. బెల్జియం ఆటగాడు కరాస్కో  బాక్స్‌ లోపల బంతిని చేత్తో తాకడంతో రిఫరీ కెనడాకు పెనాల్టీ ఇచ్చాడు. కానీ గొప్ప అవకాశాన్ని వృథా చేసిన స్టార్‌ ఆటగాడు అల్ఫాన్సో డేవిస్‌ కెనడాను తీవ్ర నిరాశకు గురి చేశాడు. ప్రపంచంలో అత్యుత్తమ గోల్‌కీపర్లలో ఒకడైన కోర్టియస్‌.. అతడి స్పాట్‌ కిక్‌ను అడ్డుకున్నాడు. సరిగ్గా అంచనా వేసిన అతడు తన కుడివైపు దూకుతూ బంతిని ఆపాడు. 5-2-3 ఫామేషన్‌తో ఆడిన కెనడా ఆ తర్వాత కూడా . తన వేగంతో ప్రత్యర్థి రక్షణశ్రేణని ఒత్తిడికి గురి చేసింది. తొలి అర్ధభాగం ఆసాంతం కోర్టియస్‌ను తీరిక లేకుండా ఉంచింది. 30వ నిమిషంలో బాక్స్‌ లోపలి నుంచి జాన్సన్‌ కొట్టిన షాట్‌ను కోర్టియస్‌ సేవ్‌ చేశాడు. కానీ బెల్జియం మొత్తంగా వెనుకబడ్డా.. 44వ నిమిషంలో బత్సువాయి చురుకైన గోల్‌తో అనూహ్యంగా ఆధిక్యంలోకి దూసుకెళ్లగలిగింది.

కెనడా డిఫెన్స్‌ మీద నుంచి అల్డర్‌వీరెల్డ్‌ ఇచ్చిన లాంగ్‌ బాల్‌ను అందుకున్న అతడు.. దాన్ని అలవోకగా నెట్లోకి కొట్టాడు. రెండో అర్ధభాగం నువ్వా నేనా అన్నట్లు సాగింది. రెండు జట్లూ అవకాశాలు సృష్టించుకున్నా స్కోరు చేయలేకపోయాయి. 80వ నిమిషంలో లారిన్‌ (కెనడా) హెడర్‌ను కోర్టియస్‌ తన కుడి వైపు దూకుతూ రెండు చేతులతో ఒడిసిపట్టుకున్నాడు. ‘‘ప్రపంచ వేదికపై ఆడేందుకు అర్హులమని మా ఆటగాళ్లు చాటుకున్నారు’’ అని మ్యాచ్‌ అనంతరం కెనడా కోచ్‌ హెర్డ్‌మాన్‌ వ్యాఖ్యానించాడు. ‘‘మేము మాలా ఆడకున్నా గెలిచినందుకు సంతోషంగా ఉంది’’ అని బెల్జియం కోచ్‌ మార్టినెజ్‌ అన్నాడు. ఆరేళ్ల కింద జట్టు కోచ్‌గా తాను బాధ్యతలు స్వీకరించాక సాంకేతికంగా బెల్జియం జట్టు అత్యంత పేలవ ప్రదర్శన ఇదేనని అతడు అభిప్రాయపడ్డాడు. గాయం కారణంగా స్టార్‌ స్ట్రైకర్‌ లుకాకు ఈ మ్యాచ్‌లో ఆడలేకపోవడం బెల్జియంకు ప్రతికూలమైంది. లుకాకు గ్రూప్‌ దశ మొత్తానికి దూరమయ్యేలా ఉన్నాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని