భారత్‌ పుంజుకునేనా?

సొంతగడ్డపై వన్డేల్లో న్యూజిలాండ్‌ జోరు కొనసాగిస్తోంది. స్వదేశంలో వరుసగా 13 వన్డేలు గెలిచింది. ఈ నేపథ్యంలో ఆ జట్టుతో కీలక పోరుకు సిద్ధమైంది భారత్‌.

Updated : 27 Nov 2022 06:41 IST

న్యూజిలాండ్‌తో రెండో వన్డే నేడు
ఉ.7 గంటల నుంచి

సొంతగడ్డపై వన్డేల్లో న్యూజిలాండ్‌ జోరు కొనసాగిస్తోంది. స్వదేశంలో వరుసగా 13 వన్డేలు గెలిచింది. ఈ నేపథ్యంలో ఆ జట్టుతో కీలక పోరుకు సిద్ధమైంది భారత్‌. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారమే రెండో వన్డే. తొలి వన్డేలో ఓడిన భారత్‌ సిరీస్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో గెలుపు తప్పనిసరి. ధావన్‌ నేతృత్వంలోని టీమ్‌ఇండియా ఎలా పుంజుకుంటుందో చూడాలి.

బౌలింగ్‌ మెరుగుపడాలి..: బౌలింగ్‌ను మెరుగుపర్చుకోవడం భారత్‌కు చాలా అవసరం. తొలి వన్డేలో 300పై లక్ష్యాన్ని కూడా మన బౌలర్లు కాపాడలేకపోయిన సంగతి తెలిసిందే. భారత పేసర్లు మరీ షార్ట్‌గా బౌలింగ్‌ చేశారు. ఈ ఫార్మాట్లో ఏళ్లుగా భారత్‌పై నిలకడగా రాణిస్తోన్న లేథమ్‌, విలియమ్సన్‌లను కట్టడి చేయడానికి వాళ్లు మార్గాలను అన్వేషించాల్సిన అవసరముంది. యువ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ 145 కిలోమీటర్ల పై వేగంతో ఆకట్టుకున్నాడు. అర్ష్‌దీప్‌ మాత్రం స్వింగ్‌ చేసే సామర్థ్యమున్నా పేస్‌తో ఇబ్బందిపడ్డాడు. శార్దూల్‌ ఠాకూర్‌ లయ తప్పాడు. స్పిన్నర్‌ చాహల్‌ కూడా పుంజుకోవాల్సివుంది. ఇక ఆరో బౌలింగ్‌ ప్రత్యామ్నాయం లేకపోవడం భారత్‌కు సమస్యగా మారింది. ఆక్లాండ్‌లో ఆడిన టాప్‌-6 బ్యాటర్లలో ఒక్కరూ బౌలింగ్‌ చేయలేరు. ఈ నేపథ్యంలో ఆరో బౌలర్‌ సమస్యను అధిగమించడానికి టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ దీపక్‌ హుడాను తీసుకునే అవకాశముంది. కానీ అలా చేస్తే ఒక బ్యాటర్‌ను తప్పించాల్సివుంటుంది. మరోవైపు సూర్యకుమార్‌ యాదవ్‌ వన్డేల్లో లయ అందుకోవడం ముఖ్యం. టీ20ల్లోలా 50 ఓవర్ల ఆటలో అతడు ఆడలేకపోతున్నాడు. గత ఏడు వన్డేల్లో సూర్య వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు 27 మాత్రమే. శార్దూల్‌ స్థానంలో దీపక్‌ చాహర్‌ జట్టులోకి రావొచ్చు. ఇక బ్యాటుతో ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, శుభ్‌మన్‌ గిల్‌ పవర్‌ప్లేలో మరింత దూకుడు ప్రదర్శించాల్సిన అవసరముంది. తొలి వన్డేలో ఈ జోడీ తొలి వికెట్‌కు 123 పరుగులు జోడించినా పవర్‌ప్లేలో అవసరమైనంత వేగంగా పరుగులు రాబట్టలేదు. ఈడెన్‌ పార్క్‌ లాంటి చిన్న మైదానంలో భారత్‌ సాధించిన స్కోరు (306/7) సరిపోలేదు. ఆఖర్లో వాషింగ్టన్‌ సుందర్‌ చెలరేగకుంటే ఆ స్కోరు కూడా అయ్యేది కాదు. ఈ నేపథ్యంలో ఆరంభంలో జాగ్రత్తగా ఆడే వైఖరికి ఓపెనర్లు స్వస్తి చెప్పడం అవసరం. మరోవైపు న్యూజిలాండ్‌ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. సొంతగడ్డపై విజయపరంపరను కొనసాగించాలనుకుంటోంది. చిన్నపాటి గాయంతో తొలి వన్డేకు దూరమైన నీషమ్‌ జట్టులోకి వచ్చే అవకాశముంది.


పరుగుల వరదే..

రెండో వన్డేలో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశముంది. మ్యాచ్‌ వేదిక సెడాన్‌ పార్క్‌ 2020 నుంచి మూడు వన్డేలకు మాత్రమే ఆతిథ్యమిచ్చింది. రెండుసార్లు 330పై స్కోరు వచ్చాయి. ఓ మ్యాచ్‌లో భారత్‌ 347 పరుగులు సాధించింది. వర్షం వల్ల ఆటకు అంతరాయాలు కలిగే అవకాశముంది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని