మెస్సి కొట్టగ.. అర్జెంటీనా నిలవగ!

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి.. కానీ తొలి మ్యాచ్‌లోనే అనూహ్య పరాజయం.

Updated : 28 Nov 2022 04:26 IST

మెక్సికోపై విజయం
లుసాయిల్‌

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి.. కానీ తొలి మ్యాచ్‌లోనే అనూహ్య పరాజయం. టోర్నీలో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన రెండో మ్యాచ్‌లో మెక్సికో బలంగా నిలబడడంతో గోల్స్‌ రావడం లేదు.. తొలి అర్ధభాగం ముగిసింది.. సమయం గడుస్తోంది. అర్జెంటీనా అభిమానుల్లో ఆందోళన.. ఆటగాళ్లపై ఒత్తిడి. అప్పుడే మెస్సి బంతి అందుకున్నాడు.. తనకు అలవాటైన రీతిలో కళ్లు చెదిరే రీతిలో గోల్‌పోస్టులోకి పంపించాడు. అంతే స్టేడియం మార్మోగింది. మెస్సి భాగస్వామ్యంతో ఫెర్నాండెజ్‌ మరో గోల్‌ చేసి జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు.

మెస్సి జట్టు నిలిచింది. ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లో 1-2తో సౌదీ అరేబియా చేతిలో అనూహ్య ఓటమి చెందిన ఆ జట్టు బలంగా పుంజుకుంది. గ్రూప్‌ దశలోనే నిష్క్రమించే ప్రమాదాన్ని తప్పించుకుంది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన గ్రూప్‌-సి పోరులో అర్జెంటీనా 2-0 తేడాతో మెక్సికోపై గెలిచింది. తీవ్ర ఒత్తిడి సమయంలో.. ప్రత్యర్థి బలంగా నిలబడ్డ వేళలో.. జట్టును ఆదుకునే మెస్సి మరోసారి ఆ పాత్ర పోషించాడు. 64వ నిమిషంలో గోల్‌తో జట్టు ఖాతా తెరిచి జట్టు ఆశలు నిలిపాడు. అంతకంటే ముందు ఫ్రీకిక్‌ను వృథా చేసిన అతను గోల్‌తో లెక్క సరిచేశాడు. సహచర ఆటగాళ్లలో స్ఫూర్తి నింపాడు. ఇదే జోరులో ఫెర్నాండెజ్‌ (87వ నిమిషంలో) మరో గోల్‌ కొట్టి జట్టుకు రెట్టింపు ఆనందాన్ని అందించాడు. మెస్సి నుంచి బంతి అందుకున్న అతను.. గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ గోల్‌ సాధించాడు.

ఆ గోల్‌తో..: మ్యాచ్‌లో ఆధిపత్యం అర్జెంటీనాదే. మెక్సికో (36 శాతం) కంటే అధిక (50) శాతం బంతి ఆ జట్టు నియంత్రణలోనే ఉంది. మ్యాచ్‌లో 464 పాసులు పూర్తి చేసింది. కానీ గోల్స్‌ వేటలో మాత్రం తడబడింది. నాకౌట్‌ అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన పోరులో ఆ జట్టుకు మెక్సికో నుంచి సవాలు ఎదురైంది. ప్రత్యర్థి రక్షణ శ్రేణి బలంగా నిలబడడంతో మెస్సి జట్టు గోల్స్‌ కోసం చెమటోడ్చక తప్పలేదు. మరోవైపు మెక్సికో కూడా ఎదురు దాడి చేసింది. 45వ నిమిషంలో అలెక్సిస్‌ కొట్టిన ఫ్రీకిక్‌ను అర్జెంటీనా గోల్‌ కీపర్‌ మార్టినెజ్‌ అద్భుతంగా అడ్డుకున్నాడు. బంతిని సరిగ్గా అంచనా వేసి గాల్లో కుడివైపునకు డైవ్‌ చేసి ఆపాడు. తొలి అర్ధభాగం గోల్స్‌ నమోదు కాకుండానే ముగిసింది. ద్వితీయార్ధంలో అర్జెంటీనా దూకుడు పెంచింది. 51వ నిమిషంలో మెస్సీకి ఫ్రీకిక్‌ రూపంలో మంచి అవకాశం లభించింది. కానీ అతను తన్నిన బంతి గోల్‌ పోస్టు పైనుంచి వెళ్లిపోయింది. ఎన్నో మ్యాచ్‌ల్లో.. ఫ్రీకిక్‌తో బంతిని అలవోకగా నెట్‌లోకి పంపించిన అతను ఈసారి విఫలమయ్యాడు. దీంతో సమయం గడుస్తున్నా కొద్దీ అర్జెంటీనా అభిమానుల్లో ఆందోళన పెరిగింది. అప్పుడే సరిగ్గా మెస్సి మాయ చేశాడు. డి మారియా నుంచి పెనాల్టీ ప్రదేశం బయట బంతి అందుకున్న అతను.. ముగ్గురు ప్రత్యర్థి ఆటగాళ్ల మధ్యలో నుంచి.. గోల్‌ కీపర్‌కు దొరకకుండా లోపలికి పంపించాడు. అంతే ఒక్కసారిగా అర్జెంటీనా ఆటగాళ్లు, కోచ్‌, అభిమానులు హమ్మయ్యా! అంటూ ఊపిరి తీసుకున్నారు. అక్కడి నుంచి అర్జెంటీనా మరింత రెచ్చిపోయి ఆడింది. ప్రత్యర్థి గోల్‌పోస్టుపై దాడులు పెంచింది. చివర్లో ఫెర్నాండెజ్‌ గురి చూసి గోల్‌ కీపర్‌ పైనుంచి బంతిని లోపలికి పంపించాడు. దీంతో అర్జెంటీనా తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకుని విజయం సాధించింది.


1

అయిదు వేర్వేరు ప్రపంచకప్‌ల్లో సహచర ఆటగాళ్లు గోల్స్‌ చేయడంలో భాగస్వామిగా నిలిచిన తొలి ఆటగాడిగా మెస్సి ఘనత సాధించాడు.

* ప్రపంచకప్‌ల్లో అత్యధిక మ్యాచ్‌లు (21) ఆడిన అర్జెంటీనా ఆటగాడిగా డీగో మారడోనా రికార్డును మెస్సి సమం చేశాడు. అంతేకాకుండా ఈ టోర్నీ చరిత్రలో ఎనిమిది గోల్స్‌తో మారడోనాను సమం చేశాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని