ఇరాన్‌ అదుర్స్‌

స్వదేశంలో రాజకీయ గందరగోళ పరిస్థితులు, నిరసనలు, ఆందోళనలు.. ఇటు స్టేడియం బయటా ఉద్రిక్త వాతావరణం.. కానీ వీటన్నింటినీ దాటి మైదానంలో ఆటతో ఇరాన్‌ ఆకట్టుకుంది.

Updated : 26 Nov 2022 02:33 IST

అల్‌ రయాన్‌: స్వదేశంలో రాజకీయ గందరగోళ పరిస్థితులు, నిరసనలు, ఆందోళనలు.. ఇటు స్టేడియం బయటా ఉద్రిక్త వాతావరణం.. కానీ వీటన్నింటినీ దాటి మైదానంలో ఆటతో ఇరాన్‌ ఆకట్టుకుంది. శుక్రవారం 2-0 తేడాతో వేల్స్‌పై గెలిచి ప్రపంచకప్‌లో బోణీ కొట్టింది. అదనపు సమయంలో రూజ్‌బె చెష్మి (90+8వ నిమిషంలో) రమిన్‌ రెజాయిన్‌ (90+11వ) చెరో గోల్‌తో జట్టును గెలిపించారు. ప్రపంచకప్‌లో ఓ ఐరోపా జట్టుపై ఆ దేశానికిదే తొలి విజయం. హోరాహోరీగా సాగి.. నాటకీయ పరిణామాల మధ్య ముగిసిన మ్యాచ్‌లో ఇరాన్‌దే పైచేయి. తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో 2-6తో చిత్తయిన ఆ జట్టు.. ఈ గెలుపుతో నాకౌట్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. బంతిపై నియంత్రణ పరంగా చూస్తే ఇరాన్‌ (32 శాతం) కంటే వేల్స్‌ (48 శాతం) ఆధిపత్యం చలాయించింది. కానీ బంతి దొరికినప్పుడల్లా ప్రత్యర్థి గోల్‌పోస్టుపై దాడులు చేసేందుకు ఇరాన్‌ దూసుకెళ్లింది. 21 సార్లు గోల్‌ కోసం ప్రయత్నించగా.. అందులో ఆరు సార్లు గోల్‌పోస్టుకు సూటిగా బంతిని పంపించింది. చివరకు రెండు సార్లు సఫలమైంది. 86వ నిమిషంలో ఇరాన్‌ ఆటగాడు మెహదీ తరెమీని తన పరిధి దాటి వచ్చి ఢీ కొనడంతో రెఫరీ రెడ్‌కార్డుతో అతణ్ని బయటకు పంపించాడు. దీంతో వేల్స్‌ పది మందితోనే ఆడాల్సి రావడం ఇరాన్‌కు కలిసొచ్చింది. మ్యాచ్‌ ఆఖరి నిమిషాల్లో 20 గజాల దూరం నుంచి కళ్లుచెదిరే రీతిలో బంతిని నేరుగా నెట్‌లోకి పంపిన చెష్మి జట్టు ఖాతా తెరిచాడు. మరో మూడు నిమిషాలకే ప్రత్యర్థి డిఫెన్స్‌ను దాటి, గోల్‌ కీపర్‌ను బోల్తా కొట్టించి గోల్‌ చేసిన రెజాయిన్‌ ఇరాన్‌ ఆనందాన్ని రెట్టింపు చేశాడు.

అటు ఆట.. ఇటు ఆందోళన: ఫిఫా ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తోన్న ఖతార్‌.. ఇరాన్‌ అభిమానుల నిరసనలు, ఘర్షణలకూ వేదికగా నిలుస్తోంది. మహిళల హక్కులను అణిచివేస్తున్న తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రపంచకప్‌ సాక్షిగా ఇరాన్‌ ప్రజలు గొంతెత్తుతున్నారు. అందుకు సంఘీభావంగా ప్రపంచకప్‌లో తమ తొలి మ్యాచ్‌ (ఇంగ్లాండ్‌తో) సందర్భంగా జాతీయ గీతాలాపన సమయంలో మౌనంగా ఉన్న ఇరాన్‌ ఆటగాళ్లు.. శుక్రవారం వేల్స్‌తో మ్యాచ్‌కు ముందు మాత్రం పెదవి కలిపారు. అప్పుడే స్టేడియంలోని కొంతమంది అభిమానులు ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. మరోవైపు స్టేడియం బయట ఇరాన్‌ ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని