సంక్షిప్త వార్తలు (6)

ప్రపంచ యూత్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. స్పెయిన్‌లో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఏడుగురు భారత క్రీడాకారులు ఫైనల్లోకి దూసుకెళ్లారు

Updated : 25 Nov 2022 03:20 IST

ఫైనల్లో ఏడుగురు బాక్సర్లు

దిల్లీ: ప్రపంచ యూత్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. స్పెయిన్‌లో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఏడుగురు భారత క్రీడాకారులు ఫైనల్లోకి దూసుకెళ్లారు. పురుషుల విభాగంలో వంశజ్‌ (63.5 కేజీ), విశ్వనాథ్‌ సురేశ్‌ (48 కేజీ), ఆశిష్‌ (54 కేజీ).. మహిళల్లో కీర్తి (ప్లస్‌ 81 కేజీ), భావన శర్మ (48 కేజీ), దేవిక (52 కేజీ), రవీన (63 కేజీ) ఫైనల్‌ చేరుకుని కనీసం రజత పతకాలు ఖాయం చేసుకున్నారు. సెమీస్‌లో విశ్వనాథ్‌ 4-1తో జువానా లోపెజ్‌ (ప్యూర్టోరికో)పై, వంశజ్‌ 3-2తో క్రాక్లెమ్‌ (అమెరికా)పై, ఆశిష్‌ 4-3తో ఖుజానజర్‌ (ఉజ్బెకిస్తాన్‌)పై విజయం సాధించారు. మహిళల సెమీస్‌లో కీర్తి 3-2తో ఆసెల్‌ (కజకిస్తాన్‌)పై, రవీనా 5-0తో తానాతర్‌ (కజకిస్తాన్‌)పై, భావన 5-0తో గుల్నాజ్‌ (కజకిస్తాన్‌)పై, దేవిక 4-1తో ఆమీదా జాయ్‌ (అమెరికా)పై గెలుపొందారు. తమన్నా (50 కేజీ), కుంజారాణి దేవి (60 కేజీ), ముస్కాన్‌ (75 కేజీ), లషు యాదవ్‌ (70 కేజీ) సెమీస్‌లో ఓడి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు.


సెమీస్‌లో భారత్‌ ఓటమి

జెరుసలెం: ఫిడె ప్రపంచ టీమ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ కథ ముగిసింది. గురువారం సెమీఫైనల్లో మన జట్టు 1.5-2.5తో ఉజ్బెకిస్థాన్‌ చేతిలో పరాజయం చవిచూసింది. తొలి రెండు గేముల్లో యెకొబొవ్‌ చేతిలో విదిత్‌ గుజరాతి.. సిందరోవ్‌ చేతిలో నిహాల్‌ సరీన్‌ తలొంచారు. ఆ తర్వాత షంషుద్దీన్‌పై నారాయణన్‌ గెలిచినా..వొకిదోవ్‌ జహంగీర్‌తో తప్పక గెలవాల్సిన పోరులో శశికిరణ్‌ డ్రా చేసుకోవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. అంతకుముందు క్వార్టర్స్‌లో టై బ్రేకర్‌లో భారత్‌ 2.5-1.5తో ఫ్రాన్స్‌పై నెగ్గింది.


చెన్నయిన్‌కు సెల్ఫ్‌గోల్‌ దెబ్బ

భువనేశ్వర్‌: చెన్నయిన్‌ ఎఫ్‌సీని సెల్ఫ్‌గోల్‌ దెబ్బతీసింది. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ తొమ్మిదో సీజన్‌లో గురువారం మ్యాచ్‌లో ఆ జట్టు 2-3 తేడాతో ఒడిషా ఎఫ్‌సీ చేతిలో ఓడింది. 31వ నిమిషంలో ప్రత్యర్థి గోల్‌ ప్రయత్నాన్ని ఆపబోయి.. చెన్నయిన్‌ ఆటగాడు హకమనేషి తమ గోల్‌పోస్టులోకే బంతిని పంపించాడు. దీంతో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లిన ఒడిషాకు.. ఆ తర్వాత మారిసియో (49వ), నంద (90వ) చెరో గోల్‌ అందించారు. చెన్నయిన్‌ తరపున ఖయాతి (60వ, 90వ) రెండు గోల్స్‌ కొట్టిన ఫలితం లేకపోయింది. ఆ సెల్ఫ్‌గోల్‌ జట్టు కొంపముంచింది.


భారత్‌తో సిరీస్‌కు బంగ్లా వన్డే జట్టులో షకిబ్‌

ఢాకా: స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ బంగ్లాదేశ్‌ వన్డే జట్టులోకి తిరిగొచ్చాడు. భారత్‌తో సొంతగడ్డపై జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు అతడు ఎంపికయ్యాడు. జులై-ఆగస్టులో జింబాబ్వేలో పరిమిత ఓవర్ల పర్యటనకు అతడు దూరంగా ఉన్నాడు. బంగ్లాదేశ్‌ చివరి వన్డే సిరీస్‌ అదే. ఇప్పుడు భారత్‌తో డిసెంబరు 4న ఆరంభమయ్యే సిరీస్‌కు తమిమ్‌ ఇక్బాల్‌ బంగ్లా కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.
బంగ్లాదేశ్‌ వన్డే జట్టు: తమిమ్‌ (కెప్టెన్‌), లిటన్‌ దాస్‌, అనాముల్‌ హక్‌, షకిబ్‌, ముష్ఫికర్‌, అఫిఫ్‌, యాసిర్‌ అలీ, మెహదీ హసన్‌, ముస్తాఫిజుర్‌, తస్కిన్‌, హసన్‌ మహమూద్‌, ఎబాదత్‌, నసూమ్‌ అహ్మద్‌, మహ్మదుల్లా, నజ్ముల్‌, ఖాజి.


అప్పుడు బాధపడలేదు: ధావన్‌

ఆక్లాండ్‌: జింబాబ్వే పర్యటనకు జట్టు పగ్గాల్ని తన నుంచి కేఎల్‌ రాహుల్‌కు అప్పగించడం బాధించలేదని టీమ్‌ఇండియా కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ అన్నాడు. రోహిత్‌శర్మ గైర్హాజరీలో వన్డే జట్టుకు ధావన్‌ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టులో జింబాబ్వేలో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం తొలుత ధావన్‌కు సారథ్యం అప్పగించారు. అయితే రాహుల్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడంతో సెలెక్షన్‌ కమిటీ ధావన్‌ను పక్కనబెట్టి అతడిని కెప్టెన్‌గా నియమించింది. ‘‘అప్పుడు నేను బాధపడలేదు. కొన్ని విషయాలు ముందే రాసిపెట్టి ఉంటాయి. ఏం జరిగినా అన్నీ మన మంచికే అని నమ్ముతా. జింబాబ్వే పర్యటన తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు మళ్లీ సారథినయ్యా. అదే సెలెక్షన్‌ కమిటీ నాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. కాబట్టి జింబాబ్వేలో జరిగిన దానికి నేను అస్సలు బాధపడలేదు. కెరీర్‌లో ఈ దశలో భారత్‌కు సారథ్యం వహించే అవకాశం లభించడం నా అదృష్టం’’ అని ధావన్‌ తెలిపాడు.


టీ20లకు కోచ్‌గా నెహ్రానే సరైనోడు: భజ్జీ

దిల్లీ: టీ20ల్లో భారత జట్టుకు ఆశిష్‌ నెహ్రా కోచ్‌గా ఉంటే మంచిదని మాజీ ఆటగాడు హర్భజన్‌ సింగ్‌ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ను తాను అగౌవరపరచట్లేదని.. కానీ టీ20 లాంటి క్లిష్టమైన ఫార్మాట్‌కు కోచ్‌గా నెహ్రా లాంటోడే సరైనోడని అతడన్నాడు. ‘‘ఇటీవల రిటైర్‌ అయిన ఆశిష్‌ నెహ్రా లాంటి వాళ్లే టీ20ల్లో భారత జట్టుకు కోచ్‌గా కావాలి. రాహుల్‌ద్రవిడ్‌కు ఎంతో అనుభవం ఉంది. తనతో ఎన్నో ఏళ్లు కలిసి ఆడా. నేనేమి ద్రవిడ్‌ను తక్కువ చేయట్లేదు కానీ టీ20 ఫార్మాట్లో కోచ్‌గా నెహ్రా లాంటి వాళ్లే సరైన ప్రత్యామ్నాయం. అలా అని ద్రవిడ్‌ను ఈ ఫార్మాట్‌కు కోచ్‌గా తప్పించమని అనట్లేదు. 2024 ప్రపంచకప్‌కు పటిష్టమైన జట్టును తయారు చేయడానికి ఇద్దరు కలిసి పని చేయాలనేది నా ఉద్దేశం. అలాంటి ఏర్పాటు ఉంటే ఇప్పుడు న్యూజిలాండ్‌ సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్నట్లే ప్రాధాన్యం లేని సిరీస్‌ల నుంచి ద్రవిడ్‌ తప్పుకోవచ్చు’’ అని హర్భజన్‌ తెలిపాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్లో విజేతగా నిలిచిన గుజరాత్‌ టైటాన్స్‌కు నెహ్రా కోచ్‌గా వ్యవహరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని