BRA vs SRB: కొట్టాడు కొత్త హీరో

ప్రపంచకప్‌లో బ్రెజిల్‌కు తొలి మ్యాచ్‌. ఫుట్‌బాల్‌ ప్రపంచం దృష్టంతా నెయ్‌మార్‌ మీదే. ప్రత్యర్థి జట్టు సెర్బియా కళ్లు కూడా అతగాడి పైనే. ప్రత్యర్థి ఉచ్చులో అతను బాగానే చిక్కుకున్నాడు.

Updated : 26 Nov 2022 10:00 IST

రిచర్లిసన్‌ మాయాజాలం
రెండు మెరుపు గోల్స్‌
నెయ్‌మార్‌ గాయపడ్డా బ్రెజిల్‌ పైచేయి

ప్రపంచకప్‌లో బ్రెజిల్‌కు తొలి మ్యాచ్‌. ఫుట్‌బాల్‌ ప్రపంచం దృష్టంతా నెయ్‌మార్‌ మీదే. ప్రత్యర్థి జట్టు సెర్బియా కళ్లు కూడా అతగాడి పైనే. ప్రత్యర్థి ఉచ్చులో అతను బాగానే చిక్కుకున్నాడు. గోల్‌ అవకాశాలు అంతంతమాత్రం. ఆడిన కొన్ని షాట్లు కూడా గురి తప్పాయి. పైగా నెయ్‌మార్‌ గాయపడి మైదానాన్ని వీడాడు. ఈ ప్రపంచకప్‌లో పెద్ద జట్లకు ఓటములు, డ్రాల రూపంలో వరుసగా షాక్‌లు తగులుతున్న నేపథ్యంలో బ్రెజిల్‌ పరిస్థితి ఏమవుతుందో అని అభిమానుల్లో ఆందోళన. కానీ అప్పుడే వచ్చాడు కొత్త హీరో. ఒకటి కాదు రెండు గోల్స్‌.. అది కూడా 9 నిమిషాల వ్యవధిలో. అందులోనూ గాల్లో పల్టీ కొడుతూ అతను కొట్టిన గోల్‌ అయితే మ్యాచ్‌కే కాదు.. ఈ ప్రపంచకప్‌కే హైలైట్‌! బ్రెజిల్‌కు శుభారంభాన్నందించిన ఆ కొత్త హీరోనే.. రిచర్లిసన్‌!

ఈసారి సాకర్‌ ప్రపంచకప్‌ హాట్‌ ఫేవరెట్‌ అయిన బ్రెజిల్‌ తొలి మ్యాచ్‌లో అంచనాలకు తగ్గ ప్రదర్శన చేయకపోయినా.. టోర్నీని విజయంతో ఆరంభించింది. శుక్రవారం గ్రూప్‌-జిలో ఆసక్తికరంగా సాగిన పోరులో ఈ మాజీ ఛాంపియన్‌ 2-0తో సెర్బియాను ఓడించింది. యువ ఆటగాడు రిచర్లిసన్‌ రెండు మెరుపు గోల్స్‌తో ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సెర్బియా గోల్‌కీపర్‌ మిలింకోవిచ్‌, ఆ జట్టు డిఫెండర్లు తమ శక్తికి మించి ఈ మ్యాచ్‌లో బ్రెజిల్‌ దాడులను అడ్డుకున్నారు. కచ్చితంగా గోల్‌ అయ్యేలా కనిపించిన మూడు ప్రయత్నాలను మిలింకోవిచ్‌ అడ్డుకున్నాడు. స్టార్‌ ఆటగాడు నెయ్‌మార్‌ను కట్టడి చేయడంలో సెర్బియా విజయవంతం అయింది. కానీ రిచర్లిసన్‌ ఆ జట్టుపై పిడుగులా పడ్డాడు. 63, 72 నిమిషాల్లో అతను కళ్లు చెదిరే రెండు ఫీల్డ్‌ గోల్స్‌తో బ్రెజిల్‌ను గెలిపించాడు.

ఆహా ఆ గోల్‌..: ఫుట్‌బాల్‌లో అత్యంత కిక్కునిచ్చే గోల్స్‌లో బైసికల్‌ కిక్‌ ఒకటి. కాళ్లు ముందు నుంచి పైకి లేపి, పూర్తిగా రివర్స్‌ తిరుగుతూ బంతిని కాలితో తంతూ స్కోర్‌ చేసే విన్యాసం చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే. పూర్తిస్థాయి బైసికల్‌ గోల్‌ కొట్టలేదు కానీ.. దానికి దగ్గరగా అనిపించే విన్యాసంతో రిచర్లిసన్‌ 72వ నిమిషంలో కొట్టిన గోల్‌ను లైవ్‌లో చూసిన వారిది అదృష్టమే. సహచరుడు విన్సియస్‌ జూనియర్‌ పాస్‌ను అందుకుని దాన్ని ఒడుపుగా పైకి లేపిన రిచర్లిసన్‌.. ఎడమవైపు పల్టీ కొడుతూ ఎదురుగా ఉన్న డిఫెండర్‌ను తప్పించి బంతిని గోల్‌లోకి పంపాడు. సెర్బియా గోల్‌కీపర్‌ గట్టిగా ప్రయత్నించినా బంతి అతడికి చిక్కకుండా మెరుపువేగంతో లోపలికి దూసుకెళ్లింది. అంతకుముందు రిచర్లిసన్‌ తొలి గోల్‌కు కూడా విన్సియసే సహకరించాడు. అతను చేసిన గోల్‌ ప్రయత్నాన్ని గోల్‌కీపర్‌ అడ్డుకోగా.. నెట్‌కు సమీపంలో కాచుకుని ఉన్న రిచర్లిసన్‌ రీబౌండ్‌ అయిన బంతిని గోల్‌లోకి పంపించేశాడు. దీనికి ముందు, తర్వాత బ్రెజిల్‌ చేసిన ప్రయత్నాలు కొన్ని త్రుటిలో తప్పిపోగా.. కొన్నింటిని మిలింకోవిచ్‌ సమర్థంగా అడ్డుకున్నాడు. నెయ్‌మార్‌ 50వ నిమిషంలో కొట్టిన ఫ్రీకిక్‌.. ఇంకో అయిదు నిమిషాల తర్వాత పెనాల్టీ ప్రాంతం నుంచి కొట్టిన షాట్‌ ఫలితాన్నివ్వలేదు.  
నెయ్‌మార్‌కు గాయం: తొలి మ్యాచ్‌లో చీలమండకు దెబ్బ తగిలి ఎక్కువసేపు మ్యాచ్‌లో కొనసాగలేక మైదానాన్ని వీడిన నెయ్‌మార్‌ గ్రూప్‌ దశలో మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. 2014లో క్వార్టర్స్‌లో తీవ్రంగా గాయపడిన నెయ్‌మార్‌ స్ట్రెచర్‌ మీద బయటికి వెళ్లాల్సి వచ్చింది. తర్వాత సెమీస్‌లో బ్రెజిల్‌కు ఘోర పరాభవం ఎదురైంది.


డ్రగ్స్‌ కాదు.. గోల్స్‌

చుట్టూ నేర ప్రవృత్తి ఉన్న మనుషులు.. ఏ క్షణంలో ఏ గన్‌ పేలుతుందో అన్న భయం.. ఒకవైపు మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌! ఇలాంటి పరిస్థితుల నుంచి ఓ ఛాంపియన్‌ పుట్టాడు. ఫిఫా ప్రపంచకప్‌లో తమ జట్టు బోణీ కొట్టడంలో కీలకపాత్ర పోషించాడు. అతడే రిచర్లిసన్‌. బ్రెజిల్‌ స్ట్రైకర్‌. సెర్బియాతో మ్యాచ్‌లో అసాధారణ కిక్‌తో మెరుపు గోల్‌ చేసి అందర్ని ఆకర్షించిన రిచర్లిసన్‌ది చాలా భిన్నమైన నేపథ్యం. బ్రెజిల్‌లోని నోవా వెనిసియా అనే మురికివాడలో పేద కుటుంబంలో పుట్టిన అతడు ఎదిగే క్రమంలో పడని కష్టాల్లేవు. అతడి తండ్రి భవన నిర్మాణ కార్మికుడు. తల్లి కూడా చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేది. రిచర్లిసన్‌ చుట్టూ వాతావరణం మాత్రం చాలా ప్రమాదకరంగా ఉండేది. అతడి స్నేహితుల్లో ఎక్కువమంది స్మగ్లర్లే. కానీ రిచర్లీసన్‌ మాత్రం తల్లికి సాయం చేయడానికి ఐస్‌ క్రీములు, చాక్లెట్లు అమ్మేవాడు. కార్లు కడిగేవాడు. ఒకసారి డ్రగ్స్‌ ఎత్తుకెళ్లేవాడని భావించి ఓ స్మగ్లర్‌ రిచర్లిసన్‌ కణతకు తుపాకీ గురిపెట్టాడు. ఆ క్షణంలో ప్రాణాలు పోయినట్లే అనిపించినా కొద్దిలో తప్పించుకున్నాడు. తన తనయుడు డ్రగ్స్‌ వలలో చిక్కుకోకూడదని రిచర్లిసన్‌ తండ్రి అతడిని ఫుట్‌బాల్‌వైపు నడిపించాడు. అదే అతడి జీవితాన్ని మార్చింది. వీధుల్లో ఫుట్‌బాల్‌ ఆడే అతడిని చూసి ఓ వ్యాపారవేత్త మెనిరో క్లబ్‌లో చేర్పించాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన అతడిని 60 మిలియన్‌ పౌండ్లు వెచ్చించి టొటొన్‌హమ్‌ దక్కించుంది. ఈ స్ట్రైకర్‌.. బ్రెజిల్‌ తరఫున ఇప్పటిదాకా 39 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 19 గోల్స్‌ కొట్టాడు.


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని