నాకౌట్లో ఫ్రాన్స్‌

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌ అదరగొట్టింది. యువ ఆటగాడు ఎంబాపె డబుల్‌తో 2-1తో డెన్మార్క్‌ను ఓడించింది. గ్రూప్‌-డిలో వరుసగా రెండో విజయం సాధించిన ఫ్రాన్స్‌.. ఈ ప్రపంచకప్‌ నాకౌట్‌ చేరిన తొలి జట్టుగా నిలిచింది.

Published : 27 Nov 2022 02:05 IST

డెన్మార్క్‌పై 2-1తో విజయం  
ఎంబాపె డబుల్‌

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌ అదరగొట్టింది. యువ ఆటగాడు ఎంబాపె డబుల్‌తో 2-1తో డెన్మార్క్‌ను ఓడించింది. గ్రూప్‌-డిలో వరుసగా రెండో విజయం సాధించిన ఫ్రాన్స్‌.. ఈ ప్రపంచకప్‌ నాకౌట్‌ చేరిన తొలి జట్టుగా నిలిచింది.

ఎంబాపె అదిరే ప్రదర్శనతో ఫ్రాన్స్‌ మురిసింది. శనివారం ఆసక్తికరంగా సాగిన గ్రూప్‌-డి మ్యాచ్‌లో ఆ జట్టు 2-1తో డెన్మార్క్‌ను ఓడించి నాకౌట్లో (16 జట్ల రౌండ్‌)కి దూసుకెళ్లింది. ఎంబాపె 61వ, 86వ నిమిషాల్లో ఫ్రాన్స్‌కు గోల్స్‌ అందించగా.. డెన్మార్క్‌ తరఫున క్రిస్టెన్సన్‌ (68వ) గోల్‌ సాధించాడు. ఫ్రాన్స్‌ తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించింది. డెన్మార్క్‌తో పోరులో ఫ్రాన్స్‌ ఆధిపత్యం స్పష్టం. బంతి నియంత్రణలో జట్లు దాదాపు సమానంగానే ఉన్నా.. ఎక్కువ ఎటాకింగ్‌ గేమ్‌ ఆడింది మాత్రం ఫ్రాన్సే. దూకుడైన ఆటతో ఆద్యంతం ప్రమాదకరంగా కనిపించిన ఆ జట్టు డెన్మార్క్‌ రక్షణశ్రేణిని ఒత్తిడికి గురి చేసింది. పదో నిమిషంలో అవకాశం సృష్టించుకుంది. ఫ్రీ కిక్‌ను గ్రీజ్‌మన్‌ డెన్మార్క్‌ పెనాల్టీ ప్రాంతంలోకి కొట్టాడు. కానీ డెన్మార్క్‌ డిఫెండర్‌ ఆండ్రియాస్‌ కార్నెలియస్‌ తలతో దాన్ని పక్కకు పంపాడు. ఒత్తిడి కొనసాగించిన ఫ్రాన్స్‌ 21 నిమిషంలో ఆధిక్యంలోకి దూసుకెళ్లేదే. కానీ గోల్‌కీపర్‌ ష్మీషెల్‌ కారణంగా డెన్మార్క్‌ బతికిపోయింది. మిడ్‌ఫీల్డ్‌ నుంచి గ్రీజ్‌మన్‌ ఫ్రీకిక్‌ను డెంబెలెకు అందించాడు. అతడి నుంచి వచ్చిన క్రాస్‌ను రబియోట్‌ తలతో నెట్‌ దిశగా కొట్టాడు. కానీ ష్మీషెల్‌ దాన్ని గొప్పగా తిప్పికొట్టాడు. తన కుడివైపునకు దూకుతూ అతడు బంతిని దూరంగా కొట్టాడు. 37వ నిమిషంలో గిరౌడ్‌ (ఫ్రాన్స్‌) బంతిని తలతో డెన్మార్క్‌ గోల్‌కు దూరంగా కొట్టాడు. 41వ నిమిషంలో ఫ్రాన్స్‌కు గోల్‌ కొట్టేందుకు మరో అద్భుత అవకాశం లభించింది. కానీ ఎంబాపె సమీపం నుంచి ఆడిన షాట్‌ క్రాస్‌బార్‌పై నుంచి వెళ్లింది. డెన్మార్క్‌ కూడా ప్రథమార్ధంలో రెండు ప్రయత్నాలు చేసింది. అయితే ఫ్రాన్స్‌ దూకుడుకు రెండో అర్ధభాగంలో డెన్మార్క్‌కు తలవంచక తప్పలేదు. దాడులు కొనసాగించిన ఫ్రాన్స్‌.. ఎంబాపె సూపర్‌ గోల్‌తో 61వ నిమిషంలో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఎడమ నుంచి డెన్మార్క్‌ నెట్‌ వైపు దూసుకెళ్లిన ఎంబాపె.. హెర్నాండెజ్‌ దిశగా బంతిని పంపి నెట్‌కు ఇంకా దగ్గరగా వెళ్లాడు. డెన్మార్క్‌ డిఫెండర్లను తప్పిస్తూ హెర్నాండెజ్‌ బంతిని తిరిగి ఎంబాపెకు పంపగా.. అతడు చాలా దగ్గర నుంచి బంతిని నెట్లో తన్నాడు. అంత దగ్గర నుంచి ఎంబాపె కొట్టిన షాట్‌ను అడ్డుకోవడం ష్మీషెల్‌కు అసాధ్యమైపోయింది. కానీ ఫ్రాన్స్‌ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. 68వ నిమిషంలో క్రిస్టెన్సన్‌ గోల్‌తో డెన్మార్క్‌ స్కోరు సమం చేసింది. ఎరిక్సన్‌ కార్నర్‌ కిక్‌ను అతడు తలతో కొట్టి అలవోకగా ఫ్రాన్స్‌ గోల్‌కీపర్‌ను లోరిస్‌ను బోల్తా కొట్టించాడు. అయితే లోరిస్‌ 73వ నిమిషంలో గొప్ప సేవ్‌తో డెన్మార్క్‌కు రెండో గోల్‌ దక్కకుండా చేశాడు. లిండ్‌స్టామ్‌ షాట్‌ను అతడు అడ్డుకున్నాడు. రెండు జట్లూ గట్టిగా పోటీపడుతుండడంతో మ్యాచ్‌ డ్రా అవుతుందేమో అనిపించింది. కానీ ఎంబాపె మరో గోల్‌తో డెన్మార్క్‌కు షాకిచ్చాడు. 86వ నిమిషంలో డెన్మార్క్‌ గోల్‌కు అతి సమీపంలోకి గ్రీజ్‌మన్‌ ఇచ్చిన క్రాస్‌ను ఎంబాపె నెట్లోకి కొట్టేశాడు. అంతే ఫ్రాన్స్‌ సంబరాల్లో మునిగిపోయింది. ఆఖరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. ప్రతి గూప్‌ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు అర్హత సాధిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని