సౌదీకి పోలెండ్‌ చెక్‌

ఫిఫా ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో అర్జెంటీనాను ఓడించి పెను సంచలనం సృష్టించిన సౌదీ అరేబియా దూకుడుకి కళ్లెం పడింది.

Published : 27 Nov 2022 02:01 IST

దోహా: ఫిఫా ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో అర్జెంటీనాను ఓడించి పెను సంచలనం సృష్టించిన సౌదీ అరేబియా దూకుడుకి కళ్లెం పడింది. శనివారం గ్రూప్‌-సి పోరులో పోలెండ్‌ 2-0తో సౌదీపై ఘన విజయం సాధించింది. పటిష్టమైన డిఫెన్స్‌..మెరుపు ఎటాకింగ్‌తో ప్రత్యర్థిపై ఎదురుదాడి చేసిన పోలెండ్‌.. సౌదీకి ఊపిరాడనీయలేదు. ఈ ప్రయత్నాలకు ఫలితాన్ని ఇస్తూ 39వ నిమిషంలో జీలిన్‌స్కీ గోల్‌ చేసి పోలెండ్‌ను ఆధిక్యంలో నిలిపాడు. సౌదీ గోల్‌ ప్రాంతంలో లెవాన్‌డోస్కీ నుంచి పాస్‌ అందుకున్న జీలిన్‌స్కీ ఒడుపుగా బంతిని గోల్‌లోకి పంపేశాడు. కాసేపటికే గోల్‌ చేసేందుకు సౌదీకి బంగారం లాంటి అవకాశం వచ్చింది. కానీ ఆ జట్టు దీన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడం మ్యాచ్‌లో మలుపు. 44వ నిమిషంలో లభించిన ఓ పెనాల్టీని అల్‌ దౌసారి వృథా చేశాడు. గోల్‌కు కుడి వైపు దౌసారి కొట్టిన షాట్‌ను కీపర్‌ షెజ్నీ మెరుపు డైవ్‌తో ఆపేశాడు. రీబౌండ్‌ వచ్చిన బంతిని అల్‌ బురాక్‌ తన్నినా కూడా షెజ్నీ చేతులు అడ్డుపెట్టి దిశ మార్చేశాడు. మంచి అవకాశం కోల్పోవడంతో సౌదీ డీలా పడగా.. పెనాల్టీని ఆపామన్న ఉత్సాహంతో పోలెండ్‌ మరింత ఉత్సాహంగా కదిలింది. ద్వితీయార్థంలోనూ సౌదీకి కలిసి రాలేదు. పైగా ఆ జట్టును కుంగదీస్తూ లెవాన్‌డోస్కీ (82వ ని) గోల్‌ కొట్టేశాడు. ఈ గోల్‌ సౌదీ స్వయంకృతమే. ట్యాకిల్‌ చేసే ప్రయత్నంలో సౌదీ డిఫెండర్‌ అల్‌ మలాకీ నియంత్రణ తప్పడంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అక్కడే పొంచి ఉన్న లెవాన్‌డోస్కీ బంతిని దొరకబుచ్చుకుని కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ గోల్‌ సాధించాడు. ప్రపంచకప్‌ టోర్నీలో గత నాలుగు మ్యాచ్‌ల్లో నిరాశపరిచిన లెవాన్‌డోస్కీ తొలిసారి గోల్‌ సాధించాడు. ఈ గోల్‌ తర్వాత పోలెండ్‌కు విజయం లాంఛనమే అయింది. ఒక గెలుపు, ఒక డ్రాతో పోలెండ్‌ (4 పాయింట్లు) గ్రూప్‌-సిలో అగ్రస్థానంలో నిలవగా.. సౌదీ (3) రెండో స్థానంలో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని