నిలిచిన ఆస్ట్రేలియా ఆశలు

ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా నాకౌట్‌ ఆశలు నిలిచాయి. గ్రూప్‌ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే ట్యూనీసియాతో మ్యాచ్‌లో కనీసం డ్రా చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఆ జట్టు సత్తాచాటింది.

Updated : 27 Nov 2022 03:07 IST

ట్యూనీసియాపై విజయం

అల్‌ వాక్రా: ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా నాకౌట్‌ ఆశలు నిలిచాయి. గ్రూప్‌ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే ట్యూనీసియాతో మ్యాచ్‌లో కనీసం డ్రా చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఆ జట్టు సత్తాచాటింది. 12 ఏళ్ల తర్వాత మెగా టోర్నీలో తొలి గెలుపు అందుకుంది. శనివారం గ్రూప్‌-డి మ్యాచ్‌లో ఆసీస్‌ 1-0తో విజయం సాధించింది. మిచ్‌ డ్యూక్‌ (23వ నిమిషం) గెలుపు గోల్‌ కొట్టాడు. బంతిపై నియంత్రణ (50 శాతం), గోల్‌పోస్టుపై దాడులు (13).. ఇలా మ్యాచ్‌లో ట్యునీసియాదే ఆధిపత్యం. కానీ గెలుపు మాత్రం ఆసీస్‌ది. గుడ్‌విన్‌ నుంచి పాస్‌ అందుకున్న డ్యూక్‌.. తన కుడివైపు వెనకాల ఉన్న గోల్‌పోస్టులోకి తలతో బంతిని పంపించి జట్టుకు ఆనందాన్ని అందించాడు. గోల్‌పోస్టు ఉన్న దిక్కును, బంతి వేగాన్ని సరిగ్గా అంచనా వేసి ఉత్తమ ఫలితం రాబట్టాడు. ఆ తర్వాత స్కోరు సమం చేసేందుకు ట్యునీసియా దూకుడు ప్రదర్శించింది. కానీ ఆసీస్‌ రక్షణశ్రేణి బలంగా నిలబడి ప్రత్యర్థి ప్రయత్నాలను తిప్పికొట్టింది. 41వ నిమిషంలో గోల్‌పోస్టుకు సమీపంలో డ్రాగర్‌ కొట్టిన బంతిని ఆసీస్‌ ఆటగాళ్లు సమర్థంగా అడ్డుకున్నారు. కొద్దిసేపటికే ట్యునీసియా కెప్టెన్‌ మసాక్ని కిక్‌ గోల్‌పోస్టు పక్కనుంచే వెళ్లింది. రెండో అర్ధభాగంలోనూ పోరు హోరాహోరీగా సాగింది. కానీ కంగారూ జట్టు పోరాటం ముందు ట్యునీసియా గోల్‌ చేయలేక ఓటమి మూటగట్టుకుంది.


1

2010లో సెర్బియాపై గెలుపు తర్వాత ప్రపంచకప్‌లో ఆసీస్‌కిదే తొలి విజయం.

 

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు