ఈక్వెడార్‌ సూపర్‌

పెద్ద జట్లు ప్చ్‌..! చిన్న జట్లు సూపర్‌..! ఈ ఒరవడే కొనసాగుతోంది ఈసారి ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో.

Updated : 26 Nov 2022 02:33 IST

నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ డ్రా

దోహా: పెద్ద జట్లు ప్చ్‌..! చిన్న జట్లు సూపర్‌..! ఈ ఒరవడే కొనసాగుతోంది ఈసారి ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో. ఒకటో రెండు మ్యాచ్‌ల్లో అంటే ఏమో అనుకోవచ్చు కానీ.. కానీ ఇప్పటికే ఇలాంటి అనూహ్య ఫలితాలు అరడజను దాకా ఉన్నాయి. శుక్రవారం నెదర్లాండ్స్‌-ఈక్వెడార్‌ మ్యాచ్‌లోనూ ఊహించని ఫలితం వచ్చింది. పెద్ద జట్టయిన నెదర్లాండ్స్‌ సులువుగా మ్యాచ్‌ గెలిచేస్తుందని అనుకుంటే.. ఈక్వెడార్‌ అంత తేలిగ్గా లొంగలేదు. దీంతో ఆ జట్టుతో గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ 1-1 డ్రాతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. సెనగల్‌పై గత మ్యాచ్‌లో చక్కటి హెడర్‌ గోల్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన గాక్పో ఈ మ్యాచ్‌లోనూ సత్తా చాటుతూ ఆరో నిమిషంలోనే గోల్‌ కొట్టడంతో నెదర్లాండ్స్‌ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత కూడా ఆ జట్టు గోల్‌ దాడులు కొనసాగించినా.. ఆధిక్యం మాత్రం పెరగలేదు. ద్వితీయార్ధం మొదలవగానే ఈక్వెడార్‌ పెద్ద షాకే ఇచ్చింది. ఖతార్‌తో తొలి మ్యాచ్‌లో డబుల్‌ గోల్‌తో అదరగొట్టిన వాలెన్సియా.. మళ్లీ ఈక్వెడార్‌ జట్టులో హీరోగా మారాడు. 49వ నిమిషంలో అతను కొట్టిన గోల్‌తో స్కోరు సమం కావడంతో డచ్‌ జట్టు షాక్‌కు గురైంది. ఆ తర్వాత ఆధిక్యం కోసం నెదర్లాండ్స్‌ తీవ్రంగా ఫలించినా ఫలితం లేకపోయింది. సమష్టిగా కదిలిన ఈక్వెడార్‌ ఆటగాళ్లు ఆ జట్టుకు గెలుపు గోల్‌ దక్కకుండా అడ్డుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని