సంక్షిప్త వార్తలు (8)

ఫిడే ప్రపంచ టీమ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రిక్తహస్తమే మిగిలింది. శనివారం కాంస్య పతక పోరులో మన జట్టు 1-3తో స్పెయిన్‌ చేతిలో ఓడింది.

Updated : 27 Nov 2022 03:10 IST

కాంస్య పతక పోరులో భారత్‌ ఓటమి

జెరూసలేం: ఫిడే ప్రపంచ టీమ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రిక్తహస్తమే మిగిలింది. శనివారం కాంస్య పతక పోరులో మన జట్టు 1-3తో స్పెయిన్‌ చేతిలో ఓడింది. తొలి రెండు రౌండ్లు డ్రా కావడంతో స్కోరు 2-2తో సమమైంది. బ్లిట్జ్‌ టైబ్రేక్‌లో సాంటోస్‌ చేతిలో విదిత్‌ గుజరాతి.. డేవిడ్‌ ఆంటోన్‌ చేతిలో నిహాల్‌ సరీన్‌ ఓడిపోవడంతో భారత్‌ వెనుకబడింది. ఆ తర్వాత తప్పక గెలవాల్సిన గేముల్లో షిరోవ్‌తో నారాయణన్‌.. రుయిజ్‌తో అభిజిత్‌ గుప్తా డ్రా చేసుకోవడంతో మన బృందానికి ఓటమి తప్పలేదు. ఉజ్బెకిస్థాన్‌ను 4-0తో చిత్తు చేసిన చైనా ఈ టోర్నీలో విజేతగా నిలిచింది.


ఆధిక్యంలో హైదరాబాద్‌ బ్లాక్‌బర్డ్స్‌

చెన్నై: ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌లో హైదరాబాద్‌ బ్లాక్‌బర్డ్స్‌ ఆధిక్యంలో నిలిచింది. శనివారం, రెండో రౌండ్‌ తొలిరోజు జరిగిన రేసులో నీల్‌ జైన్‌, అఖిల్‌, లోవిన్‌ఫోస్‌, అనిందిత్‌రెడ్డిలతో కూడిన హైదరాబాద్‌ సత్తా చాటింది. తొలి క్వాలిఫయింగ్‌ రేసులో అఖిల్‌ 1 నిమిషం 32.787 సెకన్లలో లక్ష్యాన్ని చేరి పోల్‌ పోజిషన్‌ సాధించగా.. రెండో క్వాలిఫయింగ్‌ రేసులో నీల్‌ (1 నిమిషం 32.108 సెకన్లు) కూడా ముందంజలో నిలిచి పోల్‌ సొంతం చేసుకున్నాడు. స్ప్రింట్‌ తొలి రేసులో జానీ అగ్రస్థానం సాధించి హైదరాబాద్‌ను ఆధిక్యంలో నిలిపాడు.


హైదరాబాద్‌ పరాజయం

కోల్‌కతా: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హైదరాబాద్‌కు ఓటమి ఎదురైంది. శనివారం ఏటీకే మోహన్‌ బగాన్‌ 1-0తో హైదరాబాద్‌ను ఓడించింది. 11వ నిమిషంలో బౌమాస్‌ మోహన్‌ బగాన్‌ను ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత రెండు జట్లు గోల్స్‌ చేయడంలో విఫలమయ్యాయి. ఈ ఓటమితో హైదరాబాద్‌ (16) పాయింట్ల పట్టికలో అగ్రస్థానం నుంచి రెండో స్థానానికి పడింది. ముంబయి ఎఫ్‌సీ (18) నం.1 స్థానంలో ఉంది.


టైటాన్స్‌ ఓటమి బాటలోనే..

ఈనాడు, హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-9లో వరుస ఓటముల తర్వాత ఓ విజయాన్ని అందుకున్న తెలుగు టైటాన్స్‌ మళ్లీ పాత పంథాలోనే నడుస్తోంది. ఆ జట్టు వరుసగా రెండో ఓటమి చవిచూసింది. శనివారం టైటాన్స్‌ 25-38తో పుణెరి పల్టాన్‌ చేతిలో తలొంచింది. పంకజ్‌ (8), ఆకాశ్‌ (5) పుణెరి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. 18 మ్యాచ్‌ల్లో టైటాన్స్‌కు ఇది పదహారో ఓటమి. మరో మ్యాచ్‌లో యు ముంబా 49-41తో బెంగాల్‌ వారియర్స్‌ను ఓడించింది. గుమన్‌ (14), ఆశిష్‌ (13) జట్టును ఒంటిచేత్తో గెలిపించారు. ఇంకో మ్యాచ్‌లో యూపీ యోధాస్‌ 35-33తో పట్నా పైరేట్స్‌పై నెగ్గింది. యూపీ జట్టులో ప్రదీప్‌ నర్వాల్‌ (15) సత్తా చాటాడు.


హాకీలో భారత్‌ ఓటమి

అడిలైడ్‌: ఆస్ట్రేలియా పర్యటనలో బోణీ కొట్టే అవకాశాన్ని భారత హాకీ జట్టు కొద్దిలో చేజార్చుకుంది. ఆకాశ్‌దీప్‌ సింగ్‌ హ్యాటిక్‌తో మెరిసినా అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగా శనివారం  తొలి మ్యాచ్‌లో మన జట్టు 4-5 గోల్స్‌తో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. మొదట షార్ప్‌ (5వ ని) చేసిన గోల్‌తో కంగారూ జట్టు ఆధిక్యంలోకి వెళ్లగా.. ఆకాశ్‌దీప్‌ (10వ) మెరవడంతో వెంటనే మన జట్టు పుంజుకుంది. ఆపై ఆస్ట్రేలియాకు నాథన్‌ (21వ).. భారత్‌ తరఫున ఆకాశ్‌దీప్‌ (27వ) గోల్స్‌ సాధించడంతో 2-2తో స్కోరు సమమైంది. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (31వ) ఓ గోల్‌ కొట్టడంతో భారత్‌ 3-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ మన సంబరం కాసేపే. క్రెయిగ్‌ (41వ), గోవర్స్‌ (57వ) బంతిని లక్ష్యానికి చేర్చి 4-3తో ఆస్ట్రేలియాకు మరోసారి ఆధిక్యాన్ని అందించారు. ఈ స్థితిలో ఆకాశ్‌దీప్‌ (59వ) హ్యాట్రిక్‌ గోల్‌ చేయడంతో 4-4తో స్కోరు సమమయ్యాయి. ఈ స్థితిలో మ్యాచ్‌ డ్రాగా ముగియడం ఖాయమనిపించింది. కానీ ఆఖర్లో పట్టు సడలించిన భారత్‌ చేజేతులా ఓడింది. గోవర్స్‌ (60వ ని) కంగారూ జట్టుకు గెలుపు గోల్‌ కొట్టాడు.


ఛాలెంజర్‌ విజేత భారత్‌-డి

రాయ్‌పుర్‌: మహిళల టీ20 ఛాలెంజర్‌ ట్రోఫీలో భారత్‌-డి విజేతగా నిలిచింది. యస్తికా భాటియా (80 నాటౌట్‌) చెలరేగడంతో శనివారం ఫైనల్లో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో భారత్‌-ఎను ఓడించింది. మొదట ‘ఎ’ 144/5 స్కోరు చేసింది. హర్లీన్‌ డియోల్‌ (61; 48 బంతుల్లో 8×4, 1×6), పర్వీన్‌ (50; 43 బంతుల్లో 6×4) రాణించారు. ‘డి’ బౌలర్లలో రేణుక (3/24), రాజేశ్వరి (2/21) ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఛేదనలో జసియా (47)తో కలిసి తొలి వికెట్‌కు 70 పరుగులు జత చేసిన యస్తికా ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేసింది. ఆ తర్వాత వరుసగా వికెట్లు చేజారినా.. సుష్మ (13 నాటౌట్‌) తోడుగా యస్తికా జట్టును గెలిపించింది. భారత్‌-డి 19 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.


అమెరికాను దాటని ఇంగ్లాండ్‌

అల్‌ ఖోర్‌: ఇంగ్లాండ్‌కు మళ్లీ నిరాశే. ప్రపంచకప్‌లో అమెరికాపై విజయం ఆ జట్టుకు అందని ద్రాక్షగానే మిగిలింది. తొలి మ్యాచ్‌లో ఇరాన్‌పై 6-2తో ఘన విజయం సాధించి టైటిల్‌ ఫేవరెట్‌ అంచనాలను నిలబెట్టుకునేలా కనిపించిన ఆ జట్టు.. అమెరికాతో పోరులో చతికిలపడింది. శనివారం గ్రూప్‌-బిలో ఈ రెండు జట్ల మ్యాచ్‌ 0-0తో డ్రాగా ముగిసింది. 1950లో 0-1తో అమెరికా చేతిలో అనూహ్య ఓటమి పాలైన ఇంగ్లాండ్‌.. 2010లో 1-1తో డ్రా చేసుకుంది. ఇప్పుడు మూడోసారి కూడా గెలవలేకపోయింది. ఈ టోర్నీలో ఇరాన్‌పై చెలరేగిన ఇంగ్లాండ్‌ ఎటాకింగ్‌.. అమెరికాతో మ్యాచ్‌లో తడబడింది. పదో నిమిషంలో గోల్‌ చేసేందుకు వచ్చిన చక్కటి ప్రయత్నాన్ని కెప్టెన్‌ హ్యారీ కేన్‌ సద్వినియోగం చేయలేకపోయాడు.


12 రికార్డు స్థాయిలో ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధికంగా ఇంగ్లాండ్‌ గోల్‌ లేని డ్రా నమోదు చేసిన మ్యాచ్‌లు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని